కోమటిరెడ్డి ​కాంగ్రెస్​లోనే ఉంటడా... బీజేపీలోకి పోతడా?

నల్గొండ, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ స్టార్​ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కాంగ్రెస్​పార్టీలోనే ఉంటడా లేకపోతే బీజేపీలో పోతడా అని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నరని  విద్యుత్ శాఖ​మంత్రి జి.జగదీశ్​రెడ్డి కామెంట్​ చేశారు. సోమవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒకసారి ప్రధాని మోడీని పొగుడ్తడు...ఇంకోసారి అమిత్​షాను పొగుడ్తడు. రాష్ట్ర కాంగ్రెస్ ​పార్టీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిని తిడుతడు. వీళ్లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు’ అని ఎద్దేవా చేశారు.

ఎంపీ వెంకట్​రెడ్డి ఏ పార్టీ గురించి ఎప్పుడు ఏరకంగా మాట్లాడతడో కూడా తెల్వదన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్​కు ఫ్లోరోసిస్​ సోకిందని, ఆ పార్టీ నాయకులు చేసిన పాపాలు వాళ్లకే సోకాయన్నారు. జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్​ లీడర్లకు లేదని, రేపు సర్కారు జీవోలు ఇస్తుందంటే ఈ రోజు ధర్నాలు చేసే సంస్కృతి వాళ్లదన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి వనరులు పెరిగాయని చెప్పడానికి గుగూల్ ​మ్యాప్​ చూసుకుంటే సరిపోతదన్నారు. వడ్ల ఉత్పత్తిలో, కొనుగోళ్లలో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు.