- తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని కాపాడుకుంటాం: కవిత
జగిత్యాల టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదని, తమకు ధైర్యం, స్ఫూర్తిని నింపిన తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. ఆదివారం జగిత్యాల– కరీంనగర్ ప్రధాన రహదారి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె భూమి పూజ చేశారు.
అనంతరం థరూర్ నుంచి జగిత్యాల కొత్త బస్టాండ్ వరకు కార్యకర్తలు బైక్ ర్యాలీగా వచ్చి సర్కిల్ వద్దనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వం మీద కాంగ్రెస్ చేస్తున్న దాడిని ఎండగడతామన్నారు. గెజిట్ ఇచ్చినా, కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. అనంతరం సారంగాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను కవిత సందర్శించారు.