రాష్ట్రంలో లెఫ్ట్, కాంగ్రెస్ సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ఐదేసి సీట్ల చొప్పున సీపీఐ, సీపీఎం ప్రతిపాదనలు పెడితే.. రెండేసి చొప్పున ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది. అందులో ఒకటి కోరుకున్న సీటు.. మరొకటి ఎక్కడైనా ఇస్తామని చెప్పినట్లు తెలిసింది.
సీపీఐ కోరుకున్న ఐదు సీట్లలో మునుగోడు కానీ, కొత్తగూడెం గానీ ఇస్తామని చెప్పగా.. చివరికి కొత్తగూడెంకు సీపీఐ ఓకే చెప్పినట్లు తెలిసింది. మరోటి తాము అనుకున్నట్లుగా చెన్నూరు సీటు ఇస్తామని కాంగ్రెస్ పేర్కొన్నట్లు తెలిసింది. సీపీఎం కోరుకున్న ఐదు సీట్లలో మిర్యాలగూడ సీటు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసినట్లు సమాచారం.
దీంతో మిర్యాలగూడ కాంగ్రెస్ లో అసంతృప్తులు భగ్గుమన్నారు. కాంగ్రెస్ టికెట్ కేటాయింపు పై ఆందోళన చేపట్టారు. సేవ్ కాంగ్రెస్.. సేవ్ మిర్యాలగూడ నినాదంతో కాంగ్రెస్ నేత బీఎల్ఆర్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. దామరచర్ల మండలంలోని రాళ్ళవాగు తండా నుంచి మిర్యాలగూడలోని రాజీవ్ చౌక్ వరకు ఈ ర్యాలీ చేపట్టారు. మిర్యాలగూడ అసెంబ్లీ సీటును సీపీఎంకు కేటాయించొద్దని డిమాండ్ చేశారు..