గత బీఆర్ఎస్ సర్కారు సుమారు రూ.7 లక్షల కోట్ల అప్పులపై విచారణను ఎదుర్కోక తప్పదా? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడం దేశంలో బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. కేసీఆర్ తమ హయాంలో రూ. 6 లక్షల 71వేల కోట్ల అప్పులు చేశారని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఆ తరువాత స్వేద పత్రం పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరాలను వెల్లడించారు.
ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే తెలంగాణ అప్పులు రూ.3 లక్షల 89వేల 673 కోట్లు ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.72వేల 658 కోట్లు తీసేస్తే మొత్తం రూ.3లక్షల 17వేల 15 కోట్ల మాత్రమే ఉందనేది కేటీఆర్ మాట. ఈ అప్పును రేవంత్ ప్రభుత్వం రూ.6 లక్షల 71వేల కోట్లుగా చూపుతోందని ఇది కరెక్టు కాదంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ గ్యారంటీ ఉన్న స్పెషల్ పర్పస్ అప్పులు రూ. లక్షా 27వేల 208 కోట్లు. ఎస్పీవీ రుణాలు రూ. లక్షా 18వేల 557 కోట్లు, ప్రభుత్వ హామీ రుణాలు రూ.59వేల 414 కోట్లని, ఇవేవీ కూడా ప్రభుత్వ అప్పులు కావనేది కేటీఆర్ అభిప్రాయం.
అప్పులు ఎవరు తీరుస్తారు?
ఎస్పీవీ అంటే సొంత ఆస్తులు, బాధ్యతలతో చట్టపరమైన స్థితిని కలిగిన కార్పొరేషన్లు అనొచ్చు. కేటీఆర్ మాటలను బట్టి చూస్తే ఆయా కార్పొరేషన్లు చేసిన రూ.2లక్షల 90వేల కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించదని కేటీఆర్ స్పష్టం చేసినట్టే కదా. మరి అప్పులు ఎవరు చెల్లిస్తారు? ఆయా కార్పొరేషన్లే చెల్లించాలా?. కాళేశ్వరం నీళ్లను రైతులు, పరిశ్రమలకు అమ్మి అప్పులు తీరుస్తామంటూ కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రుణం తెచ్చారు కదా? కాళేశ్వరం నీళ్లను రైతులకు అమ్మితే ఊరుకుంటారా? అన్నదాతలు ఆగ్రహిస్తారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇదే మాట చెప్పి ఉండాల్సింది. అదేవిధంగా ఆర్టీసీతోపాటు అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. మరి ఈ కార్పొరేషన్లన్నీ వ్యాపారాలు చేసి లాభాలు మూటగట్టుకుని అప్పులు తీర్చాలా.. దేశంలో ఎక్కడైనా ఇట్లా జరుగుతుందా? కార్పొరేషన్ అప్పులతో ప్రభుత్వానికి సంబంధం లేదు అనడానికి కనీసం సిగ్గనిపించాలి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
తీర్చలేనప్పుడు అప్పులు చేయడమెందుకు?
సంపాదన లేనప్పుడు, తీర్చే అవకాశం లేనప్పుడు అప్పులు చేయడం ఎందుకు? ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడమెందుకు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మేం కట్టిన సచివాలయంలో మీరు కూర్చోవడం లేదా.. అది కూడా నిరర్థకమేనా? అని కేటీఆర్ సీఎం రేవంత్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే, బంగారం లాంటి భవనాలను కూల్చి రూ.6 వందల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా సచివాలయాన్ని కట్టడం నిరర్థకమే.
కొత్త ప్రభుత్వం అప్పులు చేయదా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కారు చేసిన అప్పులకు నెలానెలా వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆరు గ్యారంటీలు, రైతుభరోసా వంటి సంక్షేమ పథకాల అమలుకు, ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు అప్పులు చేయకుండా ఎక్కడి నుంచి తేవాలి? ప్రభుత్వాన్ని పదేండ్లు నడిపిన అనుభవమున్న ఆ నేతలు అడగాల్సిన ప్రశ్నేనా అది? అప్పుల కారణంగా ఆరు గ్యారంటీల హామీలను ఎట్లా అమలు చేస్తారో చూస్తాం. చేయకుంటే నిలదీసి తీరుతాం అంటూ సవాళ్లు విసరడం గర్హనీయం.
గద్దె దింపినా ఇంకా గులాబీ పార్టీ నేతల్లో మార్పు రాకపోవడం విడ్డూరం. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన గత సర్కార్, ఈ అప్పులు ఎందుకు చేశారో, ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారో, ఏ ఆస్తులు కూడబెట్టారో వెల్లడించాలి. గత పాలకులు వాటి వివరాలు చెప్పకపోతే కొత్త ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించక తప్పదు. అన్ని అవినీతులపై విచారణ చేయాల్సిందే. మొత్తం మీద విచారణ భయంతో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న బుకాయింపుల వల్ల, జరగాల్సిన న్యాయ విచారణలు ఆగిపోవు కదా!
జీఎస్డీపీ కన్నా అప్పులు పెరిగాయి
2013-14లో రూ.లక్షా 12వేల 162గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2022–-23 నాటికి రూ.3లక్షల 17వేల 115కు చేర్చామని స్వేదపత్రంలో కేటీఆర్ పేర్కొన్నారు. మరి ప్రతి ఒక్కరి ఆదాయం మూడు లక్షలకు పైగా పెరిగిపోయినా రాష్ట్రంలో ఇంకా పేదరికం ఎందుకుందో బీఆర్ఎస్ నాయకులే చెప్పాలి.
జీఎస్‌డీపీ 2013-–14లో రూ.4.51 లక్షల కోట్లుగా ఉండగా, 2022-–23 నాటికి రూ.13.27 లక్షల కోట్లకు పెరిగిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రూ. 13 లక్షల కోట్లకు జీఎస్డీపీ పెరిగినప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీటికి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు? మాట్లాడితే రూ.50లక్షల కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టామని చెప్పుకుంటున్నారు. మరి ఆ రూ. 50 లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడని నూతన ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. కానీ, రూ. 50 లక్షల కోట్ల ఆస్తులు ఉంటే కదా? భూములు, భవనాలను ఆస్తులుగా చెప్పుకునే హక్కు బీఆర్ఎస్కే కాదు. ఏ ప్రభుత్వానికీ ఉండదు. ఎందుకంటే రాష్ట్ర ఆవిర్భావం నుంచి భూమి ఉంది. దాన్ని ఏ ప్రభుత్వమూ రెక్కల కష్టంతో సంపాదించి పెట్టలేదు.
బోదనపల్లివేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక