క్లీన్ & గ్రీన్ ఎనర్జీ పాలసీపై సమీక్ష

వాతావరణ మార్పుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక శక్తి విధానం ఉండాలని మేం ఏనాటి నుంచో కోరుతున్నాం.  ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక ముసాయిదా విధానం ప్రకటించింది. దీనిమీద విస్తృత సంప్రదింపుల అనంతరం తుది ఆమోదం ఇస్తే బాగుంటుంది.  సంప్రదింపులలో భాగంగా జనవరి 3న ఒక అంతర్జాతీయ సమావేశం నిర్వహించినా  అది ఉన్నత వ్యాపారవర్గాలకే పరిమితం అయ్యింది. ముసాయిదా ప్రతి ప్రజలందరికి అందుబాటులో ఉంచి,  అభిప్రాయ సేకరణ చేసిఈ విధానానికి ఒక తుదిరూపు తీసుకురావాల్సిన అవసరం ఉన్నా, రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం ఇచ్చేసింది. 

 తెలంగాణకు శక్తి పరివర్తన విధానం అవసరమే. అందులో అనుమానం లేదు.  కాకపోతే  ప్రకటించిన విధానంలో అనేక లోపాలు ఉన్నాయి . తెలంగాణలో క్లీన్ ఎనర్జీ  ఎలా,  ఎందుకు అవసరమో అంచనా వేయలేదు. ఈ విధానం ఎందుకు అవసరమో విశ్లేషించడం, మనం ఏ స్థితిలో ఉన్నామో అంచనా వేయడం ద్వారా మార్పుకు ఉద్దేశించిన లక్ష్యం ఏర్పడుతుంది.  విధాన రూపకల్పనలోఇది ప్రాథమిక దశ.  నేను ఇచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు కనిపించినా ఇంకా అనేక మార్పులు తీసుకోలేదు.

తెలంగాణ సుస్థిర అభివృద్ధికి ‘శక్తి వనరుల భద్రత’ (ఎనర్జీ సెక్యూరిటీ) వంటి విస్తృత లక్ష్యం చేర్చినా,  కర్బన (కాలుష్య) ఉద్గారాలను తగ్గించడం, సహజ వనరుల సంరక్షణ, సుస్థిర అభివృద్ధి వంటి స్పష్టమైన, కొలవగల లక్ష్యం లేదు.  వనరులు, అవకాశాలు, అడ్డంకులు, వ్యూహాల అంచనాల లేమి కారణంగా దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. అమలు చేసే సమయంలో ఇవి బయటకు వస్తాయి.ఈ విధానానికి జోడించాల్సిన సామాజిక, ఆర్థిక, పర్యావరణ, సాంకేతిక, శాస్త్రీయ వంటి అనేక అంశాలు ఉన్నాయి. వీటి మధ్య పరస్పర చర్య  అంచనా లేదు.  నా దృష్టిలో ఈ విధానానికి పెట్టుబడిదారులు ప్రజలే కావాలి.  ప్రజల నుంచి పెట్టుబడులు వచ్చేవిధంగా విధానం రూపొందిస్తే బాగుండేది. 

ప్రస్తుత విధానంగా ప్రకటించిన ఈ పథకాల కూర్పు బాహ్య పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చేసిన వ్యూహ రచన. బహుశా తయారు చేసింది కూడా ఒక కన్సల్టెన్సీ సంస్థ కావచ్చు. తలసరిగా దాదాపు రూ.4 లక్షల కోట్ల ఆదాయం వస్తున్న తెలంగాణాలో సగటు మనిషిని పెట్టుబడికి ప్రోత్సహించే వ్యూహం ప్రభుత్వం ఆలోచించడం లేదు. అదే పెద్ద లోపం ఇక్కడ. ఈ విధానంలో ప్రస్తావించిన ప్రతి శక్తి ప్రత్యామ్నాయంలో వివిధ దశలలో విభిన్న సవాళ్లు ఉన్నాయి.

తక్కువ ఉద్గారాల మీద పరిశోధన అవసరం

ఈ విధానం సుస్థిరమైనది, నిర్దిష్టమైనది, కొలవదగినది, సాధించదగినది, సంబంధితమైనది, సమయానుకూలమైనది – స్మార్ట్ - కాదు.  అక్కడక్కడ కొన్ని కొలతలు, కొలమానాలు ఉన్నప్పటికీ సంపూర్ణంగా లేవు. ప్రకటించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఏర్పడే అడ్డంకులు, ఆటుపోట్లను స్పష్టంగా గుర్తించలేదు. గృహ అవసరాలకు, వస్తు ఉత్పత్తి, వ్యాపారాలకు సురక్షితమైన, స్థిరమైన, సరసమైన ఇంధన సరఫరాను అందించడం, ఇంధన వనరులను వైవిధ్యపరచడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్వచ్ఛమైన శక్తి, తక్కువ ఉద్గారాల పద్దతుల మీద  పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి అంశాలతో కూడిన విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించాలి. 

