మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణలో  మిగిలిన 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.  కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ రెడ్డి, హైదరాబాద్  నుంచి మహమ్మద్‌ సమీర్‌  పేర్లను ఖరారు చేసింది.  ఎన్నికల నామినేషన్ కు రేపటికి చివరి తేదీ కావడంతో  అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం.  అయితే  అధిష్టానం ప్రకటించకముందే  కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి  రామసహాయం రఘురామ్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. 

Also Read:లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి

రాజేందర్‌రావు తండ్రి వెలిచాల జగపతిరావు కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేందర్‌ రావు గతంలో కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కొంతకాలం బీఆర్ఎస్, తర్వాత ప్రజారాజ్యంలో ఉ న్నారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా కరీంనగర్‌ నుంచి పోటీ చేసి 1.75 లక్షల ఓట్లు సాధించారు. తర్వాత పాలిటిక్స్​కు దూరమయ్యారు.  

వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకే రఘురామరెడ్డి.  మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  వియ్యంకుడు . రఘురాంరెడ్డికి ఒక వియ్యంకుడు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కాగా, మరో వియ్యంకుడు సినీ హీరో వెంకటేశ్. గతేడాది పొంగులేటి కుమార్తెను రఘురాంరెడ్డి చిన్న కుమారుడికి ఇచ్చి పెండ్లి చేయగా, అంతకు ముందే రఘురాంరెడ్డి పెద్ద కొడుక్కి నటుడు వెంకటేశ్​కుమార్తెతో పెండ్లయ్యింది.