-
ప్రస్తుతం అణచివేతలు, నిర్భంధాలు లేవు
-
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
నర్సంపేట, వెలుగు: ఈ ఐదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారులపై ఉందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అణచివేతలు, నిర్భంధాలు కనిపించడం లేదన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా ప్రభుత్వానికి చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సదస్సులో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం తెలంగాణ చరిత్రను, రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు, రైల్‌రోకోలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఘటనలను చెరిపేసి కేవలం దీక్షా దివస్‌ను మాత్రమే చూపించిందన్నారు. తెలంగాణ చరిత్రను రికార్డు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఏ ఒక్కరి వల్లో తెలంగాణ రాలేదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండరాంను టీజేఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంబటి శ్రీనివాస్, నాయకులు శాలువాలతో సన్మానించారు. అంతకుముందు పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ నుంచి సిటిజన్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సదస్సులో ప్రొఫెసర్లు రమాదేవి, కూరపాటి వెంకటనారాయణ, అడ్వకేట్ అంబటి శ్రీనివాస్, షేక్ జావీద్, సాంబరాతి మల్లేశం, కళ్లేపల్లి ప్రణయ్‌దీప్ పాల్గొన్నారు.