కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

కాగజ్ నగర్/జైనూర్, వెలుగు :  కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత బస్సు పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని పేర్కొంటూ ఆటో డ్రైవర్లు చేస్తున్న ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారం కాగజ్‌నగర్‌లోని లారీ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రాస్తారోకో చేపట్టారు. ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఫైనాన్స్​లో కొన్న ఆటోలకు నెలనెలా ఈఎంఐ కట్టలేని దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. 

తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. మహాలక్ష్మి పథకం కింద బస్​లో ఫ్రీ జర్నీ పథకం తమ ఉపాధికి తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. జైనూర్​లోనూ ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల యూనియన్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.