
- కమిటీ సభ్యులతో కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం
- ఫేక్వీడియోలు, ఫొటోలతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయన్న మంత్రులు
- ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచన
- వివాదంపై కాంగ్రెస్ అన్ని వర్గాలతో చర్చిస్తుంది: మీనాక్షి
- నేడు ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో కాంగ్రెస్ ఇన్చార్జ్ భేటీ
హైదరాబాద్, వెలుగు: హెచ్‌సీయూ భూవివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీసింది. వాస్తవాలేంటో తెలుసుకొని నివేదిక ఇవ్వాలని పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ను ఆదేశించడంతో ఆమె శనివారం హైదరాబాద్ వచ్చి వివిధ వర్గాలతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో సెక్రటేరియెట్ లో సమావేశమయ్యారు. కమిటీ సభ్యులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వ భూములేనని, ఇందులో హెచ్‌సీయూ భూములుగానీ, అటవీ భూములుగానీ లేవని ఆమెకు వివరించారు.
ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం హెచ్ సీయూకు గోపన్ పల్లిలో 397 ఎకరాలను కేటాయించి, హెచ్‌సీయూకి చెందిన 534 ఎకరాల బదలాయించుకుందని, ఆ భూమిలో 400 ఎకరాలను 2004 లో ఐఎంజీ భారత్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించిందని తెలిపారు. 2006లో వైఎస్ఆర్ఆ కేటాయింపును రద్దుచేస్తే ఐఎంజీ కోర్టుకెళ్లిందని, ఇన్నేండ్ల పోరాటం తర్వాత ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని కోర్టు తీర్పు వచ్చిందని మంత్రులు చెప్పారు. కోర్టు తీర్పుతో తాము ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే బీఆర్ఎస్, బీజేపీ తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకు హెచ్‌సీయూ విద్యార్థులను రెచ్చగొట్టాయన్నారు.
ఏఐ టెక్నాలజీతో లేని జింకలు, నెమళ్లు ఉన్నట్లు, బుల్డోజర్లకు భయపడి పారిపోతున్నట్లు ఫేక్వీడియోలు, ఫొటోలు సృష్టించి, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగించారని ఆమెకు వివరించారు. అనంతరం మీనాక్షి మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ విషయంలో ప్రభుత్వానికి, పార్టీకి జరిగిన నష్టంపై వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సూచించారు.
పరిష్కార మార్గాలను అన్వేషిస్తం
హెచ్‌సీయూ భూముల వివాదంపై అన్ని వర్గాల వారితో కాంగ్రెస్ చర్చిస్తుందని, దీని పరిష్కారం కోసం మార్గాలను అన్వేషిస్తామని కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మీడియాకు చెప్పారు. ఈ వివాదంపై వివిధ రంగాల ప్రముఖులతో, ప్రజా సంఘాల ప్రతినిధులతో, విద్యార్థులతో, పర్యావరణ పరిరక్షణ సంస్థల ప్రతినిధులతో విస్తృతంగా చర్చిస్తామని ఆమె వివరించారు. అన్ని వర్గాల వారితో చర్చించి అందరి వాదనలు వింటామని, రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరితో మాట్లాడి, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయో క్షుణ్ణంగా తెలుసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడమే తమ పార్టీ విధానమని ఆమె స్పష్టం చేశారు.
అందుకు పార్టీ ఇన్చార్జ్గా తనవంతు ప్రయత్నాలు సాగిస్తానని చెప్పారు. కాగా, నేడు ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. హెచ్‌సీయూ భూ వివాదంపై వారి అభిప్రాయాలను, సలహాలు, సూచనలను అడిగి తెలుసుకోనున్నారు.
హెచ్‌సీయూ విద్యార్థులతో మీనాక్షి సమావేశం
మంత్రులతో భేటీ అనంతరం మీనాక్షి గాంధీ భవన్ వెళ్లారు. అక్కడ హెచ్‌సీయూకు చెందిన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ.. ఈ విషయంలో తాను ప్రభుత్వ పాలసీ గురించి ప్రస్తావించనని, కానీ పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో మాత్రం సలహాలివ్వాలని సూచించారు. త్వరలోనే హెచ్‌సీయూ విద్యార్థులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటానని మీనాక్షి స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు సాగించే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలని విద్యార్థులను కోరారు. సమావేశం తర్వాత కొందరు విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. ఏఐ టెక్నాలజీని వాడుకొని కేటీఆర్ అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారన్నారు. హెచ్‌సీయూ విద్యార్థులు కేటీఆర్ తప్పుడు ప్రచారాన్ని నమ్మరని తెలిపారు.