
- త్వరలో పూర్తికానున్న సదర్మాట్ బ్యారేజీ పనులు
- సిరాల ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ. 12 కోట్లు
- ఆయా పనులు పూర్తయితే చివరి ఆయకట్టు వరకు సాగునీరు
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ. 7 కోట్లు మంజూరు చేసింది. దీంతో మరమ్మతు పనులు పూర్తి చేశారు. గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టు మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. గడ్డెన్న వాగు రిపేర్లకు రూ. 18 కోట్లు, స్వర్ణ వాగు మరమ్మతుల కోసం రూ. 9 కోట్లు కావాలని సర్కారుకు రిక్వెస్ట్ పంపారు.
12 కోట్లతో సీరాల ప్రాజెక్టు పనులు..
జిల్లాలోని బైంసా మండలంలో ఉన్న సీరాల ప్రాజెక్టు 2023లో భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. ఇరిగేషన్ అధికారులు రూ. 12 కోట్ల ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం రూ. 9 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. పనులు మొదలు కావడంతో మరో ఏడాది లోగా ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణం పూర్తి కానుంది. ఇదే ప్రాజెక్టు పరిధిలోని ఇలేగాం చెరువు మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. దీంతో ఈ చెరువు మరమ్మతు పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాదిలోగా పనులన్నీ పూర్తయితే దాదాపు 2 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముంటుంది.
చివరి దశలో సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులు..
సదర్మాట్ బ్యారేజీ ఎలక్ట్రిఫికేషన్ పనులకు అవసరమయ్యే రూ.18 కోట్లను గత బీఆర్ఎస్ సర్కార్ విడుదల చేయలేదు. దీంతో ఆ పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులపై దృష్టి సారించింది. ఎలక్ట్రిఫికేషన్ పనుల కోసం నిధులను విడుదల చేసింది. దీంతో పనులు చివరి దశలో ఉన్నాయి. మరో నాలుగైదు నెలల్లో సదర్మాట్ బ్యారేజీ పనులన్నీ పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయితే నిర్మల్ జిల్లాలో 13 వేల ఎకరాలకు, జగిత్యాల జిల్లాలో 5 వేల ఎకరాలకు సాగు నీరందనుంది. జూన్ నాటికి నిర్మాణ పనుల పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెచ్చేందుకు ఇరిగేషన్ అధికారులు శ్రమిస్తున్నారు.