ముంబై: సెబీ చైర్‌పర్సన్ మాధవీ పురీ బుచ్‌పై దాడిని కాంగ్రెస్ తీవ్రతరం చేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో సహా పలు కేసులను ఎదుర్కొంటున్న ముంబై కంపెనీకి అనుబంధంగా ఉన్న సంస్థ నుంచి ఆమె అద్దె పొందారని శుక్రవారం ఆరోపించింది. ఈ విషయమై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మాట్లాడుతూ ‘‘2018–-19లో ముంబైలోని ఆమె తన ఆస్తిలో ఒకదానిని కరోల్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్‌కు రూ.7 లక్షలకు అద్దెకు ఇచారు. అప్పుడు మాధవి సెబీలో పూర్తికాల సభ్యురాలు. కరోల్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ వోకార్డ్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో సహా పలు కేసుల్లో దీనిపై సెబీ దర్యాప్తు చేస్తోంది. రెండు కంపెనీలకు ఒకే ప్రమోటర్లు ఉన్నారు. 2018–-19 నుంచి 2023–-24 వరకు మాధవి కరోల్ ఇన్ఫో నుంచి 2.16 కోట్ల రూపాయలను అద్దె పొందారు”అని ఆయన వివరించారు. మాధవి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కూడా రూ. 16.80 కోట్లు అక్రమంగా పొందారని ఇటీవల కాంగ్రెస్ ఆరోపించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఇదిలా ఉండగా, నియంత్రణ సంస్థల పనితీరు సమీక్ష సందర్భంగా పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సెబీ చైర్‌పర్సన్‌ను పిలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.