రేపు లేదా ఎల్లుండి నుంచి వివరాల నమోదు
దేశ ముఖ చిత్రాన్ని మార్చే సాహసమిది: సీఎం రేవంత్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుల గణన సర్వే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. సర్వే సిబ్బంది తొలుత మూడు రోజులపాటు కుటుంబాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇంటింటికి వెళ్లి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో గుర్తించి, ఇండ్లకు స్టిక్కర్లు అతికిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ నెల 8 నుంచి, మరికొన్ని చోట్ల 9వ తేదీ నుంచి వివరాలు నమోదు చేస్తామని.. సర్వేలో ఏయే అంశాలు చెప్పాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. మొత్తం 85 వేల మంది ఎన్యుమరేటర్లు.. 8,500 మంది సూపర్ వైజర్లు సర్వేలో పాల్గొంటున్నారు.
దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం: సీఎం
కులగణన.. దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసమని సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఆకాశం, భూమి ఏకమై.. అవకాశాల్లో సమానత్వం.. అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం చేస్తున్న యజ్ఞం ఇది. నేడు తెలంగాణ గడ్డపై మొదలై.. రేపు రాహుల్ సారథ్యంలో దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది” అని సీఎం ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో మంత్రి శ్రీధర్ బాబు సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్వే సమయంలో ఎవరు కూడా అధికారులకు ఎలాంటి జిరాక్స్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని.. వివరాలు చెప్తే సరిపోతుందని శ్రీధర్‌బాబు అన్నారు.
మధ్యాహ్నం సర్వే కష్టాలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి సర్వేలో తొలిరోజే టీచర్ల(ఎన్యుమరేటర్ల)కు కష్టాలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా స్కూళ్లలో పనులు చేసిన టీచర్లు.. మధ్యాహ్నం సర్వే బాట పట్టారు. తమకు కేటాయించిన ఇండ్లకు స్టిక్కర్లు అంటించేందుకు గ్రామాల్లోకి వెళ్లగా.. చాలా ఇండ్లు తాళాలు వేసి కన్పించాయి. పక్కనున్న వారిని అడిగి, ఆయా ఇండ్ల యజమానుల పేర్లు తెలుసుకుని స్టిక్కర్స్ వేశారు. వరి పంట కోసేందుకు, వడ్లను ఆరబెట్టేందుకు వెళ్లడంతో ఇండ్ల దగ్గర ఎవరూ కనిపించడం లేదు. సర్వే ముగిసే వరకు ఇంటి దగ్గర ఎవరైనా ఒకరు ఉండేలా గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించాలని టీచర్లు కోరుతున్నారు.