- ఈసారి విజయం ఖాయమని నేతల ధీమా
- గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన నేతలు, కార్యకర్తలు
యాదాద్రి, వెలుగు : భువనగిరిలో ఈసారైనా విజయం సాధించాలని కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 40 ఏండ్లుగా గెలవలేకపోయింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ కారణాలతో ఇక్కడ హస్తం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. భువనగిరిలో 1985 నుంచి తెలుగుదేశం పార్టీ వరుసగా విజయం సాధించింది. 1985 నుంచి 2000లో మాధవరెడ్డి చనిపోయేవరకు ఆయనే గెలుస్తూ వచ్చారు. 2000 ఉప ఎన్నిక నుంచి 2009 వరకు మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు.
జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ చాలా కాలం పాటు గెలవలేకపోయింది. 1999, 2009లో మినహా 1983 నుంచి ఇప్పటి వరకు ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలన పై ఈసారి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. తెలంగాణ అంతటా కాంగ్రెస్ గాలి వీచింది. దీంతో భువనగిరి, ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థులు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్య గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు సానుకూలంగా వస్తుండడంతో రెండు చోట్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ మీద హస్తం క్యాండిడేట్లు గెలిచి రికార్డ్సాధిస్తారన్న ఆశాభావంతో ఉన్నారు.
భువనగిరి, ఆలేరు నుంచి రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. వారు మూడోసారి బరిలో ఉన్నందున ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమయ్యింది. ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడా నిరసనలు, నిలదీతలు ఎదురయ్యాయి. దాన్ని అధిగమించి ఓటర్లను ఆకట్టుకోవడానికి వారు సర్వశక్తులు ఒడ్డారు. ఈసారైనా తమ పార్టీ భువనగిరి నియోజకవర్గంలో గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆశిస్తున్నారు.
పోలింగ్ లో టాప్
యాదాద్రి జిల్లా పోలింగ్‌లో టాప్‌లో నిలిచింది. జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 4,50,207 మంది ఓటర్లకు గాను 4,06,804 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 90.36 శాతం పోలింగ్ నమోదైంది. ఆలేరులో 90.77 శాతం, భువనగిరిలో 89.91 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కౌంటింగ్ కోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. లెక్కింపు కోసం 102 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నారు. ఇతర సిబ్బంది మరో 300 మంది విధుల్లో కొనసాగుతున్నారు. ముందుగా భువనగిరిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1032, ఆలేరులో పోలైన 1031 పోస్టల్ బ్యాలెట్లను, వీటితో పాటు భువనగిరిలోని హోం ఓటింగ్‌లో పోలైన 301 ఓట్లు, ఆలేరులో పోలైన 303 ఓట్లను లెక్కిస్తారు.
ఆలేరులో నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో 309 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. మొత్తం 2,11,744 ఓట్లు పోలయ్యాయి. దీంతో 23 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. బొమ్మల రామారంలోని సెంటర్ నుంచి లెక్కింపు ప్రారంభమై.. ఆత్మకూరు(ఎం) మండల ఓట్లతో ముగియనుంది. భువనగిరిలోని నాలుగు మండలాల్లో 257 సెంటర్లు ఉన్నాయి. 1,95,060 ఓట్లు పోలయ్యాయి. భువనగిరితో ఓట్ల లెక్కింపు మొదలై వలిగొండతో ముగియనుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.