విధేయతకు పట్టం.. నల్గొండ జిల్లాకు దక్కిన 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు

విధేయతకు పట్టం..  నల్గొండ జిల్లాకు దక్కిన 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు
  • ఎస్టీ కేటగిరీలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్
  • ఎస్సీ కేటగిరీలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్
  • ప్రకటించిన కాంగ్రెస్​అధిష్ఠానం

నల్గొండ, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విధేయులకు అధిష్ఠానం ఎమ్మెల్సీ పట్టం కట్టింది.  ఆదివారం ఏఐసీసీ ప్రకటించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో జిల్లాకు చెందిన ఇద్దరికి స్థానం లభించింది.  ఎస్టీ కోటాలో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, ఎస్సీ కోటాలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేర్లను  ప్రకటించింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు దక్కు తాయని పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

 ఈ మేరకు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్​కు విధేయులుగా ఉంటున్న శంకర్ నాయక్, అద్దంకి దయాకర్​ల పేరు ప్రకటించడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర  పోషించిన దయాకర్, రాష్ట్రం ఏర్పడ్డాక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.  తొలిసారి 2018 శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో  ఆయనకు ఛాన్స్ దక్కలేదు. మందుల సామేలుకు టికెట్ ఇవ్వడంతో దయాకర్​కు  ఎమ్మెల్సీ ఇస్తామని తుంగతుర్తి ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.  ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.  

ఇక, శంకర్ నాయక్ 1998 నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నారు. దామరచర్ల మండలం కేతావత్ తండాకు చెందిన శంకర్ నాయక్ మొదటి నుంచి సీనియర్ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడు.  కాగా, శంకర్ నాయక్ తండ్రి వీర్యానాయక్ చాలాకాలం సర్పంచ్ గా పని చేశారు.  తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన శంకర్ నాయక్  దామరచర్ల ఎంపీపీ, జడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మిర్యాల గూడ పట్టణ అధ్యక్షుడిగా పని చేశారు. 2019 నుంచి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నాగార్జునసాగర్, హుజూర్​నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్​గా పని చేశారు.  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల సహకారంతో ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించింది. 

ఎస్టీ కోటాలో మంత్రి పదవిపై ప్రచారం..

ఎస్టీ కోటాలో జిల్లాకు మంత్రి పదవి వస్తుందని ముందు నుంచి ప్రచారం జరిగింది.  దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ కు  డిప్యూటీ స్పీకర్ ఇస్తారన్న టాక్ వినిపించింది. కానీ, అనూహ్య పరిణామాల నేపథ్యంలో అదే సామాజి క వర్గానికి చెందిన శంకర్ నాయక్ కు  ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం విశేషం.  నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్​లో ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.  వీళ్లలో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ పక్షానే నిలబడ్డారు. దీంతో, నల్గొండ పార్లమెంట్ పరిధిలో  ఇద్దరు ఎస్టీలకు కాంగ్రెస్ స్థానం కల్పించింది.  

ఇక, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తాజాగా మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ కు  అవకాశం ఇచ్చారు.  దీంతో, జిల్లాలో సామాజిక సమీకరణాల విషయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్టు తెలుస్తోంది.  ఇక, నామినేటెడ్ పోస్టులపై అందరి దృష్టి నెలకొంది. పార్టీలో ఇప్పటికే చాలా మంది ఆశావహులు నామినే ట్ పోస్టుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రధానంగా బీసీ కోటాతోపాటు, ఎస్సీలో మరికొంత మంది సీనియర్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.