- భగీరథ మొదలు గొర్రెల స్కీమ్ దాకా శాఖల వారీగా సర్వేలు
- ఈ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి రిపోర్టులు
- వాటి ఆధారంగానే బడ్జెట్లో కేటాయింపులు
హైదరాబాద్, వెలుగు: వివిధ శాఖల్లో గత సర్కార్ అమలు చేసిన స్కీమ్‌లు, వాటికి చేసిన ఖర్చులపై ప్రభుత్వం లెక్కలు తీస్తున్నది. ఏయే స్కీమ్‌ల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయి? ఆ స్కీమ్‌లు లబ్ధిదారులకు ఎంతమేర ఉపయోగపడ్డాయి? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? వాటిల్లో ఎలాంటి మార్పులు చేసి కొనసాగిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది? అనే దానిపై వివరాలు సేకరిస్తున్నది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఆఫీసర్లతో సర్వేలు చేయించి రిపోర్టులు తెప్పించుకుంటున్నది. వాటి ఆధారం గానే వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని భావిస్తున్నది. మిషన్ భగీరథ, హరితహారం, డబుల్ బెడ్రూం ఇండ్లు, గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మీ తదితర స్కీమ్‌లు ఏ విధంగా అమలు చేశారు? వాటి గైడ్‌లైన్స్‌ను ఎలా మార్చాలి? అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. క్షేత్రస్థాయి రిపోర్టులు అందగానే నిధుల కేటాయింపుపై అంచనాకు రావడంతో పాటు స్కీమ్‌ల పేర్లు, విధివిధానాలు మార్చనుంది. ఈ నెలఖరుకల్లా రిపోర్టులు ప్రభుత్వానికి అందనున్నట్టు తెలిసింది.
మిషన్ భగీరథ కింద రాష్ట్రంలోని వంద శాతం ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు గత ప్రభుత్వం ప్రకటించుకున్నది. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా ఎన్ని ఇండ్లకు భగీరథ కనెక్షన్లు ఇచ్చారు? పైప్లైన్లు ఎట్లున్నయ్? అనే దానిపై ప్రభుత్వం సర్వే చేయిస్తున్నది. ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయి? వాటి రిపేర్లకు ఎంత ఖర్చవుతుంది? అనే లెక్కలు తీస్తున్నది. డీపీఆర్ ప్రకారం ఈ పథకం అంచనా వ్యయం రూ.43,791 కోట్లు. ఇప్పటివరకు రూ.31 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. లక్షా 50 వేల కిలోమీటర్ల మేర పైప్లైన్లువేసినట్టు, 2.72 కోట్ల జనాభాకు మంచినీళ్లు అందుతున్నట్టు అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు. కానీ కనెక్షన్లు ఇచ్చిన కొన్ని చోట్ల నల్లాలు బిగించకపోగా, మరికొన్ని చోట్ల ఇంకా పనులు కొనసాగుతున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. దాదాపు 30 శాతానికి పైగా పనులు పెండింగ్‌లో ఉన్నట్టు అంచనా వేశారు.
కల్యాణలక్ష్మితో ఎమ్మెల్యేకు నో లింక్..
కల్యాణలక్ష్మి స్కీమ్‌పైనా కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సర్వే చేయిస్తున్నది. ఈ స్కీమ్ ను ఏ విధంగా అమలు చేస్తే, లబ్ధిదారులకు మేలు జరుగుతుందనే దానిపైనా ఆరా తీస్తున్నది. ఇందులో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి? అవినీతికి లేకుండా చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే దానిపై కసరత్తు చేస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు లక్ష అప్లికేషన్లు పెండింగ్‌లో పెట్టినట్టు గుర్తించింది.
ఇక ఎమ్మెల్యే సంతకం తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కాకపోతే చెక్కుల పంపిణీ మాత్రం ఎమ్మెల్యేలతోనే చేయించాలని అనుకుంటున్నది. కాగా, ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బంగారం ఇవ్వడం కుదరకపోతే అంతే మొత్తంలో నగదు ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.
గొర్రెల స్కీమ్ పరిస్థితి ఏంటి?
గొర్రెల స్కీమ్‌లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్టు తేలింది. దీనిపై ఏసీబీతో పాటు ఈడీ విచారణ కూడా జరుగుతున్నది. అసలు గొర్రెల పంపిణీ స్కీమ్ సక్సెస్ అయిందా? ఎవరికి లబ్ధి జరిగింది? ఎన్ని గొర్రెలు ఇస్తే మేలు? అర్హుల ఎంపిక ఎలా? అనే దానిపై ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నది. 2017లో గొర్రెల స్కీమ్ మొదలుపెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. మొదటి విడతలో 3.67 లక్షల యూనిట్లు పంపిణీ చేసినట్టు లెక్కల్లో పేర్కొంది.
వీటి పంపిణీతో గొర్రెల సంఖ్య పెరిగిందని ప్రకటించుకున్నది. అయితే అదంతా ఉత్తిదేనని కాగ్ రిపోర్ట్ లో వెల్లడైంది. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని, రీసైక్లింగ్ దందాజరిగిందని తేలింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 4.25 లక్షల యూనిట్లను పంపిణీ చేయగా, ఇందుకోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ స్కీమ్ కు ఎంత కేటాయించాలి? అసలు గొర్రెలు పంపిణీ చేయడమా? లేక సెంట్రల్ స్కీమ్‌కు ముడిపెట్టడమా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
డబుల్ ఇండ్లపై ఏం చేద్దాం?
డబుల్బెడ్రూం ఇండ్లపై కూడా ప్రభుత్వం రిపోర్టులు తెప్పించుకుంటున్నది. కట్టిన ఇండ్లు ఎన్ని? ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి ? నిర్మాణాలు ఏయే దశలో ఉన్నాయి? వాటిని పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమవుతాయి? అనే వివరాలను సేకరిస్తున్నది. గత ప్రభుత్వం దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేసింది. కానీ ఇందులో 1.5 లక్షలు మాత్రమే పూర్తి చేసింది. ఇందుకోసం రూ.12,560 కోట్లు ఖర్చు చేసింది. కట్టిన వాటిలో సగానికి పైగా ఇండ్లకు తాగునీరు, కరెంట్, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నది. కొన్ని ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.