
- నియోజకవర్గానికి ఏం చేయని రేవంత్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తడు: కేటీఆర్
- 35 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టి రూపాయి తేలే
- ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నడు
- రేపో మాపో మహిళల పుస్తెలుగూడ ఎత్కపోతరని కామెంట్
- ఆమనగల్లులో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష
ఆమనగల్లు, వెలుగు: దొంగ హామీలతో సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, ప్రజలను మోసం చేస్తామని ముందే చెప్పిన నిజాయతీ గల మోసగాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సొంత నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలు చేయని ఆయన రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఫోర్త్, ఫ్యూచర్ సిటీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రేవంత్‌రెడ్డి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు వెల్దండ మండలంలో 500 ఎకరాల భూమి ఉన్న రేవంత్ కుటుంబం, ఆయన సోదరులు వెయ్యి ఎకరాలను కొల్లగొట్టారని, అత్తగారి ఊరైన మాడుగుల మండలంలో వెయ్యి, 1200 ఎకరాల భూమి జమ చేసి వాటికోసం పెద్ద రోడ్లు వేసే ఆలోచన తప్ప.. ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు.
కాంగ్రెస్ను నమ్మితే హామీలు అమలు చేయలేదని, స్కూటీలు ఇస్తానని లూటీ చేస్తున్నారని, ప్రభుత్వాన్ని నమ్మితే మహిళల మెడలలోని పుస్తెల తాళ్లు కూడా లాక్కెళ్తారని అన్నారు. రైతు రుణం కట్టలేదని మొన్న ఓ ఇంటికి తాళం వేశారని, నిన్న స్టార్టర్లు తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం, మహిళలకు నెలకు 2,500, రైతు కూలీలకు భరోసా, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారని, అవి అమలు అయ్యాయా? అని అడిగి తెలుసుకునేందుకే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక 35 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు.
మా పదేండ్ల పాలనలో సస్యశ్యామలం చేసినం
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాను సస్యశ్యామలం చేసి, వలసల జిల్లాకు కూలీలను వాపసు తీసుకువచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని కేటీఆర్ అన్నారు. పాలమూరు –రంగారెడ్డి పథకాన్ని బీఆర్ఎస్ 90 శాతం పూర్తిచేస్తే.. మిగిలిన 10 శాతం పూర్తి చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతులు దరఖాస్తు చేసుకోకుండా గత ప్రభుత్వం 75 లక్షల మందికి 73 వేల కోట్ల రూపాయల రైతు బంధు వేసిందని వివరించారు.
కుల గణన పేరుతో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు వరుసలు కలిపి.. ఇందిరమ్మ పథకం పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేస్తారని, వారిని నమ్మి మరోసారి మోసపోతే గోస తప్పదని అన్నారు. ఓట్ల కోసం వచ్చిన వారిని ఇచ్చిన హామీలపై నిలదీయాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.