- గత ప్రభుత్వంలో నిలిచిపోయిన సూక్ష్మ సేద్యం
- కేంద్ర పథకాలను వినియోగించుకునేందుకు కాంగ్రెస్ సర్కారు శ్రీకారం
హైదరాబాద్, వెలుగు: మైక్రో ఇరిగేషన్‌ను కాంగ్రెస్ సర్కారు ఈ యాసంగి నుంచి అమల్లోకి తేనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన సూక్ష్మసేద్యాన్ని మరింత విస్తరించేందుకు సర్కారు ప్రణాళికలు చేస్తోంది. దీనిలో భాగంగా క్షేత్ర స్థాయిలో రైతులకు సూక్ష్మసేద్యం వైపు మళ్లించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ప్రతి నీటిచుక్క అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనే నినాదంతో ముందుకు వెళ్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరించడంతో గత ఐదేండ్ల పాటు మైక్రో ఇరిగేషన్ ఆగిపోయింది. బిందు, తుంపర సేద్యానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని గత సర్కారు పూర్తిగా నిలిపివేసింది. ఫలితంగా భూగర్భ జలాలు, నీటి వసతులు తక్కువగా ఉండే ప్రాంతాల్లోని రైతులు లబ్ధిని కోల్పోయారు. మైక్రో ఇరిగేషన్ కోసం కేంద్రం నిధులిచ్చినా గత ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకపోవడంతో డ్రిప్, స్ప్రింకర్ల కల్టివేషన్ ఆగిపోయింది. కొత్త సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేస్తున్నది. ఆర్కేవీవై, ఎంఐడీహెచ్ వంటి పథకాలను వినియోగించుకుని రైతులను ప్రోత్సహించనుంది.
డ్రిప్, స్ప్రింక్లర్లతో తక్కువ నీటితో ఎక్కువ ఫాయిదా..
రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలకు పైగా భూగర్భ జలాలతో పంటసాగు జరుగుతోంది. భూగర్భ జలాలు, నీటి వసతులు తక్కువగా ఉండే ప్రాంతాల్లో రైతులు బిందుసేద్యం వైపు మొగ్గుచూపుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ సాగుచేసుకుని అధిక దిగుబడులు పొందేందుకు డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగకరంగా ఉంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో మైక్రో ఇరిగేషన్ ను ఉద్యాన శాఖ సంయుక్తంగా సాగును విస్తరించనుంది.
దీంతో హైదరాబాద్ శివారు జిల్లాలోనే వేల ఎకరాల్లో బిందు, తుంపర్ల సేద్యం మరింత విస్తరించనుంది. ఈ పద్ధతి ద్వారా పండ్లతోటలు, వాణిజ్య పంటలైన చెరుకు, పత్తి, మిరప, పొగాకు, మల్బరీ, కూరగాయలు, పూలతోటలను డ్రిప్, స్ర్పింక్లర్లతో సాగు చేస్తున్నారు. స్ప్రింక్లర్లతో నీటి ఆదాతో పాటు కరెంటు కూడా సేవ్ అవుతుంది. ఎరువులు, నిర్వహణ ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు వచ్చే వీలుంటుంది. ప్లాస్టిక్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా డ్రిప్‌తో మొక్క వేళ్లకు తగు మోతాదులో నీరు అందడంతో దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు.
ఈ పద్ధతిలో నూనె గింజలు, వేరుసెనగ, కూరగాయల పంటల సాగు కూడా జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందుసాగు కోసం దరఖాస్తు చేసుకుంటే 100 శాతం సబ్సిడీ లభిస్తుంది. బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, పేద రైతులకు 80 శాతం సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. స్ప్రింకర్లను 75 శాతం సబ్సిడీతో అన్ని వర్గాల రైతులకు అందిస్తున్నారు.
మైక్రో ఇరిగేషన్‌కు వ్యయం తక్కువే..
మైక్రో ఇరిగేషన్‌కు వ్యయం తక్కువే అయినా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల కోసం రూ.లక్షల కోట్లు కేటాయించిన నాటి బీఆర్ఎస్ సర్కారు.. వంద రెండు వందల కోట్ల వ్యయం అయ్యే మైక్రో ఇరిగేషన్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ఐదేళ్లకు పైగా నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్రం ప్రకటించిన నిధులు వెనక్కి పోయాయి. పక్క రాష్ట్రం ఏపీలో ఏటా రూ.500 కోట్లకు పైగా మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇచ్చి కేంద్ర పథకాలను వినియోగించుకోగా, ఇక్కడి గత ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శ ఉంది.