సిద్దిపేటపై కాంగ్రెస్ స్పెషల్ నజర్ .. వందల కార్లతో ర్యాలీ

సిద్దిపేటపై కాంగ్రెస్ స్పెషల్ నజర్ .. వందల కార్లతో ర్యాలీ
  • 6న సిద్దిపేటకు రానున్న మైనంపల్లి  
  • కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు?

సిద్దిపేట, వెలుగు: పార్లమెంటు ఎన్నికల సమయాన సిద్దిపేట నియోజకవర్గంపై కాంగ్రెస్  ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో పార్టీకి పునర్ వైభవం తేవడంతో పాటు మాజీ మంత్రి హరీశ్​ రావుకు చెక్ పెట్టేలా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి రావడంతో నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్  నేతలు గులాబీ పార్టీలో చేరిపోయారు.

 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావడంతో సిద్దిపేటలో నామమాత్రంగా మారిన పార్టీకి నూతనోత్తేజం కలిగించే దిశగా అడుగులు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏకఛత్రాధిపత్యం కొనసాగగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇదే  సరైన సమయంగా కాంగ్రెస్ భావిస్తుండగా  హరీశ్​రావును వ్యతిరేకించే మాజీ ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు సిద్దిపేటపై దృష్టి సారిస్తుండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఉమ్మడి మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మైనంపల్లి ఉన్న సందర్భంలో హరీశ్​రావుతో అమీ తుమీ అన్నట్టుగా కొట్లాడారు. దీనికి తోడు ఇటీవల తిరుపతి పర్యటనలో మైనంపల్లి హన్మంతరావు నేరుగా హరీశ్​రావుపై సంచలన కామెంట్స్ చేసి బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మరోవైపు సిద్దిపేటలో హరీశ్​రావు ఓటమే ధ్యేయంగా పనిచేస్తానని మైనంపల్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సిద్దిపేటలో ఈనెల 6న మైనంపల్లి హన్మంత రావు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ కార్ల ర్యాలీని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

హైదరాబాద్ నుంచి ఈనెల 6న వందలాది కార్లతో సిద్దిపేటకు చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు.  సిద్దిపేటలో మైనంపల్లి హన్మంతరావు నిర్వహించే  పార్టీ  సమావేశంలో బీఆర్ఎస్​తో పాటు ఇతర పార్టీల నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.