
- బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ సర్కార్ నడుస్తున్నది
- ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమిషానికి కోటి రూపాయలకు పైగా అప్పు చేస్తున్నదని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అప్పు రూ.8.60 లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ.2.27 లక్షల రుణభారం ఉందని తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో అప్పు ఉంటే.. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.
శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ‘‘తెలంగాణ తెచ్చుకున్నది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానికా? జీఎస్డీపీ రూ.16 లక్షల కోట్లకు చేరుకున్నది. అందులో 50 శాతం అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉం ది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోయి.. లక్షల కోట్లు అప్పు చేసింది. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది.
రేవంత్ ప్రభుత్వం అదే దారిలో పోతున్నది. ఇన్ని అప్పులు ఉన్నాయని తెలిసి మరీ సీఎం రేవంత్ ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పాలకు లు లక్ష కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని రేవంత్ గతంలోనే ఆరోపించారు. అవన్నీ కక్కించి వాటితోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా.. ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై కేసులు పెట్టలేదు’’అని రేవంత్ తెలిపారు.
అవినీతిపై ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు?
గత పాలకుల నుంచి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ‘‘నిజానికి స్కామ్‌లు జరిగాయా? గతంలో రేవంత్ చేసిన కామెంట్లన్నీ నిజమైతే.. ఎందు కు ఎంక్వైరీ చేయడం లేదు? కేసు సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు? బడ్జెట్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉంది. ఆరు గ్యారంటీలకు నిధుల ఊసే లేదు. బీసీలకు రూ.11 వేల కోట్లే ఇవ్వడం అన్యాయం.
ఏపీలోనూ అప్పులున్నా ఇచ్చిన మాట ప్రకారం రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ఏమైంది? లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదు. అప్పులు ఎంత చేశారనేది బడ్జెట్లో ప్రస్తావించలేదు. 16% మూలధన వ్యయంతో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు?’’అని ఏలేటి అన్నారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నట్లు చెప్పారని, కానీ.. రాష్ట్రంలో 20 శాతం కమీషన్‌తో ప్రభుత్వం నడుస్తున్నదని ఆరోపించారు.
యూపీఏ హయాం కంటే ఎన్డీయే పాలనలోనే రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిధులు పెరిగాయన్నారు. యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా 32 శాతం మాత్రమే ఉండగా, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వాటాను 10% పెంచి 42 శాతానికి చేర్చారని గుర్తు చేశారు.