
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన చెన్నూర్, పడ్తన్‌పల్లి లిఫ్టులకు బ్రేక్ పడింది. కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌పై ఆధారపడే ఈ రెండు లిఫ్టు స్కీములకు డిజైన్ చేశారు. కానీ, తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు మళ్లీ ప్రాణహిత బ్యారేజీని తెరపైకి తెస్తోంది. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మంచిర్యాల జిల్లా చెన్నూర్ దాకా గ్రావిటీ ద్వారా సాగునీరందించే అవకాశం ఉంటుంది.
బీఆర్ఎస్ ప్లాన్ ప్లాఫ్....
చెన్నూర్ నియోజకవర్గాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మూడు బ్యారేజీలు కట్టినప్పటికీ ఈ ప్రాంత రైతులకు ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు నుంచి నియోజకవర్గ రైతులకు చుక్క నీరు రాకపోగా...నాలుగేండ్లుగా బ్యారేజీల బ్యాక్ వాటర్‌తో వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయి. మంచిర్యాల, చెన్నూర్ పట్టణాలతో పాటు పదుల సంఖ్యలో గ్రామాలు ఏటా వానాకాలంలో జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో అప్పటి ప్రభుత్వం ప్రజల కోపాన్ని చల్లార్చేందుకు చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది. సాగునీటి పేరిట ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసింది. మూడేండ్లుగా నాన్చుతూ వచ్చిన కేసీఆర్ ఈ ఏడాది జూన్9న ఐడీఓసీ ప్రారంభోత్సవం సందర్భంగా చెన్నూర్ లిఫ్ట్ పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. కానీ, ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ప్లాన్ ప్లాఫ్ అయ్యింది.
పడ్తన్‌పల్లి కథ కంచికే....
హాజీపూర్ మండలంలోని కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి కూడా అరకొరగానే అందుతున్నాయి. దీంతో హాజీపూర్ మం డలంలోని 10 వేల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో రూ.85 కోట్లతో పడ్తన్‌పల్లి లిఫ్ట్ స్కీమ్‌కు ప్లాన్ చేశారు. ఇది కూడా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రాజెక్టే. ఈ నేపథ్యంలో చెన్నూర్, పడ్తన్‌పల్లి లిఫ్టులకు బ్రేక్ పడ్డట్టు ప్రచారం జరుగుతోంది.
రూ.6.87 కోట్లు వృథా...
చెన్నూర్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను రూపొందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్ వాటర్ నుంచి 10 టీఎంసీలను ఎత్తిపోసేందుకు మూడు లిఫ్టులను ప్రతిపాదించారు. ఈ సర్వే కోసం మూడు సంవత్సరాల కింద రూ.6.87 కోట్లను సాంక్షన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
నిరుడు ఫిబ్రవరి 1న అప్పటి ఫారెస్ట్ మినిస్టర్ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ లిఫ్ట్ నిర్మాణ ప్రదేశాలను పరిశీలించారు. ఆ తర్వాత ప్రభుత్వం రూ.1,658 కోట్లతో పరిపాలన అనుమతులను జారీ చేసింది. కానీ, నిరుడు బడ్జెట్లో పైసా కూడా కేటాయించకపోవడంతో సర్కారు తీరుపై అనుమానాలు మొదలయ్యాయి. చివరకు అనుకున్నట్టే జరుగుతుండడం గమనార్హం.