న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలోని నాలుగు లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ –టీ జీవన్ రెడ్డి, భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి -నీలం మధుకు అవకాశం కల్పించింది. మిగతా 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 31 న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. బుధవారం ఏఐసీసీ హెడ్ ఆఫీసులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీ జరిగింది.
ఆ స్థానాలు నెక్ట్ మీటింగ్‌లో ఫైనల్
తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా.. తాజాగా నలుగురి పేర్ల ప్రకటనతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 13కు చేరింది. ఇందులో ఫస్ట్ లిస్ట్ లో 4, సెకండ్ లిస్ట్ లో 5, తాజా లిస్ట్ లో నాలుగు స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మిగిలిన ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు ఎంపిక చేయాల్సి ఉన్నది. ఈ నెల 31 న జరిగే సీఈసీ మీటింగ్ లో ఈ స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేయనున్నది.
హాట్ సీట్ గా ఖమ్మం
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో కాంగ్రెస్ కంచుకోటగా కనిపిస్తున్న ఖమ్మం సీటు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఖమ్మం అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకరు పార్టీ సీనియర్ నేత, మరొకరు రాష్ట్రంలో అధికారం తేవడంలో ఖమ్మం నుంచి ఎక్కువ స్థానాలు గెలిపించిన వ్యక్తి... ఈ రెండింటి మధ్య ఈ స్థానాన్ని ఎవరికి కేటాయించాలన్న అంశంపై హైకమాండ్ సైతం మల్లగుల్లాలు పడుతున్నది.
అలాగే, వరంగల్ టికెట్ కోసం దమ్మాటి సాంబయ్యతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పసునూరి దయాకర్ పోటీ పడుతున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనకంటే బలమైన అభ్యర్థి కోసం రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసినట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం పదిలంగా ఉండాలంటే ఎంఐఎం సపోర్ట్ అవసరమని భావిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్ స్థానం నుంచి బరిలో నిలిపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తున్నది.