భద్రాద్రికొత్తగూడెంలో పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా  కాంగ్రెస్​ ఆకర్ష్​

భద్రాద్రికొత్తగూడెంలో పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా  కాంగ్రెస్​ ఆకర్ష్​
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రులు..
  • అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా బీఆర్ఎస్​ నుంచి ఆగని చేరికలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్​ ఆకర్ష్​ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చక్రం తిప్పుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాలకు గానూ నాలుగింటిని కాంగ్రెస్​ గెలుచుకుంది. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్, వార్డు మెంబర్లను గెలుచుకొని తమ సత్తా చాటాలని భట్టితో కలిసి ఇద్దరు మంత్రులు పక్కా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే జిల్లాలోని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లోని పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్​ చేరేందుకు పొంగులేటితో మంతనాలు సాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్​చార్జి​ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి రానున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  

టాస్క్​గా పంచాయతీ ఎన్నికలు

జనవరి నెలాఖరుతో సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్​ బూత్​లు, పోలింగ్​ సిబ్బంది వివరాలను సేకరించి ప్రభుత్వానికి  పంపించే పనిలో నిమగ్నయ్యారు. కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​కు పంచాయతీ ఎన్నికలు టాస్క్​గా మారాయి. జిల్లాలోని 21 జడ్పీటీసీలకు గానూ 18 మంది బీఆర్​ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ, ఇండిపెండెంట్లు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

18 మంది బీఆర్​ఎస్  ఎంపీపీలు ఉన్నారు. జిల్లాలోని 481 పంచాయతీలకు గానూ దాదాపు 370 నుంచి 400 వరకు బీఆర్​ఎస్​కు సర్పంచులు ఉన్నారు. త్వరలో జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను కనుమరుగు చేసి తమ సత్తా చాటేందుకు పొంగులేటి ఆధ్వర్యంలో మంత్రులు స్కెచ్​ వేస్తున్నారు. పొంగులేటి, తుమ్మల అనుచరులు ఇప్పటికే జిల్లాలోని పలువురుబీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు, లీడర్లతో మంతనాలు జరిపారు.

కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో అత్యధిక గ్రామపంచాతీలను గెలుచుకోవడంపై పొంగులేటి స్పెషల్​ ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లాకు ఇన్​చార్జి​ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండే అవకాశం ఉండడంతో బీఆర్​ఎస్​కు చెందిన జిల్లా ముఖ్య నేత, ఉద్యమకారుడైన ఓ ప్రజాప్రతినిధితోపాటు పలువురు​లీడర్లు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్​లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లుండగా ఇందులో దాదాపు 30 మంది బీఆర్​ఎస్​కు చెందిన వారే ఉన్నారు. కాగా 20 మందికి పైగా బీఆర్​ఎస్​లో చేరేందుకు పొంగులేటితో చర్చలు సాగిస్తున్నట్టుగా ఆ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్​ పేర్కొనడం గమనార్హం.