సామాన్యుల గోసను గత ప్రభుత్వం పట్టించుకోలే. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు తెలంగాణ సోయితో పనిచేస్తే బాగు. తెలంగాణలో సామాన్యులు అనేక అంశాలకు దూరమైనారు. సామాన్యులు ఎన్నికలలో పాల్గొనడం అటుంచి అటువంటి ఆలోచన కూడా చేయకుండా చేశారు. కోట్లకు భూముల ధరలు పెంచుకుని మామూలు మనుషులు గంటెడు జాగా కొనే ఆలోచన కూడా చేయలేకపోతున్నరు. ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసి, ఉచితంగా అందవలసిన చదువును వ్యాపారం చేసిరి. మద్యం పాలసీని మార్చి అమ్మకాలను పెంచడంతో కుటుంబాలకు కుటుంబాలు అనారోగ్యం పాలైనాయి. యుక్త వయసులోనే భర్తలు, చేతికందిన కొడుకులు చనిపోయి మహిళల మీద మోయలేని భారం మోపిరి. ఎన్నికల రోజులన్నీ ఉచితంగా మందుపోసి యువతను తాగుడు లేకుండా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చిన్రు. మద్యంతోపాటు ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేసే ముఠాలను అరికట్టడంలో విఫలం చెందడమే కాకుండా రాజకీయ పలుకుబడితో దొరికినవాళ్ల మీద కేసులు పెట్టకుండా వదిలిపెడితిరి. ఇల్లు నడిపే భారాన్ని మహిళల మీద పడి పని ఒత్తిడితో ఆనారోగ్యం పాలై ఉన్న డబ్బులన్నీ ప్రైవేటు దవాఖానాల పాలాయే. ఆసరా పెన్షన్లు పోటీ మీద పడి ఇవ్వబడతిరి, చెక్కులిచ్చి ఫొటోలు దిగిరి. కానీ, ఒంటరి మహిళలు ఎందుకు పెరుగుతున్నారో ఆలోచన మాత్రం చేయకపోయిరి. టెలికాం విధానాన్ని మార్చి అగ్గువ ధరలకు డేటా అలవాటు చేసి యువతను మరో మంచి మాట ఆలోచించకుండా స్మార్ట్ ఫోన్లకు బానిసలను చేస్తిరి. కంపెనీలకైతే ఆదాయాలు పెంచితిరి.
అగ్గువ కూలీలుగా రైతులు
కార్మికశాఖ మంత్రులుగా ఉన్నవాళ్ళు తమాషాలు చేస్తూ కాలయాపన చేసి, 90శాతం పైగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు అందించేటట్లు కార్మికశాఖను కనీస సోయితో నడపరైతిరి. రైతులు ఆత్మగౌరవం చంపుకుని గ్రామాలు వదిలి పట్టణాల బాట బట్టి వాచ్ మన్లుగా, ఇండ్లల్లో పని చేసేటోళ్లుగా, అగ్గువ కూలీలుగా మారిపోతే ఇది కూడా అభివృద్ధిలో భాగమే అంటిరి. వ్యాపారాలకు ఇది మంచి సూచికలుగా చూస్తిరి. గురుకుల సదువులు గొప్ప అంటిరి. అందులో వసతులు లేక, తిండి సరిగా లేక పిల్లలు రోడ్డున పడితే అది రాజకీయ దురుద్దేశంతోనే అంటిరి. నిజాలు చూడకపోతిరి. అందులో పని చేసే సిబ్బందిని పట్టించుకోకపోతిరి, వాళ్ల సమస్యలు వినకపోతిరి. పట్టణ పేదల జనాభా రోజు రోజుకూ పెరుగుతుంటే దాన్ని కూడా అభివృద్ధే అంటిరి. ‘గల్లీ సిన్నది. గరీబోళ్ల కథ పెద్దది’ అనే గోరటి ఎంకన్న పాట మీద చిందులు వేస్తిరి. కానీ, వాళ్ల కష్టాల లోతుకు పోయి చూడకపోతిరి. వాళ్ళ ఓట్ల కోసం పోయినప్పుడైనా కనీసం వాళ్ళ బాధలినకపోతిరి. పట్టణ పేదల పిల్లలకు బడులు నిర్మించాలనే ఆలోచనే చెయ్యకపోతిరి.
ఈలలు వేసి వేలంపాటలు
85శాతం పిల్లలు హైదరాబాదులో ప్రైవేటు ఫీ‘జులుం’కు అవకాశమిస్తిరి. ఆడపిల్లలు పై చదువుకు కలలు కనకుండా కల్యాణ లక్ష్మీ అనే పథకంతో వారి కలలను కల్లలు చేస్తిరి. సామాన్యులకు అవసరమున్న బస్సులను వేయకపోతిరి. ప్రజా రవాణాన్ని గాలికొదిలి అభివృద్ధి పేరుతో కార్లల్లా పోయేటల్లకు రోడ్డు మీద రోడ్లు వేస్తిరి. సామాన్యులు నడవడానికి ఫుట్ పాత్ లను పొతం పడతిరి. రోడ్డు దాటకుండా చేసి అదే అభివృద్ధి అంటిరి. పట్టణ ప్రభుత్వ స్థలాలపై కన్నేసి ఈలలు వేస్తూ వేలం పాటలు పాడితిరి. పట్టణ ప్రాంతాలలో చుట్టు పక్క ప్రాంతాలలో ఉన్న అసైన్డ్ భూములను కబ్జా చేసి ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ వేషం కడితిరి. కొందరితో బహిరంగంగా కాళ్ళు మొక్కించుకుంటూ మరికొందరితో జీ హుజూర్ అనిపించుకుంటిరి. అధికార యంత్రాంగాన్ని తన పాత్రను పోషించకుండా చేస్తిరి. ప్రజాస్వామ్యాన్నే భ్రష్టు పట్టిస్తిరి. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి కొత్తగా చెప్పేదేమీ లేదు. కానీ, ఈ లొసుగులను అన్నిటినీ సమీక్షించి తప్పులు జరగకుండా తెలంగాణ సోయితో పని చేయాలె.
-ఆర్. వెంకట్ రెడ్డి,
సోషల్ వర్కర్