
- బీఆర్ఎస్ ను వేధిస్తున్న ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కేసులు
- ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వాసం
- మెదక్ ఎంపీ సీటు గెలిచి హై కమాండ్ కు కానుక ఇద్దాం
- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ
సంగారెడ్డి, వెలుగు : తెలంగాణను పదేళ్లు పరిపాలించిన మాజీ సీఎం కేసీఆర్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి, మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారిని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని ఆమె తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును బలపరుస్తూ బుధవారం కాంగ్రెస్ చేపట్టిన సన్నాహక సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మంత్రి మెదక్ అభ్యర్థి నీలం మధును అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఎంపీగా నీలం మధును గెలిపించి సీఎం రేవంత్ కు గిఫ్ట్ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు వేధిస్తున్నాయని, అందులో చిక్కుకున్న వారు ఎంతటి వారైనా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. 6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో కాంగ్రెస్ కు ప్రజాదరణ పెరుగుతుందన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం ప్రత్యేకమైనదని
ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు నియోజకవర్గం కూడా ఉందన్నారు. అందుకే ఈ సెగ్మెంట్ ను కాంగ్రెస్ సవాల్ గా తీసుకొని ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిలు, నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలన్నారు.
సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్కుటుంబానికే లాభం
తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే అందుకు ప్రతిఫలంగా కేసీఆర్ కుటుంబమే లాభపడిందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ప్రజాధనాన్ని దోచుకోవడమే కాకుండా అనేక అవినీతి అక్రమాల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తలదూర్చిందన్నారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకోగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగలాగితే డొంక కదిలి ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటికి వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ చీఫ్ మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకే ఫామ్ హౌస్ విడిచి బయటకు వచ్చారన్నారు.
మెదక్ ఎంపీ సీటును బీఆర్ఎస్, బీజేపీ కైవసం చేసుకునేందుకు డబ్బుల వలవేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నంలో ఉన్నాయన్నారు. సమావేశంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, పటాన్ చెరు అసెంబ్లీ ఇన్‌చార్జిలు ఆవుల రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సారెడ్డి, నిర్మలరెడ్డి, రోహిత్, పూజల హరికృష్ణ, కాటా శ్రీనివాస్ పాల్గొన్నారు.