
- మేం బలంగా ఉన్నామనే 2004లో మాతో పొత్తు: కేసీఆర్
- తర్వాత మా పార్టీనే చీల్చేందుకు కుట్ర చేసింది
- రాహుల్‌కు ఎవుసం తెల్వదు
- రైతులకు 3 గంటల కరెంటు సరిపోతదా?
- గిరిజనేతరులకు పోడు పట్టాలపై కేంద్రమే అడ్డుపడ్తున్నది
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం ప్రచారం
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్/బెల్లంపల్లి, వెలుగు : కాంగ్రెస్.. దోకేబాజ్ పార్టీ అని సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. 2004లో బీఆర్ఎస్ బలంగా ఉందని గుర్తించిన కాంగ్రెస్ తమతో పొత్తు పెట్టుకుందని, గెలిచిన తర్వాత తమ పార్టీనే చీల్చేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. పోరాటాలు, బలిదానాల కారణంగా తప్పనిసరై తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణను ఆంధ్రలో కలిపి 58 ఏండ్ల పాటు ఇక్కడి ప్రజలను గోస పెట్టిన ఘనత కాంగ్రెస్‌దేనని విమర్శించారు. బీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలే బాసులని అన్నారు. బుధవారం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. పోడు సాగు చేసుకున్న గిరిజనేతరులకు కూడా పట్టాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే అడ్డం ఉన్నదని, కొన్ని కఠినమైన రూల్స్ పెట్టిందని అన్నారు. తాము అన్ని లెక్కలు తీసి కేంద్రానికి పంపామని తెలిపారు. ఎన్నికలు అయిన తర్వాత కేంద్రంపై పోరాటం చేసి పట్టాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. పోడు రైతులకు పట్టాలు ఇచ్చి, వారి మీద ఉన్న కేసులన్నీ రద్దు చేశామని, రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నామని వివరించారు.
రైతుబంధు దుబారానా?
‘‘వ్యవసాయానికి 3 నుంచి 5 గంటల కరెంట్ చాలని పీసీసీ ప్రెసిడెంట్ అంటున్నడు.. 3 గంటల కరెంట్ సరిపోతదా? కాంగ్రెస్ ఉన్ననాడు ఇయ్యలేదు.. ఇచ్చెటోళ్ల మీద నిందలు వేస్తున్నరు” అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రజల డబ్బులను రైతుబంధు పేర కేసీఆర్ దుబారా చేస్తున్నడని కాంగ్రెస్ నాయకులు అంటున్నరని, ఇది దుబారానా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు ఎవుసం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. ధరణితో భూ సమస్యలు తీర్చామని, భూముల మీద పూర్తి హక్కులు రైతులకే కల్పించామని అన్నారు. సింగరేణి సంస్థను నిండా ముంచింది కాంగ్రెస్‌పార్టీయేనని ఆరోపించారు. దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు రూ.వెయ్యి కోట్ల బోనస్‌లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఒక్కో కార్మికుడు దాదాపు రూ.2.50 లక్షలు తీసుకోనున్నారని అన్నారు.
మరోసారి మొరాయించిన సీఎం హెలికాప్టర్
సీఎం హెలికాప్టర్ మరోసారి మొరాయించింది. కాగజ్‌నగర్ మీటింగ్ తర్వాత ఆసిఫాబాద్ సభకు వెళ్లేందుకు కేసీఆర్ హెలికాప్టర్‌లో కూర్చున్నారు. ఈ సమయంలో చాపర్ మొరాయించింది. పావుగంట పాటు హెలికాప్టర్‌లోనే కూర్చున్న కేసీఆర్.. అది ఎంతకీ ఎగరకపోవడంతో బస్సులో ఆసిఫాబాద్ చేరుకున్నారు.