డిసెంబర్, 2023లో ఏర్పడిన నూతన తెలంగాణ ప్రభుత్వం ఫార్మా సిటీ మేడిపల్లిలో ఏర్పాటు చేయవద్దని ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఫార్మా కాలుష్యం తెలంగాణకు పట్టిన ఖర్మ. దేశంలో ఎక్కడా లేనన్ని ఫార్మా, బయోటెక్ పరిశ్రమలు ఇక్కడ ఉన్నంత మాత్రాన తెలంగాణ ప్రజలకు ఒరిగేది శూన్యం. మిగులుతున్నది కాలుష్యం మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు, తెలంగాణాలో విపరీతంగా పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యం ఒక అవినీతిమయంగా, స్థానిక వనరులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర పూరిత పరిణామంగా చూసిన రాజకీయ దృక్పథం మనకు తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినాక ఈ జాడ్యం పోతుందని, కాలుష్య భూతానికి పరిష్కారం లభిస్తుంది అని అంతా భావించారు. ఇక్కడి ఆకాంక్షలకు, వనరులకు, పరిస్థితులకు అనుగుణమైన పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరుగుతది అని ప్రజలు ఆశించారు. కానీ, 2017 నాటికి అదనంగా 169 ఫార్మా కంపెనీలకు అనుమతి లభించటం, ప్రస్తుతం ఉన్న కంపెనీలు ‘ఉత్పత్తి సామర్థ్య’ విస్తరణకు దరఖాస్తు చేయటం, అనుమతులు పొందటం, ఫార్మా సిటీ ప్రాంతానికి రూపకల్పన జరగడంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద, ఆశల మీద ‘నీళ్ళు’పోసినట్లయింది.
కాలుష్యం పెంచే పాలసీలు
ప్రోత్సాహకాలు, రాయితీలు, ఇంకా ఇతర ‘బుజ్జగింపు’లతో కూడిన ప్రస్తుత తెలంగాణ పారిశ్రామిక విధానం ‘రెడ్’ క్యాటగిరీ పరిశ్రమలకు గత బీఆర్ఎస్ సర్కారు రెడ్ కార్పెట్ పరిచింది. EASE of Doing Business, single window clearance, TSiPASS తదితర సంస్కరణలు పాలనా నియంత్రణను గాలికి వదిలేసి పారిశ్రామిక కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ప్రజలకు పర్యావరణానికి కీడు చేసింది. హైదరాబాద్ ‘ఫార్మా సిటీ’ని ఏర్పాటు చేయడం కొవిడ్ మహమ్మారి వ్యాధి నేపథ్యంలో అత్యంత అవసరం అని ప్రచారం చేసింది. తెలంగాణ పరిశ్రమల మంత్రితో సహా అధికారులు హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో పెడతామని తమ సొంత ‘కలను’ ప్రజల ఆకాంక్షగా మలిచే ప్రయత్నం చేశారు.
జీరో డిశ్చార్జి పేరిట..
అక్కడ ఒక్కటి, ఇక్కడ ఒకటి పరిశ్రమలు ఉన్నప్పుడే ఇంత దారుణ పరిస్థితి ఉండగా, హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఒకే చోట 15 వందల ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలనీ బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 నుంచి ప్రయత్నాలు చేసింది. ఇది పూర్తి స్థాయి విష నగరిగా మారుతుంది అని ప్రజలు భావిస్తూ, తీవ్రంగా దీనిని వ్యతిరేకిస్తున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ విష నగరి వల్ల రాబోయే దుర్భర పరిస్థితులు ఊహకు కూడా అందవు. ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక ప్రాంతాలలో కాలుష్యాన్ని నియంత్రించలేని ప్రభుత్వ అధికారులు ఒకటే చోట వెయ్యి కంపెనీలు పెడతామని మొండిగా వ్యవహరించడం దారుణం. ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ఫార్మా సిటీ బారిన పడే అన్ని గ్రామాల ప్రజలు దీనిని మొదటి నుంచి వ్యతిరేకించారు.
