ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల, వెలుగు: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యాలయాలు, హాస్పిటల్స్​కు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను సాధించడంలో సీఎం కేసీఆర్​ఫెయిల్​అయ్యారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, కొత్త మోహన్, దుర్గయ్య, జున్ను రాజేందర్, రాధకిషన్, మహిపల్, బాస మహేశ్​, సాయి పాల్గొన్నారు.

భార్యకు పింఛన్​ రావడం లేదని పెట్రోల్​ డబ్బాతో ఆందోళన

కోనరావుపేట, వెలుగు: తన భార్యకు పింఛన్​రావడం లేదని పెట్రోల్ డబ్బాతో ఓ వ్యక్తి ఎంపీడీవో ఆఫీస్​లో  గురువారం ఆందోళన చేశాడు. వివరాలిలా ఉన్నాయి... కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన అలిపిరి అనురాధ.. 2012 నుంచి బీడీ కార్మికురాలిగా పనిచేస్తోంది. ఎన్నిసార్లు దరఖాస్తు  చేసినా పింఛన్​ మంజూరు కాలేదు. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్ల లిస్టులోనూ అనురాధకు రాలేదు. దీంతో తన భర్య అనురాధకు పింఛన్ ​మంజూరు చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె భర్త అలిపిరి మల్లయ్య ఎంపీడీవో ఆఫీసులో పెట్రోల్ డబ్బాతో ఆందోళన చేశాడు. అధికారుల సమాచారంతో కోనరావుపేట ఎస్సై రమాకాంత్ అక్కడికి చేరుకొని బాధితుని వద్ద ఉన్న పెట్రోల్ డబ్బాను లాక్కొని సర్దిజెప్పారు. 

పింఛన్​ ఇప్పిస్తానంటూ మోసం 

పెన్షన్ ఇప్పిస్తానంటూ గుర్తుతెలియని వ్యక్తి ఓ వృద్ధుడి వద్ద నగదు తీసుకొని పరారయ్యడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మంగళపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల గుండయ్య అనే వృద్ధుడు గురువారం పొలం వద్ద పనులు చేసుకుంటున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి నేను కొత్తగా వచ్చిన సెక్రటరీనని నీకు పింఛన్​ ఇప్పిస్తానని చెప్పి గుండయ్య బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా తో పాటు రూ.8వేల నగదును తీసుకొని సుద్దాలలోని ఓ వ్యక్తి ఇంటి వద్ద బాధితుడిని దింపి జిరాక్స్ ​తీసుకువస్తానని చెప్పి పరారయ్యాడు. ఎంతసేపటికీ రాకపోయేసరికి మోసపోయానని గ్రహించి విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు. అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే జోడో యాత్ర

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: దేశ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర’ చేపట్టారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.  గురువారం రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావంగా సిరిసిల్లలో పొన్నం పాదయాత్ర చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తా నుంచి చిన్నబోనాల, పెద్దబోనాల, భూపతినగర్, ముష్టిపల్లి, చిప్పపల్లి, పెద్దూర్​వరకు సాగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు.  కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, శ్రీనివాస్, బాల్ రాజు, దేవరాజు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

కరీంనగర్​ రూరల్, పెద్దపల్లి, వెలుగు: రాహుల్ గాంధీ యాత్రకు మద్దతుగా కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్ నుంచి ముగ్దుంపూర్ గ్రామం వరకు కాంగ్రెస్​నాయకులు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో నియోజకవర్గ నాయకుడు మేనేని రోహిత్ రావు, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ అంజన్ కుమార్, హుస్సేన్, పాల్గొన్నారు.  పెద్దపల్లిలో డీసీసీ ప్రెసిడెంట్​ఈర్ల కొమురయ్య ఆధ్వర్యంలో నాయకులు పాదయాత్ర చేపట్టారు. 

జమ్మికుంట, ఎల్లారెడ్డిపేట, వెలుగు: హుజూరాబాద్​నియోజకవర్గం ఇల్లంతకుంట సీతారామ చంద్ర స్వామి దేవాలయం నుంచి జమ్మికుంట గాంధీ చౌక్ వరకు గురువారం బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు గూడెపు సారంగపాణి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయం రవి పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు​నాగుల సత్యనారాయణ గౌడ్​ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. 

విధుల్లో నిర్లక్ష్యం.. అధికారులపై కేసు

హుజురాబాద్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైనట్లు లాయర్​ లింగమూర్తి వెల్లడించారు. డీపీవో వీర బుచ్చయ్యతో పాటు హుజూరాబాద్​ ఎంపీవో బషీరుద్దీన్, పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ లపై కేసు నమోదయింది. వివరాలిలా ఉన్నాయి.. పెద్దపాపయ్యపల్లి పదో వార్డు మెంబర్  రాము.. గ్రామసమస్యలు, నిధుల వినియోగంలో అవినీతిపై పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేయగా తీసుకోలేదు. దీంతో డీపీవో, ఎంపీవోలకు ఫిర్యాదు చేసినా  వారు కూడా పట్టించుకోకపోవడంతో కోర్టులో ప్రైవేటు​పిటీషన్​ వేశారు. విచారించిన జడ్జి అధికారులపై కేసు నమోదు చేయాలని  ఆదేశించడంతో హుజూరాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసినట్లు లాయర్​ తెలిపారు.  

అధికారులను తిడుతున్నా సీఎం పట్టించుకోవడంలేదు

జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్రంలోఎమ్మెల్యేలు, మంత్రుల అరాచకాలు ఎక్కువయ్యాయని, అధికారులను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నా ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ జిల్లా నాయకుడు ఎడమల శైలేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం విమర్శించారు. గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళా సర్పంచ్​లు, అధికారులను తిట్టినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పథకంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్ ను ప్రశ్నించడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించిన తీరు బాధాకరమన్నారు. 

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన రమ్య అనే మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు.  గురువారం సాయంత్రం  కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిజేరియన్ చేసి డాక్టర్లు  డెలివరీ చేశారు.  ముగ్గురిలో ఇద్దరు మగ పిల్లలు కాగా ఒక ఆడపిల్ల జన్మించింది. ముగ్గురు ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు, తల్లిదండ్రులు తెలిపారు.