వాస్తవానికి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అంటే వివిధ విధానాలు, వ్యూహాల సమాహారంగా పరిగణిస్తూ క్రమంగా కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ఇంధన, శక్తి వనరులను మళ్ళించడం, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడం, అంతర్గత పనితీరును మెరుగుపరచడం వంటి చర్యలతో సహా తక్కువ- కార్బన్ ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణను నడిపించే వ్యూహ రచన అవసరం ఉన్నది. 

బయోఫ్యూయెల్​ ప్రస్తావన లేదు

ప్రకటించిన విధానంలో వివిధ శక్తి వనరుల ప్రస్తావన ఉన్నా వాటి పట్ల స్పష్టమైన ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత లేకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ముందుకు పోవడం వల్ల ఫలితం రాదు.  తెలంగాణలో ఇప్పటికే జీవ ఇంధన (biofuel) యూనిట్లు ఉన్నాయి. వాటిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాలుష్యం కూడా కలుగుతున్నది. అయినా ఈ విధానం ముసాయిదాలో దాని గురించి ప్రస్తావన కూడా చేయలేదు. జీవ ఇంధనాల విస్మరణ మంచిది కాదు. 

కేంద్ర ప్రభుత్వ విధానమైన ఆహార పంటల నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తిని సమీక్షించాలి. రాష్ట్రంలో అటువంటి ఇంధన ఉపయోగం మీద తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలి. ఈ విధానంలో పునరాలోచించాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి. హరిత హైడ్రోజన్, హరిత మిథనాల్, ఇథనాల్, చెత్త నుంచి విద్యుత్, ఫ్లోటింగ్ సోలార్, వగైరా ఉన్నాయి.

స్థానిక పెట్టుబడులకు ప్రాధాన్యం ఏది?

ఈ విధానం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులు, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్, రెండింటి నుండి వచ్చే పెట్టుబడిని ప్రస్తావించలేదు. లెక్కించలేదు. ప్రభుత్వం ఈ విధానం క్రింద ఇచ్చే ప్రోత్సాహక రాయితీలు ప్రతి శక్తి ప్రతిపాదనలో ఏ మేరకు ఉంటుంది? అది సరిపోతుందా? ప్రైవేటు పెట్టుబడులకు దన్నుగా సరైన మోతాదులో ఉన్నాయా వగైరా విషయాల పరిశీలన చేయలేదు. చెయ్యాలి. చేస్తేనే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. శక్తి వనరుల పరివర్తనలో కేవలం నూతన సాంకేతికతో కూడిన పెట్టుబడులను ఆశిస్తే మొదట్లో వచ్చిన వాటిని తదనంతరం స్థానికంగా మలుచుకునే అవకాశాలను కూడా పరిశీలించాలి. లేకుంటే బాహ్య సాంకేతిక పెట్టుబడుల భారం నిరంతరం ఉంటుంది. 

సుస్థిర శక్తి వనరుల ఉపయోగంలో ఇది కీలకం. ఉదాహరణకు, సౌర విద్యుత్ పరికరాలు, పలకలు ఎల్లప్పుడూ దిగుమతి మీదనే ఆధారపడితే ఖర్చు తగ్గదు. అంతర్గత, స్థానిక పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఈ విధానంలో లేనే లేదు. సౌర శక్తి అందుకోవడానికి వికేంద్రీకృత మార్గం అవలంబిస్తే మంచి ఫలితాలు వస్తాయని ప్రపంచవ్యాప్త అనుభవం చెబుతున్నది. శక్తి ఉపయోగించుకునే వారే సౌర శక్తి ఉత్పత్తి మీద పెట్టుబడి పెడితే అన్ని విధాలుగా ఉపయుక్తం. ఇండ్లలో, వ్యవసాయంలో, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సౌరశక్తి వీలు అయినంత మేరకు ఉపయోగించుకునేందుకు అవసరమైన పెట్టుబడి ప్రోత్సాహకాలు ఈ విధానంలో లేవు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి కైనా ఆలోచించాలి. 

