- నా వ్యాఖ్యలను ఆ పార్టీ వక్రీకరించింది
- నా స్పీచ్ ను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నది
- ఖర్గేజీ.. రాజీనామాకు నేను సిద్ధం
- అయినా మీరు ప్రతిపక్షంలో ఉండాల్సిందేనంటూ కౌంటర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్సే అంబేద్కర్ వ్యతిరేకి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘‘అంబేద్కర్ కు వ్యతిరేకంగా నేనేమీ మాట్లాడలేదు. నేను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది. ఆ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నది” అని ఫైర్ అయ్యారు. రాజ్యసభలో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో మీడియాతో అమిత్ షా మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పై మండిపడ్డారు. ‘‘నేనెప్పుడూ అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది. ఆ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది. నా స్పీచ్ ను ఎడిట్ చేసి ప్రజలకు షేర్ చేస్తున్నది. నా స్పీచ్ మొత్తం వినాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు నిజమేంటో అర్థమవుతుంది” అని అమిత్ షా అన్నారు. కలలో కూడా అంబేద్కర్ ను కించపరచని పార్టీ నుంచి తాను వచ్చానని చెప్పారు. తన స్పీచ్ ను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్న కాంగ్రెస్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.
అంబేద్కర్ ను కాంగ్రెస్ గౌరవించలేదు..
కాంగ్రెస్ యాంటీ అంబేద్కర్, యాంటీ రిజర్వేషన్, యాంటీ కాన్ స్టిట్యూషన్ పార్టీ అని అమిత్ షా విమర్శించారు. ‘‘అంబేద్కర్ కు కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదు. కనీసం ఆయన స్మారకం కూడా నిర్మించలేదు. బీజేపీనే అంబేద్కర్ కు ఎంతో గౌరవం ఇచ్చింది. ఆయనకు గుర్తుగా ఎన్నో స్థలాలను అభివృద్ధి చేసింది. అంబేద్కర్ వారసత్వానికి గుర్తుగా రాజ్యాంగ దినోత్సవం కూడా నిర్వహిస్తున్నది” అని తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దే.
ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై దాడి చేసింది. ఆ పార్టీ వీర్ సావర్క్ ర్ ను కూడా అవమానించింది” అని మండిపడ్డారు. రాజ్యాంగ రక్షణకు అనునిత్యం పోరాడుతున్నది బీజేపీ పార్టీనే అని చెప్పారు. కాగా, అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ‘‘నేను రాజీనామా చేయాలని ఖర్గే అంటున్నారు. నేను రాజీనామా చేస్తే ఆయన హ్యాపీగా ఉంటారంటే.. అలాగే చేస్తాను. కానీ నా రాజీనామాతో ఖర్గే సమస్య తీరిపోదు. ఆయన మరో 15 ఏండ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే” అని కౌంటర్ ఇచ్చారు.