- సిటింగ్స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో బీఆర్ఎస్
- మోదీ చరిష్మా, రామాలయాన్ని నమ్ముకున్న బీజేపీ
ఖమ్మం, వెలుగు : ఖమ్మం గుమ్మంపై కాంగ్రెస్ కన్నేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ఆరు సెగ్మెంట్లనూ గెలిచిన హస్తం పార్టీ ఇదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. మొదటి నుంచీ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మం నుంచి ఇప్పటివరకు 11 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది.
సీపీఎం రెండు సార్లు, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలుగుదేశం పార్టీ, వైసీపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కోసారి మాత్రమే గెలుపొందారు. రెండు దఫాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2019 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ బోణీ కొట్టింది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కాబోర్లా పడడంతో ఈసారి ఖమ్మంను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్, పరువు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. మోదీ చరిష్మా, అయోధ్య రామాలయాన్ని నమ్ముకుంటున్న బీజేపీకి క్యాడర్లేకపోవడం పెద్ద మైనస్.
జోష్‌లో కాంగ్రెస్..
రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్, మరో చోట కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏడు సెగ్మెంట్లలో కలిపి బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్‌కు 2.63 లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. కాంగ్రెస్ టికెట్ వస్తే చాలు విజయం ఖాయమనే ధీమా ఆశావహుల్లో కనిపిస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలామంది ముందుకొస్తున్నారు. 12 మంది నేతలు కాంగ్రెస్ టికెట్ కోసం అప్లయ్ చేసుకోగా, వారిలో రేణుకాచౌదరి రేసు నుంచి తప్పుకున్నారు. ఆమెను రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపిక చేయడంతో మిగిలిన వారికి లైన్ క్లియర్ అయింది. ప్రధానంగా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని పేర్లు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పరువు నిలిచేనా?
2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణీ కొట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి కీలక నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ డీలా పడింది. వారిద్దరు లేని లోటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్ గా కనిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి, తుమ్మల, భట్టి ముగ్గురు మంత్రులయ్యారు. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం గగనంగానే కనిపిస్తోంది. ఆ పార్టీ తరపున మరోసారి నామ నాగేశ్వరరావు బరిలోకి దిగే అవకాశముంది.
ఆయన అంతకు ముందు టీడీపీ తరపున ఒకసారి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల నామినేషన్లకు కొద్దిరోజుల ముందు బీఆర్ఎస్ లో చేరి, ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా సిట్టింగ్ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారమున్నా, హైకమాండ్ నుంచి ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. ఒకవేళ సిట్టింగ్ అభ్యర్థిని మారిస్తే తమకు అవకాశమివ్వాలంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు ముగ్గురు నేతలు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
అయోధ్య, మోడీ క్రేజ్ నే నమ్ముకున్న బీజేపీ
బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. రీసెంట్ గా అయోధ్య రామమందిర నిర్మాణం, ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్‌ను నమ్ముకొని ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారు. స్థానికంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఉమ్మడి జిల్లాలో కాషాయపార్టీ బలం పుంజుకోవడం లేదు. గతం కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు నేతలు బీరాలు పోయినా, చివరి నిమిషంలో జనసేన పార్టీతో పొత్తు కారణంగా డీలాపడ్డారు.
ఎన్నికలకు ముందు అమిత్ షా మీటింగ్ తో వచ్చిన ఉత్సాహం కూడా నీరుగారి పోయింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికల్లోనే బీజేపీ అభ్యర్థికి 20వేలకు పైగా ఓట్లు రాగా, రీసెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అంతకు నాలుగు వేలు తక్కువగానే బీజేపీ, జనసేన అభ్యర్థులకు పోలయ్యాయి. అన్ని సీట్లలో కనీసం డిపాజిట్లు దక్కలేదు.
అయినా ఈసారి ఎంపీగా బరిలోకి దిగేందుకు బీజేపీలో ఆశావహులు పోటీపడుతున్నారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డిని పార్టీ బరిలో దింపే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కిసాన్ మోర్ఛా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, గత ఎన్నికల్లో పోటీచేసిన దేవకి వాసుదేవరావుతో పాటు మరికొంత మంది కూడా బీజేపీ టికెట్ రేసులో ఉన్నారు.
కమ్యూనిస్టుల దారెటు..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఎన్నికల వ్యూహాలపై ఇంకా క్లారిటీ రాలేదు. గత ఎన్నికలకు ముందు పొత్తు కుదరడంతో సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీచేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ రెండు కలిసే పోటీ చేయనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీచేసిన సీపీఎం మాత్రం, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఉండే అవకాశముంది. గతంలో సీపీఎం తరపున తమ్మినేని వీరభద్రం ఒకసారి ఖమ్మం ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.