పొత్తు గిత్తు జాన్తా నై: ఢిల్లీలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి కాంగ్రెస్

పొత్తు గిత్తు జాన్తా నై: ఢిల్లీలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి కాంగ్రెస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమిలో భాగస్వామి అయిన ఆప్‎తో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగానే ఢిల్లీ అసెంబ్లీ  ఎన్నికల్లో  పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ శుక్రవారం (నవంబర్ 29) ప్రకటించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో సహా ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని దేవేందర్ తేల్చి చెప్పారు. 

ఢిల్లీ కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ విషయంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాగా, ఇండియా కూటమిలో భాగంగా ఆప్, కాంగ్రెస్ కలిసే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దేవేందర్ యాదవ్ తాజా ప్రకటనతో గత కొన్ని రోజులుగా ఢిల్లీ పాలిటిక్స్‎లో నెలకొన్న ఉత్కంఠ వీడింది. దేశ రాజధాని హస్తినాలో అధికారం కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తలపడనున్నాయి. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. 

ALSO READ | ప్రసాదాల నాణ్యతా ప్రమాణాలపై పిటిషన్.. కొట్టేసిన సుప్రీంకోర్టు

ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది (2025) ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్, బీజేపీ ఇప్పటికే ఎన్నికల కసరత్తును స్టార్ట్ చేశాయి. ఆప్ ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా తొలి అభ్యర్థులను జాబితాను సైతం ప్రకటించింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. దేశ రాజధానిలో కాషాయ జెండా రెపరెపలాడించడమే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 43 కమిటీలను ఏర్పాటు చేసింది.