శక్తి, ఇంధన పరివర్తనలో తెలంగాణ మూలవాసులను భాగస్వాములను చేయడం అత్యంత  మౌలికమైన వ్యూహం. ఈ విధానం వల్ల స్థానికుల ఉపాధి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అంచనా వెయ్యాలి. ఎక్కడ ఉపాధి పోతుంది, పోయిన ఉపాధిని ఎక్కడ భర్తీ చెయ్యాలి వంటి విషయాల పైన అధ్యయనం అవసరం. ప్రతి విధానానికి ఉండే ఉపాధి సామర్థ్యాన్ని అంచనా వేయాలి. కొత్త సాంకేతిక శక్తి వనరులు ప్రోత్సహిస్తున్న క్రమంలో, కొన్ని ఇప్పటికే అందుబాటులోకి వచ్చినందున, స్థానికుల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్యం, సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యకలాపాలను ఈ విధానంలో విలీనం చేయాలి. 

నీటిపై తేలియాడే సోలార్​ ప్రాజెక్టులు హానికారకం

కాలువల మీద, చెరువుల మీద తేలియాడే సోలార్ ప్రాజెక్టులు నీటి వనరుల ఇతర అవసరాలు/పర్యావరణ సేవలకు అడ్డుపడతాయి. చెరువులలో ఉండే జీవావరణం ఈ ప్రాజెక్టుల వల్ల నష్టపోతాయి. వీటి నిర్వహణ కూడా కష్టం. ఖర్చు కూడా ఎక్కువే. కేంద్రీకృత సౌర శక్తి ప్రాజెక్టులు కూడా హానికరమే. ఎకరాల కొద్దీ సౌర పలకలను ఏర్పాటు చేస్తే వచ్చే దుష్ఫలితాలు ఎక్కువ. ఈ రకం ప్రాజెక్టులు మంచివి కావు. నీటి వనరులలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ (FPV) విస్తరణ కూడా జలచరాల వైవిధ్యంపై , స్థానిక చెరువు ఆధారిత జీవనోపాధుల మీద సంభావ్య ప్రభావం ఆందోళన కలిగిస్తున్నది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫ్లోటింగ్ ఆర్ఈ  కారణంగా నీటి వైవిధ్యంపై ప్రభావాన్ని అంచనా వేయాలి.  పంప్డ్​స్టోరేజీ హైడ్రోపవర్ (PSH) ప్లాంట్ల వలన రిజర్వాయర్ పైన, దిగువన ఉన్న జలచరాల జీవవైవిధ్యంపై గణనీయమైన ప్రభావం ఉంటుంది.

నీటి వనరుల మీద ఎండ పడకుండా నిరంతరం నీడ ఉండడం వలన (షేడింగ్) కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతుంది. సూర్యకాంతి తగ్గి నీటి నాణ్యత మారవచ్చు. జలచరాలపై పరిణామాలు ఉంటాయి. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయి మారవచ్చు. స్థానిక జీవవైవిధ్యం  మీద ప్రభావం చూపుతుంది. సౌర పలకలకు ఉపయోగించే వస్తువు (ప్లాస్టిక్ లేదా లోహాలు) కాలక్రమేణా క్షీణించడంతో  హానికరమైన లీచింగ్ నీటిలోకి చేరవచ్చు. మొత్తానికి, నీటి వనరులతో కూడిన శక్తి వనరుల ఉత్పత్తి గురించి లోతుగా ఆలోచించాలి. అలాగే, సౌరశక్తిలో గుత్తాధిపత్య, కార్పొరేటు పెట్టుబడులు మంచివి కావు. వాటిని ప్రోత్సహించడం ఆత్మహత్య సదృశం. 

ప్రజల పెట్టుబడితో రూఫ్​టాప్​ సోలార్​

రూఫ్ టాప్ (మిద్దె మీద) సౌర పలకల ప్రాజెక్టులకు ఒక ప్యాకేజి ప్రకటిస్తే ప్రజలు ముందుకు వస్తారు. సోలార్ ప్రాజెక్టుల కోసం ఒక పాలనా వ్యవస్థ, ముఖ్యంగా రూఫ్ టాప్, అభివృద్ధి చేయాలి. ప్రజలే పెట్టుబడిదారులుగా తీర్చే ప్రక్రియలు ఈ వ్యవస్థ ద్వారా చేపట్టాలి.

