ఖమ్మం సీటుపై వీడని ఉత్కంఠ .. రేసు నుంచి మంత్రుల కుటుంబ సభ్యులు ఔట్!

  • ఆధిపత్య పోరుపై హైకమాండ్​ గుర్రు
  • ప్రత్యామ్నాయ పేర్లపై కసరత్తు
  • తెరపైకి కొత్త ముఖాలు
  • ఇదే జరిగితే తమకు కలిసొస్తుందనే అంచనాలో బీఆర్ఎస్​నేతలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం పార్లమెంట్​టికెట్ ను​ఇక్కడి మంత్రుల కుటుంబసభ్యులకు ఇచ్చేది లేదని కాంగ్రెస్​ హైకమాండ్​ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. సీటు విషయంలో ముగ్గురూ పంతానికి పోతుండడం, ఒకరికి ఇస్తే మిగిలినవాళ్లు సహకరిస్తారనే నమ్మకం లేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ లీడర్ల పేర్లు సూచించాలని ముగ్గురు మంత్రులకే బాధ్యత అప్పగించడం ఆసక్తి రేపుతోంది. దీంతో కొత్తగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

రేసులో కొత్త ముఖాలు..

కమ్మ సామాజిక వర్గం నుంచి వ్యాపారవేత్త, వీవీసీ మోటార్స్ అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్  ఖమ్మం టికెట్​ఆశిస్తున్నారు. ఈయనకే టికెట్ ఖాయమైందని  ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కూడా టికెట్ రేసులో ఉన్నారు.  వీరు కాకుండా కొత్తగా సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు,  నందమూరి హరికృష్ణ కుమార్తె టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని పేర్లు  తెరపైకి వచ్చాయి. 

నిజామాబాద్ కు చెందిన మండవ వెంకటేశ్వరరావుకు పార్లమెంట్ టికెట్ పై గతంలో హామీ ఇచ్చారని, కమ్మ సామాజికవర్గం నుంచి ఆయన్ను ఖమ్మంలో పోటీకి నిలబెట్టడం ద్వారా పలు ఈక్వేషన్లను వర్కవుట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డితో ఇటీవల సుహాసిని భేటీ అయ్యారు. 2018 ఎన్నికల్లో ఆమె టీడీపీ కూటమి తరఫున కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

 ఆమెకు టికెట్ ఇవ్వడం ద్వారా పాత టీడీపీ కేడర్ ను ఆకట్టుకోవడం కూడా ఈజీ అవుతుందని అంచనాలు ఉన్నాయి.  మరోవైపు బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థి కోసం ఇటీవల కాంగ్రెస్ ముఖ్య నేతలు గ్రౌండ్ వర్క్ చేసినట్లు సమాచారం. ఇక బీసీ కోటాలో వి.హనుమంతరావు, లోకేశ్​ యాదవ్, నాగ సీతారాములు రేసులో ఉన్నారు.

బీఆర్ఎస్ లో పెరుగుతున్న ఆశలు

లోక్ సభ టికెట్ విషయంలో కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ హైకమాండ్​ ఆసక్తిగా గమనిస్తోంది. మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్ కు టికెట్ ఇవ్వడం లేదనే వార్తలతో ఆ పార్టీ​ నేతల్లో ఆశలు చిగురిస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ, బలమైన నేతలు  పోటీలో లేకపోవడం తమకు కలిసివస్తుందనే అంచనాలో ఉన్నారు. 

కాంగ్రెస్ లో కొత్త అభ్యర్థికి టికెట్ దక్కితే మంత్రుల సహకారం ఉండదని, దీనికి తోడు తాము గట్టిపోటీ ఇవ్వగలుగుతామని, అదే జరిగితే తమ విజయావకాశాలు మెరుగుపడుతాయని ఆ పార్టీ నేతలు  లెక్కలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్య రెండున్నర లక్షల ఓట్ల తేడా ఉందని, అందులో లక్షా 30 వేల ఓట్లను అదనంగా పొందగలిగితే ఖమ్మం సీటును గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.