20,000 ఎకరాలలో ఫార్మా సిటీ ఏర్పాటు వలన ఒక 100 నుంచి 150 కి.మీ పరిధిలో పర్యావరణం, చెట్లు, చేమ, చెరువులు, కుంటలు, చెలమలు, భూమి, మట్టి, నేల, పీల్చే గాలి వంటి అన్ని రకాల సహజ వనరులు కలుషితమై, స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని మేము చెప్పినా పట్టించుకోలేదు. ఈ కాలుష్య ప్రభావం కొన్ని దశాబ్దాల వరకు ఉంటుంది. భవిష్యత్ తరాల ఉనికికి ఇది ప్రమాదం. జీరో డిశ్చార్చి ఒక అశాస్త్రీయ ప్రక్రియ. దాన్ని ప్రతిసారి ఉచ్చరిస్తూ శాస్త్రీయంగా కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నట్లు అధికారులు, పారిశ్రామికవేత్తలు భ్రమలు కల్పిస్తున్నారు. తమ ప్రయోజనాల కోసం నాయకులు వాటిని వల్లె వేస్తున్నారు.
గత పరిశ్రమల మంత్రి నిర్వాకం ఎట్టిదనిన..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన ఫార్మా పరిశ్రమల నుంచి పరిపూర్ణ నష్ట పరిహారం ఇప్పించకుండా, కాలుష్య ఫార్మా పరిశ్రమలను చట్ట ప్రకారం శిక్షించకుండా, నియంత్రించకుండా, ఇంకా కొత్తగా పరిశ్రమలను పెట్టమని ప్రోత్సహించారు గత తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి. ప్రజాస్వామిక పాలన మీద చిత్తశుద్ధి లోపించిన ఈ మంత్రి.. తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా తన మాటే నెగ్గాలని మొండిపట్టు పట్టడం గమనార్హం.
ఫార్మా పరిశ్రమలను తరలించి కొత్త ప్రాంతంలో కాలుష్యం చేస్తూ, ఉత్పత్తి చేసుకోవచ్చు అనే సందేశం యాజమాన్యానికి ఇస్తూ హైదరాబాద్ ఫార్మా సిటీ కొరకు విలువైన ప్రజా ధనాన్ని, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేసినారు. ఇటీవల ఒక ఫార్మా పరిశ్రమ యజమానికి రాజ్యసభలో సభ్యత్వం ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక ఆలోచనలకూ నిదర్శనం. వేల కోట్ల రూపాయల సంపద కొందరికే అందే విధంగా గత తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించింది. ప్రకృతి వనరుల దోపిడీకి తన విధానాల ద్వారా ఆజ్యం పోసింది.
అన్ని పార్టీలూ గొంతు విప్పాలె
స్థానిక ఫార్మా పరిశ్రమ కారణంగా హైదరాబాద్, తెలంగాణ ఆరోగ్య సూచీలో ఎలాంటి మెరుగుదల లేని పరిస్థితులలో, ప్రతిపాదిత హైదరాబాద్ ఫార్మా సిటీ మీద కూడా ఎలాంటి ఆశలు లేవు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణాలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు, విస్తరణ, కాలుష్యం వంటి అంశాల మీద నియంత్రణకు నడుం బిగించాలి. ఫార్మా పరిశ్రమ విస్తరణకు వ్యతిరేకంగా బహిరంగ, విస్పష్ట ప్రకటన చేయాలి. ఫార్మా బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలి.
కాలుష్య రహిత, సుస్థిర అభివృద్ధికి పునాదులు వెయ్యాలి. ఫార్మా పరిశ్రమ బాధితులను ఆదుకునేందుకు ప్రాథమికంగా రూ.1,500 కోట్ల నిధి ఏర్పాటు చేసి, ఆయా కుటుంబాల ఆరోగ్యం, జీవనోపాధుల పెంపుదలకు, స్థానిక సహజ వనరుల పరిరక్షణకు వినియోగించాలి. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని తిరిగి సమీక్ష చేయాలి. ముసాయిదా ప్రతి ప్రజల ముందు పెట్టాలి.
