- పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే యెన్నం
- త్వరలో సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం
మహబూబ్‌నగర్/మక్తల్, వెలుగు: తిరగబడదాం.. తరిమికొడదాం’ స్లోగన్‌తో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. అందుకు తగ్గట్లు తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ రెబెల్స్‌ను ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నాలను స్పీడప్ చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించి, వారికి కుదిరితే అసెంబ్లీ టికెట్, లేకుంటే పార్టీ రూలింగ్‌లోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులు ఇస్తామనే హామీలు ఇస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడు, పాలమూరు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆయన వెంట ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఉన్నారు.
అయితే, వీరిద్దరు రేవంత్‌రెడ్డిని కలవడంతో వారు కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ నడుస్తోంది. ఇటీవల యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ నుంచి బయటకు రాగా, బాలకృష్ణారెడ్డి కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో సోనియా హాజరుకానుండగా, అదే రోజు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మరికొంత మంది తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్‌లోకి మక్తల్ బీఆర్ఎస్ లీడర్లు..
మక్తల్ బీఆర్ఎస్లో కొద్ది రోజులుగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిపై అదే పార్టీకి చెందిన లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇస్తున్నట్లు సీఎం ప్రకటించడంతో, ఇతరులకు టికెట్ ఇవ్వాలని ఈ నెల 3న షాద్‌నగర్‌లో వీజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్‌రెడ్డి, ఆ పార్టీ లీడర్లు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు చేయడంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రెబల్స్ పై నోరు పారేసుకున్నారు.
దీనిపై రెండు రోజులు పాటు ఎమ్మెల్యే వర్గం లీడర్లు, రెబల్స్ పోటాపోటీగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతూ హల్చల్ చేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి వారు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్టారెడ్డి, మక్తల్, మాగనూర్ మాజీ జడ్పీటీసీలు లక్ష్మారెడ్డి, విఠల్, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ వైస్ ఎంపీపీ సునీత గోపాల్ రెడ్డి, మక్తల్ మాజీ సర్పంచ్ సూర్యనారాయణ గుప్తా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్, సంగంబండ సర్పంచ్ రాజుతో పాటు మరికొంత మంది మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే, వీజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్‌రెడ్డి మాత్రం రూలింగ్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన మక్తల్ బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
సీతా దయాకర్‌రెడ్డి చేరికతో జోష్..
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి సోమవారం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమె చేరికతో అటు దేవరకద్ర, ఇటు మక్తల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. కొత్తకోట దయాకర్‌రెడ్డి గతంలో మక్తల్ టీడీపీఎమ్మెల్యేగా పని చేయగా, ఆ పార్టీ తెలంగాణలో వీక్ కావడంతో వీరి అనుచరుల్లో చాలా మంది రూలింగ్ పార్టీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిలో ఎక్కువ మంది రూలింగ్ పార్టీలో సర్పంచులు, ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు సీతా దయాకర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో వీరంతా హస్తం గూటికి వస్తారనే చర్చ నడుస్తోంది. అదే జరిగితే ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఏర్పడుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
బీఆర్ఎస్ కు బిగ్ షాక్!
గద్వాల, వెలుగు: గద్వాల బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. గట్టు జడ్పీటీసీ శ్యామల హనుమంతు నాయుడు, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు ఫ్యామిలీ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరనున్నారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గట్టు భీముడు ఫ్యామిలీ, గట్టు జడ్పీటీసీ భేటీ అయ్యారు. ఈ నెల 18న పార్టీలో చేరాలని నిర్ణయించారు. బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన గట్టు భీముడు ఫ్యామిలీతో పాటు గట్టు జడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీని వీడడం ఆ పార్టీకి పెద్ద షాక్ గా చెప్పవచ్చు. గట్టు జడ్పీటీసీని బీఆర్ఎస్ పెద్దలు, గద్వాల నియోజకవర్గ లీడర్లు బుజ్జగించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు.
ఇదిలాఉంటే గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడిని ఎమ్మెల్సీ చేస్తామని బీఆర్ఎస్ హైకమాండ్ మాట ఇచ్చింది. గద్వాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సైతం ప్రకటించారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇంతలోనే ఆయన మరణించారు. ఆయన భార్య భువనేశ్వరికి ఇస్తారని ప్రచారం జరిగినా మొండి చేయి చూపించారు. పార్టీలో ఉంటే న్యాయం జరగదని పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెరపైకి యాక్సిడెంట్ కేస్..
ఏడాది కింద గట్టు మండలంలో జరిగిన యాక్సిడెంట్ కేసును తెరపైకి తెచ్చి గట్టు జడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలున్నాయి. గట్టు జడ్పీటీసీ డ్రైవర్ యాక్సిడెంట్ లో చనిపోయాడని గత ఏడాది కేసు నమోదైంది. అయితే హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారనే ఆరోపణలున్నాయి. తమకు అనుమానాలు ఉన్నాయని మృతుడి కుటుంబీకులు కేసును రీ ఓపెన్ చేయాలని ఇటీవల జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ కు కంప్లైంట్ చేశారు. ఈ వ్యవహారంలో తెర వెనక బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారనే ఆరోపణలున్నాయి.