- రూ. 100 కోట్లు రిలీజ్ చేసిన కాంగ్రెస్ సర్కారు
- టెస్కో ఖాతాకు జమ
- త్వరలోనే సిరిసిల్ల నేతన్నల ఖాతాల్లోకి..
- గత నెల 19న రూ. 50కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
- సిరిసిల్ల నేతన్నల్లో హర్షం
రాజన్నసిరిసిల్ల, వెలుగు : పెండింగ్లో ఉన్న బతుకమ్మ చీరల బకాయిలను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.100 కోట్లను టెస్కో ఖాతాలో జమ చేసింది. గత సర్కార్ ప్రతి ఏటా తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ చీరలను ఆడబిడ్డలకు పంచేందుకు సిరిసిల్ల నేతన్నల ద్వారా దాదాపు కోటి చీరలను తయారు చేయించేది. అయితే, ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్ బట్ట ఉత్పత్తి చేయించుకుని నేతన్నలకు రూ.270 కోట్లు బకాయి పెట్టింది. అప్పుల్లో ఉన్న నేతన్నలు మూడు నెలలుగా బకాయిల కోసం ధర్నాలు, దీక్షలు చేశారు. దీంతో గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన రూ.270 కోట్లలో రూ.100 కోట్లను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసింది. గత నెల 19న విడుదల చేసిన రూ. 50 కోట్లతో కలిపి ఇప్పటివరకు రూ.150 కోట్లు టెస్కోకు జమ చేసింది.
త్వరలోనే నేతన్నల ఖాతాల్లోకి
గత నెల విడుదల చేసిన రూ.50 కోట్లను ఇప్పటికే వస్త్ర వ్యాపారుల ఖాతాల్లో జమ చేయగా, శుక్రవారం రిలీజ్ చేసిన రూ.100 కోట్లను కూడా రెండు రోజుల్లో నేతన్నల అకౌంట్లోకి జమ కానున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు రూ.270 కోట్లు ఇవ్వకపోవడంతో రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు, దీక్షలు చేసి తమ నిరసన తెలిపారు. తమ సమస్యను అర్థం చేసుకుని కాంగ్రెస్ సర్కార్ బకాయిలను చెల్లించాలని నేత కార్మిక సంఘాలు విన్నవించడంతో మంత్రి పొన్నం, వేములవాడ ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్ చార్జ్ కేకే మహేందర్ రెడ్డి చీరల బకాయిలకు సంబంధించిన అంశాన్ని సీఎం దృష్టి తీసుకెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి విడతల వారీగా బకాయిలను చెల్లిస్తామని చెప్పి దీక్షలు విరమింపజేశారు. అన్నమాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే బకాయిలను విడుదల చేస్తోంది. ఇంతకుముందు రూ.50 కోట్లు, ఇప్పుడు రూ.100 కోట్లు విడుదల చేయడం సంతోషాన్నిచ్చింది. ఇన్నాళ్లూ అప్పులు తెచ్చి బట్ట ఉత్పత్తి చేసినం, ఏడాదిగా అప్పులకు మిత్తీలు కడుతూ ఇబ్బందులు పడుతున్నం. బకాయిల విడుదలతో సగం కష్టాలు తీరినట్టే. త్వరలోనే మిగతా బకాయిలు విడుదల చేయాలి. - మండల సత్యం, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు, సిరిసిల్ల