కరీంనగర్: కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు కోసం పీకే ప్రయత్నం చేస్తున్నారనే వార్తల్లో నిజంలేదని టీపీసీసీ ప్రెసిడెంట్ కొట్టిపారేశారు. పీకే విషయంలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించారు. పీకే కాంగ్రెస్ పక్షాన కేసీఆర్ ను కలిశారని ప్రచారం చేయడం సరికాదన్నారు. అసలు ఇంకా పీకేనే తమ పార్టీలో చేర్చుకోలేదని, అలాంటప్పుడు ఆయనను తమ పార్టీ తరఫున ఎందుకు పంపుతామని ప్రశ్నించారు. పీకేను కాంగ్రెస్ చేర్చుకోవాలా? వద్ధా? అనే విషయంలో తమ హైకమాండ్ ఓ కమిటీ వేసిందని... ఆ కమిటీ నివేదిక ఆధారంగా సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేసే పార్టీలతో తెగతెంపులు చేసుకున్నాకే పీకేను పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ కు పరోక్షంగా కూడా పీకే వ్యూహకర్తగా ఉండడాన్ని ఒప్పుకునేదిలేదని, అలాంటిదే జరిగితే పీకేను పార్టీలోకి తీసుకోబోమన్నారు. పీకే కోసం కోసం కాంగ్రెస్ లేదని, కాంగ్రెస్ కోసమే పీకే పని చేయాలన్నారు. తమ పార్టీ జెండా కప్పుకున్నప్పటి నుంచి పీకే వ్యూహ కర్తగా గాక కాంగ్రెస్ కార్యకర్తగా ఉండాలన్నారు.
టీఆర్ఎస్ దొంగల పార్టీ అని, విష సర్పం కంటే కేసీఆర్ చాలా డేంజరని ఆరోపించారు. కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ దగ్గరకు రానీయబోదన్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని, ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ పై మొదట్లో ఫిర్యాదు చేసిన బండి సంజయ్ నాలుగు రాళ్ళు వెనకేసుకుని సైలెంట్ అయ్యారని ఆరోపించారు. తాము టీఆర్ఎస్ తో కలిస్తే బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చినట్లవుతుందని, అలాంటి పని తామెందకు చేస్తామని పేర్కొన్నారు.