గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమిపై  రిపోర్టు ఇవ్వండి..పీసీసీని ఆదేశించిన ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమిపై  రిపోర్టు ఇవ్వండి..పీసీసీని ఆదేశించిన ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్
  • కారణాలు స్పష్టంగా పేర్కొనాలని ఆదేశం
  • గెలవాల్సిన సీటును కోల్పోవడంపై హైకమాండ్ సీరియస్​

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటును కోల్పోవడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్​గా తీసుకుంది. ఈ సీటును ఎందుకు ఓడిపోయామో వివరణ ఇవ్వాలని పీసీసీ నాయకత్వాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు.

దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కు ఫోన్ చేసిన మీనాక్షి నటరాజన్.. ‘కరీంనగర్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ సీటు మనకు కీలకమైంది.. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా దీనిని కాపాడుకోలేకపోయాం.. ఉద్యోగాల భర్తీతో పాటు యువత సంక్షేమానికి అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం.. కానీ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కోల్పోయాం.. దీని వల్ల పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అని అన్నట్లు తెలిసింది.

నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏడుగురు మంత్రులు, ఇన్​చార్జ్ మంత్రులు, పదుల సంఖ్యలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ ఈ సీటును ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందనే దానిపై నివేదికను సిద్ధం చేసి పంపించాలని మహేశ్ గౌడ్ ను ఆమె ఆదేశించారు.  

పరస్పర ఆరోపణలు..

 కరీంనగర్​ గ్రాడ్యుయేట్ సీటు కోల్పోవడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తీరు వల్లే ఈ సీటులో ఓడిపోయామని కొందరు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పీసీసీ నాయకత్వానికి చెప్పినట్లు తెలిసింది. ప్రచారంలో పార్టీ నేతలను భాగస్వాములను చేయకుండా, ఆయన సొంత సంస్థ మనుషులతోనే వ్యవహారాలు నడిపించాడని, ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆరోపించినట్లు సమాచారం.

అసలు అభ్యర్థి ఎంపికనే సరైంది కాదని, నరేందర్ రెడ్డిపై గ్రాడ్యుయేట్లలో, వారి పేరెంట్స్ లో తీవ్రమైన వ్యతిరేకత ఉండడం వల్లే గెలిచే స్థానాన్ని కోల్పోయామని బహిరంగంగా చెప్తున్నారు. కొందరు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందుకే తాను ఓడిపోవాల్సి వచ్చిందని నరేందర్ రెడ్డి పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలా పార్టీ నేతలు, అభ్యర్థి పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం గాంధీభవన్ వర్గాల్లో హాట్​టాపిక్​లా మారింది.