తక్షణం వ్యవసాయంపై దృష్టి పెట్టాలె

 తక్షణం  వ్యవసాయంపై దృష్టి పెట్టాలె

మిచౌంగ్‌‌‌‌ తుఫాన్‌‌‌‌ వలన రాష్ట్రంలో 4.75 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న , మిరప, పత్తి పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. వానాకాలంలో వరి పంటను మార్కెట్‌‌‌‌కు తీసుకురాగా కల్లాలలోనే ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడానికి మిల్లర్లు నిరాకరించారు. ఈ తుఫాన్‌‌‌‌ వలన రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లింది. అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  ప్రభుత్వం ఓటమిపాలై,  కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ హడావిడిలో  మిచౌంగ్​ తుఫాన్​ వల్ల జరిగిన నష్టపరిశీలనను కొత్త ప్రభుత్వం, అధికార యంత్రాంగం గమనించలేదు. 

ఈ వానాకాలంలో జులై నెలలో కురిసిన భారీ వర్షాల వలన 12 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి.  ఎకరాకు రూ.10 వేల చొప్పున 2.20 లక్షల ఎకరాలకు నష్ట పరిహారం చెల్లిస్తామని గత ముఖ్యమంత్రి  కేసీఆర్​ ప్రకటించారు. కానీ,  బాధిత రైతులకు పరిహారం ఇవ్వలేదు. వానాకాలం పంటలోనే రెండుసార్లు వచ్చిన వరదల వలన 17 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. నష్టం రూ.7 వేల కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా గత సంవత్సరానికి  రూ.599 కోట్లు కేటాయించగా 2023–-24కు రూ. 629 కోట్లు కేటాయించడం జరిగింది.

 ఈ నిధులు కూడా రైతులకు పరిహారం కింద ఇవ్వలేదు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ తొమ్మిదిన్నర  సంవత్సరాల పాలనలో  కరువు, వరదల వలన రూ.27,000 కోట్ల నష్టం వాటిల్లింది. పరిహారంగా రూ. 4,327 కోట్లు మాత్రమే ఇచ్చారు. ప్రతి ఏటా రైతులు ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోతూనే ఉన్నారు. పాడి పశువుల ప్రాణాలు కోల్పోవడంతోనూ నష్టం వాటిల్లింది.  నష్ట పరిహారం కోసం రైతాంగం ఉద్యమించాల్సిన అవసరం ఉంది.

రైతు భరోసా :  రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు రెండు పంటలకు రూ. 15,000 ఇస్తామని ప్రకటించారు. వానాకాలం పంటలకు గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. ప్రస్తుత యాసంగి పంటలకు కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం వారి మేనిఫెస్టో ప్రకారం ఎకరాకు రూ.7500 ఇవ్వాలి. తక్షణం ప్రభుత్వం రూ. 627 కోట్లు విడుదల చేస్తూ, గత రైతుబంధులాగే ఎకరాకు రూ. 5 వేలు చొప్పున కొంతమంది రైతుల ఖాతాలో వేయడం జరిగింది. వ్యవసాయ శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు  రైతుబంధుపై సమీక్షించాలి.రైతు భరోసా పేరుతో రూ.7,500 చొప్పున రైతుల ఖాతాలలో వేస్తామని ప్రకటించారు.

రుణమాఫీ: మేనిఫెస్టోలో ప్రకటించిన రూ.2,00,000 రుణమాఫీ అమలు కోసం కమిటీ వేసి నిబంధనలకు రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రకటించారు. యాసంగి పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించాలి.  ఇప్పటివరకు 35 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్‌‌‌‌కు అమ్మకానికి వచ్చింది. ఇంక 70 లక్షల టన్నులు రావాల్సి ఉంది.  వరికోతలు జరుగుతున్నాయి.  ధాన్యంతోపాటు మొక్కజొన్నలు, సోయా, పప్పు ధాన్యాలు కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. 

ప్రభుత్వం కొన్ని పంటలకు బోనస్‌‌‌‌ను కలిపి ధరలు నిర్ణయించినట్లు మేనిఫెస్టోలో  పేర్కొన్నవిధంగా వాటిని అమలు చేయాలి. రైతు కమిషన్‌‌‌‌ వేసి అధికారికంగా అమలు చేయాలి.   పంటలకు బోనస్​ పెంచుతూ నిర్ణయించిన ధరలను అన్ని మార్కెట్‌‌‌‌లలో అమలు జరిపేవిధంగా చర్యలు చేపట్టాలి. ప్రతి మండల కేంద్రంలో మార్కెట్‌‌‌‌ యార్డులను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరలను అమలు చేయడానికి కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రయత్నించాలి. అదేవిధంగా డెయిరీ రంగాన్ని సర్కారు ఆదుకోవాలి.  లీటర్‌‌‌‌ పాలకు రూ.5 ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. దీనిని  వెంటనే అమలు చేయాలి.

