- ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్
- ఇప్పటి వరకు 14 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్
- పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటి
- మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
న్యూఢిల్లీ, వెలుగు : వరంగల్ లోక్ సభ స్థానానికి మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ముందు నుంచి పెండింగ్ లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలను మరోసారి హోల్డ్ లో పెట్టింది. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్ ఒక స్థానానికి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించింది. సోమవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) భేటీ జరిగింది.
ఈ భేటీలో సీఈసీ సభ్యులుగా అగ్రనేత సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, పలువురు హాజరుకాగా.. తెలంగాణ నుంచి రాష్ట్ర ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. అరగంట పాటు సాగిన ఈ భేటీలో మిగిలిన నాలుగు స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీలోకి బలమైన నేతల చేరికలు, స్థానిక సర్వేలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా రాష్ట్ర నాయకత్వం అందించిన అభ్యర్థుల లిస్ట్ పై ఖర్గే, సోనియా, ఇతర నేతలు చర్చించారు. అయితే ఇందులో మూడు స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినా.. ఒకరి పేరును మాత్రమే హైకమాండ్ రిలీజ్ చేసింది. దీంతో మొత్తం 17 స్థానాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.
ఖమ్మం లోక్సభ స్థానం రాష్ట్రంలోనే అత్యంత హాట్ సీటుగా మారింది. ఈ స్థానానికి భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ పోటీ పడుతున్నారు. అయితే.. తాజాగా కాంగ్రెస్ సీనియర్నేత రామసహాయం రఘురాం రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థులను సీఈసీలో డిసైడ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ స్థానాలను హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది.
కరీంనగర్ నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన వెలిచాల రాజేందర్ వైపు హైకమాండ్ మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే ఇదే స్థానం నుంచి తీన్మార్ మల్లన్న కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్ ను బరిలో నిలపాలని భావించినా.. అనూహ్యంగా సమీర్ పేరు తెరపైకి వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి చేరికలు ఉన్నాయని, అందువల్లే వాటిని రిజర్వ్ లో పెట్టినట్లు సమాచారం.
కేసీతో సీఎం, డిప్యూటీ సీఎం భేటి
సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సాయంత్రం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో భేటి అయ్యారు. లోధి రోడ్ లోని కేసీ నివాసంలో జ ఈ భేటి జరిగింది. దాదాపు 15 నిమిషాల పాటు కేసీతో రేవంత్ రెడ్డి, భట్టి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఖమ్మం సీటు తన సతీమణికి కేటాయించాలని భట్టి కోరినట్లు తెలిసింది.
అలాగే, ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లు, ముఖ్యనేతల రాక ఇతర అంశాలపై డిస్కస్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఎక్కువ లోక్ సభ స్థానాలు సాధించే దిశలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార ఏర్పాట్లపై చర్చించారు. మధ్యలో కేసీ వేణుగోపాల్ ఇతర అపాయింట్మెంట్ లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. సీఎం, డిప్యూటీ సీఎంలు కాసేపు కేసీ నివాసంలోని గార్డెన్ లో పలు అంశాలపై చర్చించారు.
కొద్ది సేపటి తర్వాత సీఎం యమునా లోని తన క్వార్టర్స్ కు వెళ్లిపోయారు. భట్టి అక్కడి నుంచి నేరుగా రాజాజీ మార్గ్ లోని పార్టీ చీఫ్ ఇంటికి వెళ్లారు. అక్కడ మల్లికార్జున ఖర్గే తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం సీటు కేటాయింపుపై చర్చించినట్లు తెలిసింది. తర్వాత భట్టి తాను బస చేస్తున్న హోటల్ వెళ్లారు. కాగా, సీఎం, డిప్యూటీ సీఎంలు ఢిల్లీ పర్యటన ముగించుకొని నేడు తిరిగి హైదరాబాద్ రానున్నారు.