లక్ష్యం ప్రకటించలేదు

ఈ విధానంలో ఉన్న పెద్ద లోపం శక్తి పరివర్తన గురించి వివరణ లేకపోవడం. ఇప్పటికే ఉన్న సాంప్రదాయక శక్తి వనరులను ఆర్ఈ లేదా క్లీన్ ఎనర్జీకి మార్చడానికి లక్ష్యం ప్రకటించలేదు. ఉన్న విద్యుత్ సామర్థ్యానికి అదనపు  సామర్థ్య పెంపు పైన దృష్టి పెట్టారు. కేవలం విద్యుత్ గురించే కాదు. ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘శక్తి’ (విద్యుత్, సాంప్రదాయ ఇంధన) వనరులను మార్చే ప్రక్రియ కూడా ఇందులో పెట్టాలి. లేకుంటే సాంప్రదాయ వనరుల ఆర్థిక భారం చోదక రంగాలు అయిన పారిశ్రామిక ఉత్పత్తి, సేవల మీద పడితే నష్టం వస్తుంది. వ్యవసాయం కూడా బలహీనపడుతుంది. పోటీ పడలేని పరిస్థితికి అవి చేరుకుంటాయి. 

థర్మల్​ విద్యుత్​ ధర మరింత పెరిగితే ఎలా?

శిలాజ ఇంధనాలు అయిన బొగ్గు, డీజిల్, పెట్రోల్ వగైరా వనరుల నుంచి మళ్ళించే లక్ష్యాలు, విధానాలు అవసరం. అవి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో లేకపోవడం ఇంకొక ప్రధాన లోపం.  తెలంగాణ ఇప్పుడున్న మొత్తం విద్యుత్​ సామర్థ్యం దాదాపు 25 GW. ఇందులో అత్యధికంగా ఉన్నది 14 GW థర్మల్ బొగ్గు నుంచి వస్తున్నది. 

చర్చిస్తున్న విధానం ప్రకారం, 2034–-35 నాటికి, థర్మల్ ప్రస్తుత సామర్థ్యం కంటే 3 GW ఎక్కువగా 17 GW ఉంటుంది. ఇది ప్రత్యక్ష తగ్గింపు కాదు. బొగ్గు ఆధారిత విద్యుత్ భారం ఎంత?  దాని కొనసాగిస్తే, ఇంకా పెంచితే వచ్చే భారం ఏ రంగం మీద పడుతుంది? ఇప్పటికే థర్మల్ విద్యుత్ యూనిట్ ధర దాదాపు రూ.7 ఉండగా, సౌర విద్యుత్ ధర రూ.2 మాత్రమే ఉన్నది. థర్మల్ విద్యుత్ ధర ఇంకా పెరుగుతుంది. ఈ అధిక ధరను ఏ రంగం భరించాలి? ఎంతకాలం భరించాలి వంటి విషయాలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

కాలుష్య ఉద్గారాల అంచనా అవసరం

సాంప్రదాయ శక్తి వనరుల ఉపయోగం క్రమంగా తగ్గించే ప్రణాళిక ఈ విధానంలో లేదు. అటువంటి ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత 14 GW బొగ్గు ఆధారిత శక్తి (థర్మల్) నుండి వచ్చే కర్బన కాలుష్య ఉద్గారాలు రాబోయే 10 సంవత్సరాలలో 17 GW కి పెరుగుతాయి. ఒక సగటు బొగ్గు పవర్ ప్లాంట్ మెగావాట్-గంటకు (MWh) 1 టన్ను CO2ను విడుదల చేస్తుంది. దీనిని స్వచ్ఛమైన శక్తి పరివర్తనగా భావించలేం. ఎందుకంటే బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యం తగ్గింపు లక్ష్యం లేకపోగా ఇంకా పెరుగుతున్నది. విద్యుత్ ఉత్పత్తిని 25 గిగావాట్ల నుంచి 66 గిగావాట్లకు పెంచాలని యోచిస్తున్నారు. ఈ లక్ష్యం వల్ల ఏర్పడే కాలుష్య ఉద్గార సంభావ్యత అంచనా కూడా అవసరం. ప్రాథమికంగా, కాలుష్య ఉద్గారాల తగ్గింపును మదింపు చేస్తూ, ప్రణాళికాబద్ధమైన వ్యూహం అమలు చేయడానికి ఒక ఉద్గార తగ్గింపు సూచికను రూపొందించాలి.  

ఎనర్జీ ట్రాన్సిషన్​ కౌన్సిల్​ ఏర్పాటు చేయాలి

ఇది తెలంగాణ రాష్ట్ర విధానం. అయితే, దేశీయ లక్ష్యాలతో ముడిపడి ఉంటుంది కనుక జాతీయ శక్తి పరివర్తన కార్యక్రమాన్ని రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అటువంటిది ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం జాతీయ శక్తి పరివర్తన కార్యక్రమం ప్రకటించి అన్ని వర్గాలతో నిరంతర సంప్రదింపులకు, భాగస్వామ్యానికి ఒక ఎనర్జీ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఏర్పాటు చెయ్యాలి.  ఈ విధానంలో కాలానుగుణ పనితీరు సమీక్ష , మూల్యాంకనం  కూడా నిర్దేశించాలి. 

