మీ బంధువులు, స్నేహితులకు చెప్పండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వం 4%  రిజర్వేషన్లు ఇచ్చిందని అన్నారు. వాటిని తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. సీఎం ఇవాళ రవీంద్రభారతిలో.. టీజీఎంఆర్ఈఐఎస్ వెబ్ సైట్, ఆన్ లైన్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో మోదీ వర్గం, గాంధీ వర్గం రెండే ఉన్నాయని చెప్పారు. మోదీ వర్గం గెలిస్తే మైనార్టీలకు రక్షణ ఉండదని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్‎లో ఉన్న స్నేహితులకు, బంధువులకు కాంగ్రెస్‎ను గెలిపించాలని చెప్పాలని కోరారు. 

ALSO READ | ఫాంహౌసుల్లో డ్రగ్స్ తీసుకునే వారు మనకు ఆదర్శమా ? :సీఎం రేవంత్ సూటి ప్రశ్న

మోసాల బజారులో ప్రేమ దుకాణం తెరిచేందుకే రాహుల్ గాంధీ కన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారని చెప్పారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద జాతీయ జెండా ఎగురవేసి, హిందూ, ముస్లిం భాయి భాయి అని చాటారని చెప్పారు. అప్పుడు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ కూడా సద్భావన యాత్ర సందర్భంగా చార్మినార్ వద్ద జెండా ఎగరవేశారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం భారతదేశంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడం వెనుక మైనార్టీల కృషి ఉందన్నారు. కానీ ఒక్క ముస్లింను కూడ ఎమ్మెల్యేగా గెలిపించకపోవడం బాధాకరమని అన్నారు.

అందుకే మంత్రిని చేయలేక పోయామని వాపోయారు. ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీని నియమించామని, ఎమ్మెల్సీగా అమేర్ అలీఖాన్‎కు అవకాశం ఇచ్చామ ని తెలిపారు. ఉన్నతాధికారులుగా కూడా ముస్లింలకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ప్రాంతీయ పార్టీల ముసుగులో షేర్వానీ వేసుకొని మీ మధ్య కూర్చొని బిర్యానీ తిన్నవాళ్లను నమ్మొదంటూ పరోక్షంగా కేసీఆర్‎ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఇక్కడ గెలిచిన వాళ్లు ఢిల్లీ వెళ్లి మోదీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్‎లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలు గెలువాలని అన్నారు.