కాలుష్యం పట్టని గత ప్రభుత్వం
జీరో డిశ్చార్జి అంటూ.. స్థానిక భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలను నియంత్రించకుండా, వాటిని మూసివేయకుండా, ప్రజలు నిరసనలు తెలియజేస్తే వారి మీద తప్పుడు కేసులు పెట్టిన వైనాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మీద దృష్టి పెట్టకపోగా, ఇంకా ఫార్మా పరిశ్రమలు పెట్టండి, అనుమతులు సులభతరం చేశామని ప్రచారం చేసింది.
తక్షణం మూసేయాలె
నీరు, గాలి, నేల కాలుష్యం చేస్తున్న ఫార్మా కంపెనీలను తక్షణమే మూసివేయాలి. పారిశ్రామిక కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలి. వ్యవసాయం, గ్రామాలను, ప్రజలను కాలుష్యం నుంచి కాపాడాలి. భూగర్భ జలాలను కలుషితం చేస్తున్న పరిశ్రమలను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి, క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చెయ్యాలి. నష్టపోయిన ప్రజలకు, రైతులకు సంపూర్ణ పరిహారం అందజెయ్యాలి.
తెలంగాణకు ఫార్మా సిటీ వద్దు
ఎట్టి పరిస్థితులలోను ఫార్మా సిటీ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా ఏర్పాటు చేయవద్దు. కొత్త ప్రభుత్వం TS-iPASS, Ease of Doing Business విధానాలు సమీక్షించాలి. అనుమతులలో పారదర్శకత పెంచాలి. ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి చెయ్యాలి. పర్యావరణ అనుకూల, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణా రాష్ట్ర పారిశ్రామిక విధానం రూపకల్పన జరగాలి. వ్యవసాయ యోగ్య భూమి ఎట్టి పరిస్థితులలో పారిశ్రామిక, పట్టణీకరణ అవసరాలకు మార్చరాదు. తెలంగాణా రాష్ట్రంలో ఫార్మా కంపెనీల ఉత్పత్తి సామర్థ్య విస్తరణను, కొత్త యూనిట్లను అనుమతించ వద్దు. కాలుష్య నియంత్రణలో పేరుకు పోయిన అవినీతిని నిర్మూలించాలి. తెలంగాణా కాలుష్య నియంత్రణ బోర్డులో సాంకేతిక సామర్థ్యం పెంచాలి. తెలంగాణా అభివృద్ధి నమూనా తయారు చేసి, ప్రజలతో సంప్రదింపుల ద్వారా ఆమోదించాలి.
తెలంగాణకు ఫార్మా పరిశ్రమ ఒక ఖర్మ
ఫార్మా పరిశ్రమలు ఇంజక్షన్ బోర్లు వేసి ప్రమాదకర వ్యర్థ జలాలు భూగర్భంలోకి వదులుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా విషమయం అయిపోతున్నాయి. రక రకాల రంగులలో కలుషిత నీళ్ళు బోర్ల ద్వారా రావడం అనేక గ్రామాలలో చూస్తున్నాం. వ్యవసాయం పూర్తిగా నిలిపి వేసే పరిస్థితి వచ్చింది. పల్లె ప్రజలు, పశువులు అంతు చిక్కని రోగాల బారిన పడుతున్నారు. పశువులు విషం నీళ్ళు తాగి చనిపోతున్నాయి. జీవనోపాధులు దెబ్బ తింటున్నాయి. గ్రామీణ పేదరికం ఆయా ప్రాంతాలలో పెరుగుతున్నది. హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతంలో దాదాపు 40 ఏండ్లక్రిందట సిరిస్ కంపెని చేసిన కాలుష్యం వల్ల, ఇప్పటికీ ఆ ప్రాంత వాసులకు బోర్లలో విష సమానమైన రంగు నీళ్లు తప్పటం లేదు.
డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్