సమీక్ష ప్రస్తావన ఉంది కానీ అస్పష్టంగా  ఉంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు/నిర్దేశాలతో నిరంతర అనుసంధానాన్ని నిర్ధారించడం కూడా అవసరమే.  విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నిపుణులను శక్తి పరివర్తన కార్యక్రమంలో  భాగస్వాములను చేయడానికి ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీని విస్తరించాలి. ఈ కమిటీని తెలంగాణ ఎనర్జీ ట్రాన్సిషన్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌గా మార్చవచ్చు. ఈ కౌన్సిల్ వివిధ శాఖల మధ్య సమన్వయానికి కూడా సహాయపడుతుంది. శక్తి పరివర్తనకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రభుత్వానికి విధాన రూపకల్పనకు ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఒక వివిధ వర్గాలతో కూడిన భాగస్వామ్యుల కమిటీ కూడా ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీతో అనుసంధానం చెయ్యాలి. ప్రతి పునరుత్పాదక శక్తి వనరులు, వాటి సంభావ్యత, ఆర్థిక అంశాలు, సాధ్యాసాధ్యాలపై విద్యాసంస్థల ద్వారా అధ్యయనాలు ప్రభుత్వం చేయించాలి. 

అనేక ప్రస్తావనలు లేవు

రాయితీలు, ప్రాధాన్యత, కాల పరిమితులు, పథకాల అమలు వంటి అంశాలు ఉన్నాయి కనుక ఒక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేయడం కూడా ముఖ్యమే. ఈ విధానంలో ఉపయోగించిన పదాలకు నిర్వచనం పొందుపరచలేదు. ఉదాహరణకు, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని నిర్వచించలేదు. డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ఈ అంటే ఏమిటో స్పష్టం చేయలేదు. ఖచ్చితంగా కాకపోయినా, ప్రకటించిన విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానంతో పోలి ఉంటుంది. అట్లే ఉన్నా, తెలంగాణకు సంబంధించిన భిన్నమైన అంశాలను గుర్తించాలి. వాస్తవానికి ఈ విధానంలో ఇప్పటికే ఉన్న పథకాలను, ఆలోచనలను ఒక దగ్గరకు తీసుకువచ్చింది తప్పితే కొత్తదనం ఏమీ లేదు. గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం రూఫ్ టాప్ సోలార్ విధానం గురించి ప్రస్తావించలేదు. వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ గురించిన ప్రస్తావనా లేదు. 

విధానంలో  విస్తృత లక్ష్యాల కొరత

వివిధ ఆర్ఈ​, ముఖ్యంగా పవన శక్తికి సంబంధించిన కొన్ని సంభావ్య గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ గణాంకాలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ ఆర్థిక వ్యవస్థపై ఉన్న 'భారాలను', ప్రత్యేకించి స్థిర ఛార్జీలు, మార్కెట్ కొనుగోళ్లు, రుణాలు, అప్పులు, ప్రాజెక్ట్ అధిక (ఓవర్‌‌‌‌‌‌‌‌రన్) ఖర్చులు మొదలైన వాటిని ఈ విధానం ప్రస్తావించలేదు. ఈ విధానం వల్ల అవి పరిష్కారం అవుతాయో లేదో తెలియదు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ పథకాలను కూర్పు చేసి తయారు చేసినట్టుంది. 

విస్తృత లక్ష్యాలు లేకుండా విధానం తయారు చేయడం సుదీర్ఘ ప్రయోజనాలకు చేటు తెస్తుంది. ఎన్నో ఏండ్ల తరువాత తెలంగాణ సుస్థిర అభివృద్ధికి పునాది అయిన ‘శక్తి వనరులకు’ సంబంధించిన విధానం పాక్షిక దృక్పథంతో నిర్మించడం తగనిది. ఈ విధానం విస్తృత రూపం దాలిస్తే తెలంగాణ అభివృద్ధి దిశను మార్చే అవకాశం ఉంది. దీనికి సరి అయిన రూపు ఇస్తే సమతుల్య, పర్యావరణ-హిత అభివృద్ధికి బాటలు పడతాయి.

- వ్యాసకర్త : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ,  రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు
 డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​