భూమాత: ధరణిని భూమాతగా మార్చి వారం రోజులలో ధరణిలోని లోపాల నివేదిక ఇవ్వడానికి కమిటీ వేస్తామని ప్రకటించారు. భూయాజమాన్య హక్కులు కల్పించడానికి కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ప్రస్తుతం ప్రజాదర్బార్​ పేరిట ప్రతి మంగళ, శుక్రవారాలలో   దరఖాస్తులు తీసుకుంటున్నారు. అలాగే జిల్లాలో కూడా ప్రజాదర్బార్​ చేపట్టి  భూసమస్యలతో పాటు ఇతర అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.  

అసైన్డ్‌‌‌‌ భూములపై హక్కులు కల్పించాలి

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌తోపాటు కాంగెస్‌‌‌‌ పార్టీలు తమ మేనిఫెస్టోలలో అసైన్డ్‌‌‌‌ భూములను అమ్ముకోవడానికి హక్కులు కల్పిస్తామని తెలిపారు. అసైన్డ్‌‌‌‌ భూముల భూ సేకరణకు చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పటికే అసైన్డ్‌‌‌‌ భూములు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయి. 9/77 చట్టాన్ని (అమ్మకపు నిషేధ చట్టం) రద్దు చేస్తామని ప్రకటించారు. 1956 నుంచి 2022 వరకు 22.34 లక్షల ఎకరాలను అసైన్ట్‌‌‌‌ చేశారు. దీనిపై గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం సర్వే చేయగా 82 వేల మంది కొనుగోలు చేసినట్లు తేలింది. 2017 డిసెంబర్​ నాటికి పేదలు కొనుగోలు చేస్తే వారికి పట్టాలు ఇస్తామని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం చట్టం చేసింది. దానిని అమలు చేయలేదు. అసైన్డ్​ భూముల ప్రభుత్వ విధానంపై నిర్ణయం చేయాలి.

కాళేశ్వరంపై విచారణ

 కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి నివేదిక రూపొందిస్తామని ఇరిగేషన్‌‌‌‌ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్‌‌‌‌ రెడ్డి ప్రకటించారు. కానీ,  ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఎల్‌‌‌‌ ఆండ్‌‌‌‌ టి కంపెనీ తొలుత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం కాలంలో (ఎన్నికల ముందు) జరిగిన నష్టాన్ని తానే భరిస్తానని ప్రకటించింది.  అనంతరం కాంగ్రెస్‌‌‌‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ లోపాన్ని తాను సవరిస్తే అందుకు అదనంగా కాంట్రాక్ట్‌‌‌‌ కుదుర్చుకోవాలని ఇంజినీర్లకు నోటీసు పంపించింది. మరోవైపు ఇంజినీర్లు ఎల్‌‌‌‌ ఆండ్‌‌‌‌ టి కంపెనీయే నష్టాన్ని భరించాలని ప్రకటించారు. ప్రభుత్వం దీనిపై తన వైఖరిని ఇంకా ప్రకటించలేదు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులలో ఎర్పడిన  లోపాల వలన రిపేర్లు జరిగేవరకూ ఈ ప్రాజెక్టుల నుంచి నీటిని ఎగువకు పంపింగ్‌‌‌‌ చేయడం సాధ్యంకాదు.

ప్రస్తుతం శ్రీరాంసాగర్‌‌‌‌ నుంచి దిగువకు నీరు రావడానికి తగినంత నీరు ప్రాజెక్టులలో లేదు. మిడ్‌‌‌‌మానేరు, లోయర్‌‌‌‌మానేరు, మల్లన్నసాగర్‌‌‌‌,  కొండపోచమ్మతోపాటు పలు ప్రాజెక్టులకు నీరురాదు. వచ్చే ఏడాది వానాకాలం వరకు ఎదురు చూడాలి. శ్రీరాంసాగర్‌‌‌‌ ప్రాజెక్టుకు వచ్చే నీటిని ఆపడానికి మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు మూసివేస్తుంది. తిరిగి జులైలో గేట్లు ఎత్తుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రూ. 1.35 లక్షల కోట్ల నిర్మాణ అంచనాలో నేటికి బడ్జెట్‌‌‌‌ ద్వారా, కార్పొరేషన్ల ద్వారా రూ.82 వేల కోట్లు వ్యయం చేయడం జరిగింది.

టి. సాగర్​, జనరల్​ సెక్రటరీ, 
తెలంగాణ రైతు సంఘం