- లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయదుందుభి
మహబూబాబాద్/ హనుమకొండ / జనగామ: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓట్ల సంఖ్య పెరిగింది. కాగా, ఉమ్మడి వరంగల్జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. గులాబీ పార్టీకి ఓటు బ్యాంగ్తగ్గిపోగా, జిల్లాలోని పలు చోట్ల బీజేపీ ఓటు బ్యాంక్ కొంత పెరిగింది. కాగా, పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడంతో పార్టీలో పూర్వవైభవం సంతరించుకుంది.
రూరల్ ఓట్లన్నీ హస్తం ఖాతాలోనే..
పార్లమెంట్ ఎన్నికల్లో రూరల్ ఓటర్లంతా కాంగ్రెస్ కే జై కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తీరు కనిపించగా, లోక్ సభ ఎలక్షన్స్ లోనూ అదే ట్రెండ్ కొనసాగించారు. వరంగల్ తూర్పు మినహా పట్టణ ఓటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దీంతో వరంగల్ లోక్ సభ స్థానంలో హస్తం పార్టీ బంపర్ మెజార్టీతో విజయాన్ని అందుకుంది. అర్బన్ఏరియాలైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2,83,446 ఓట్లకు 1,49,320 పోలవగా, అందులో కాంగ్రెస్ కు 63,400, బీజేపీకి 60,611, బీఆర్ఎస్కు 21,165 వచ్చాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లయ్యింది.
వరంగల్ తూర్పులో 2,58,435 ఓట్లలో 1,68,234 ఓట్లు పోలవగా, ఈ ఒక్క చోట మాత్రమే బీజేపీకి అధిక ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ ఏకంగా 74,581 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 66,627, బీఆర్ఎస్ కు 20,360 ఓట్లు వచ్చాయి. మిగతా నియోజకవర్గాలైన పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాలు రూరల్ బ్యాక్ గ్రౌండ్ తో ఉంటాయి. ఆయా నియోజకవర్గాల రూరల్ ఓటర్లంతా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు. మొత్తంగా 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా, ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యమే కనిపించింది. దీంతోనే పోలైన 12,67,946 ఓట్లలో 5,81,294 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య విజయాన్ని అందుకున్నారు. మొత్తంగా 2,20,339 ఓట్ల బంపర్ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కావ్య పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు.
కనీస పోటీ ఇవ్వని బీఆర్ఎస్..
ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ గులాబీ దండును నిరాశలోకి నెట్టాయి. ఒక్కటంటే ఒక్క రౌండ్లోనూ ఆధిక్యత సాధించక పోవడం వారిని కుంగదీస్తోంది. భువనగిరి ఎంపీ పరిధిలో ఉన్న జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఆయనకు వచ్చిన 2,22,249 మెజార్టీలో జనగామ నుంచి 31,235 ఓట్లు ఉన్నాయి. మొత్తం 20 రౌండ్లలో నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరుగగా అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ దూకుడు కనిపించింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి 15,783 ఓట్ల మెజార్టీతో గెలిచినా, లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఆయన ప్రభావం చూపలేకపోవడం పార్టీ శ్రేణులను నైరాశ్యానికి గురిచేస్తోంది.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న ఏకైక నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా మారితే ఇక ముందు పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందనే చర్చలు గులాబీ లీడర్లలో ఎక్కువయ్యాయి. కాగా, కాంగ్రెస్ పుంజుకోవడం అధికార పార్టీ క్యాడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ నాటి పోలింగ్ లోటును భర్తీ చేసుకోవడంతో పాటు 31 వేల పైచిలుకు మెజార్టీని పార్టీ ఎంపీ అభ్యర్థికి వచ్చేలా చేయడంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర యువజన నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
భారీ మెజార్టీతో బలరాం నాయక్ గెలుపు..
మహబూబాబాద్ పార్లమెంట్(ఎస్టీ) స్థానం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 3,49,165 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఘన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ 50 శాతంకు పైగా ఓట్లను సాధించడంతో భారీ మెజార్టీ సమకూరింది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పినపాక, ఇల్లంద, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీకి 2,93,445 ఓట్ల మెజార్టీ రాగా, ఎంపీ ఎన్నికల్లో 3,49,165 ఓట్ల మెజార్టీ రావడంతో పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నది.