భువనగిరిలో.. పైపైకి కాంగ్రెస్​ గ్రాఫ్

  • గత ఎన్నికల కంటే భారీగా పెరిగిన ఓట్లు
  • అన్ని తానే వ్యవహరించిన ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి
  • 2.22 లక్షల మెజార్టీతో చామల విజయభేరి

యాదాద్రి, వెలుగు: భువనగిరి లోక్​సభ స్థానానికి జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్​ పెరుగుతోంది. 2014 మినహా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్లు పెంచుకుంటూ వెళ్తోంది.  నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండలో మిర్యాలగూడ లోక్​సభ స్థానానికి బదులుగా 2009లో భువనగిరి ఏర్పడింది.  ఇందులో ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2009లో టీడీపీ మద్దతుతో మహాకూటమి తరఫున పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై కాంగ్రెస్​క్యాండిడేట్ కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి 1,39,462 ఓట్ల తేడాతో సత్తా చాటారు. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో నల్లు ఇంద్రసేనారెడ్డి(టీడీపీ పొత్తులో బీజేపీ అభ్యర్థి)కి 1,82,817,  రాజగోపాల్​ రెడ్డి (కాంగ్రెస్​)కి 4,16,371, బీఆర్ఎస్​అభ్యర్థి బూర నర్సయ్యకు 4,46,903 ఓట్లు వచ్చాయి. దీంతో బూర 30,532 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్​ తరఫున కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి.. బీఆర్ఎస్​ అభ్యర్థి బూర నర్సయ్యపై 4,796 ఓట్లతో విజయం సాధించారు. తాజాగా జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున కొత్త అభ్యర్థి చామల కిరణ్​కుమార్​ రెడ్డిని బరిలోకి దించారు. 

ఎన్నికల ఇన్​చార్జిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తానే అభ్యర్థి అన్న తరహాలో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని  దాదాపు 46 మండలాలు, 15 మున్సిపాలిటీల్లో ఆయన పర్యటించారు. దీంతో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్​లో గత ఎన్నికల కంటే 4  వేల నుంచి 40 వేల వరకు ఓట్లు పెరిగాయి.  ఈ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యకు 4,01,513 ఓట్లు రాగా, చామలకు 6,23,762 ఓట్లు రావడంతో..  2.22 లక్షల మెజార్టీ విజయ ఢంకా మోగించారు.