
రైతులను ఆదుకున్నట్లే.. చేనేత కార్మికుల సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నది. తాజాగా రాష్ట్రంలోని చేనేత కార్మికుల రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ జీవో విడుదల చేసింది.
ఇందుకోసం రూ.33 కోట్లు విడుదల చేసింది. దీని వల్ల ఒక్కో కార్మికుడికి లక్ష వరకూ రుణమాఫీ కానుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మార్చి 9వ తేదీ ఆదివారం రోజు నిర్వహించిన ఆఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నిధులు విడుదల చేయడం పట్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, సమాఖ్యలు తెలంగాణ టెస్కో నుంచే వస్త్రాలు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా సంఘాలకు చేనేత చీరలు
నేతన్నలకు మరింత చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి ఏటా మహిళా సంఘాలకు రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించడం.. ఆ చీరలు కూడా నేత కార్మికులతో నేయించాలని నిర్ణయించింది. కోటి 35 లక్షల చీరల తయారీ కోసం రూ.600 కోట్ల ఖర్చు చేయనుంది. గత ప్రభుత్వ పెండింగ్లో పెట్టిన రూ.450 కోట్ల బకాయిలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పరిష్కరించింది.
అభయహస్తం పథకం పేరుతో నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పేరుతో మూడు రకాల పథకాలను అమలు చేస్తోంది. గత ప్రభుత్వం చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేత కార్మికులను పెద్దగా పట్టించుకోలేదు.
నేతన్న పొదుపు నిధి : సొసైటీల పరిధిలోని చేనేత కార్మికులు తమ వేతనంలో ప్రతినెలా 8% (రూ.1,200 గరిష్ఠ పరిమితితో) పొదుపుచేస్తే, రాష్ట్ర ప్రభుత్వం దానికి రెట్టింపు వాటా(16%)ను జమ చేస్తోంది. దీనిద్వారా దాదాపు 38,000 మంది లబ్ధి పొందుతున్నారు. అలాగే మరమగ్గాల కార్మికులు నెలవారీ వేతనంలో 8% పొదుపు చేస్తే, ప్రభుత్వం 8% వాటా జమ చేస్తుంది. దీనిద్వారా సుమారు 15,000 మంది లబ్ధి పొందుతున్నారు.
నేతన్న భద్రత : చేనేత, మరమగ్గాలు, అనుబంధ వృత్తుల కార్మికులందరికీ ఉచిత జీవిత బీమా పథకం. దీనికింద నమోదు చేసుకున్న కార్మికులు ఏ కారణంతోనైనా మరణించినా.. వారి వారసుల (నామినీల)కు రూ.5 లక్షలు చెల్లిస్తోంది. ఈ పథకంలో 65 ఏళ్ల గరిష్ఠ వయో పరిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి కూడా ఇది వర్తిస్తోంది. ఈ పథకం అమలుకు బడ్జెట్ అంచనా వ్యయం రూ.9 కోట్లు. కార్మికులు చేనేత రంగాన్ని నమ్ముకోవడంతో ప్రభుత్వం అందించే బీమాతో చేనేత కుటుంబాలు ధీమాగా ఉంటున్నాయి.
నేతన్న భరోసా : రాష్ట్ర ప్రభుత్వం ముద్రించి ఇచ్చే మార్క్ లేబుళ్లను ఉపయోగించి చేనేత కార్మికులు తయారు చేసే వస్త్ర ఉత్పత్తులకు వేతన మద్దతును అందిస్తున్నారు. ఉత్పత్తి చేసిన వస్త్రాల పరిమాణానికి అనుగుణంగా ఒక సంవత్సరానికి ఒక్కో చేనేత కార్మికునికి రూ.18,000 వరకు, అనుబంధ కార్మికునికి రూ.6,000 వరకు మంజూరు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు వార్షిక బడ్జెట్ అంచనా రూ.44 కోట్లు. ఇక తెలంగాణకు ప్రత్యేక చేనేత మార్క్ లేబుల్ రూపొందించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లకు వార్షిక బడ్జెట్ రూ.4 కోట్లు. ఈ పథకాలన్నీ రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
కొండా లక్ష్మణ్ బాపూజీను గౌరవిస్తూ..
ఆసిఫాబాద్ మెడికిల్ కాలేజీకి బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించింది. ఇందులో ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులకు మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు అందిస్తోంది. ప్రభుత్వం జీవో నెం. 18 ద్వారా వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యార్న్ డిపో స్థాపించింది. ఇందుకోసం రూ.50 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేసి ప్రభుత్వం చేనేత అభివృద్ధికి
పాటుపడుతోంది.
- కమర్తపు మురళి,
అధ్యక్షుడు, తెలంగాణ పద్మశాలి సంఘం