- ప్రధాని క్లారిటీ ఇచ్చినా తప్పుదారి పట్టిస్తున్నరు : ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు : రిజర్వేషన్లకు కాంగ్రెస్సే వ్యతిరేకమని, తాము కాదని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయబోమని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చినా ప్రజలను కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తున్నదని మండిపడ్డారు. ఫేక్ వీడియోలతో ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్న వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. శుక్రవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు అమలు చేస్తే కొందరు సెకండ్ గ్రెడ్ వ్యక్తులుగా మారుతారని1961లోనే ప్రధాని హోదాలో నెహ్రూ ముఖ్యమంత్రులకు లేఖ రాశాడని గుర్తుచేశారు.
కుల రహిత దేశం కావాలని, కుల రిజర్వేషన్లు వద్దని నెహ్రూ అన్నారని తెలిపారు. మండల్ కమిషన్ రిపోర్టును రాజీవ్ గాంధీనే వ్యతిరేకించారని చెప్పారు. రిజర్వేషన్లను అడుగడుగునా కాంగ్రెస్సే అడ్డుకుందని..రాష్ట్రంలో ముస్లిం ఓట్ల కోసం కేసీఆర్, రేవంత్ పోటీ పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో హిందువుల రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.
ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని, తనకు అనుకూల, వ్యతిరేక వర్గాలను ఏర్పాటు చేసి ఘర్షణ వాతావరణం సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ యూటీ కావాలని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని, ఆయన కలలు నెరవేరవని లక్ష్మణ్ పేర్కొన్నారు.