
జనగామ, వెలుగు : ‘తెలంగాణలో చెరువులు, కుంటలు నిండి ఎక్కువైన నీళ్లు మత్తడి పోస్తున్నట్లు.. బీఆర్ఎస్లో లీడర్లు ఎక్కువైన్రు.. మత్తడిలో కొన్ని చేపలు పోయినట్లే పార్టీలోని లీడర్లలో పోయేవాళ్లు పోతరు.. ఉండేవాళ్లు ఉంటరు.. ఎవరైనా పార్టీ లైన్లో పనిచేయాల్సిందే.. పార్టీ అన్నీ గమనిస్తున్నది..’ అని ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. పరోక్షంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి ఆయన కామెంట్స్చేశారు. గురువారం జనగామ జిల్లా కేంద్రం శివారు యశ్వంతాపూర్లోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్లో కడయం మీడియాతో మాట్లాడారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కేదక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రత్యేక స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారన్నారు. అత్యధిక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని, 33 జిల్లాల్లో 33 కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. అన్నమో రామచంద్రా అనే పరిస్థితి నుంచి దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరామన్నారు.
ప్రజలను మోసం చేసేందుకు గ్యారెంటీలు
కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ఆరు గ్యారెంటీ స్కీమ్లను ప్రకటించిందని కడియం ఆరోపించారు. అధికార దాహంతో ఇష్టమొచ్చిన హామీలు ఇస్తుందన్నారు. ఆ పార్టీని నమ్మితే నట్టేట మునగడం ఖాయమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీజేపీకి తెలంగాణ అంటే గిట్టదని, పైసా సాయం చేయడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేస్తున్నారని అన్నారు. మోదీ తీరును స్థానిక బీజేపీ లీడర్లు ప్రశ్నించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి ఒక్క సీటూ రాదన్నారు. తనకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమని అన్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని కడియం ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ, లింగాల ఘన్పూర్ ఎంపీపీ చిట్ల జయశ్రీ, ఎడవెల్లి కృష్ణారెడ్డి, ప్రభాకర్, చిట్ల ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.