2024 ఎన్నికలను అన్నిరకాలుగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అనేక రాష్ట్రాల్లో తమను అధికార పీఠం నుంచి దింపింది ప్రాంతీయ పార్టీలేనని కాంగ్రెస్‌కు తెలుసు. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను నామమాత్రం స్థానానికి పరిమితం చేశాయి. అస్సాంలో అసోం గణ పరిషత్, జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్‌ను అధికారం నుంచి దూరం చేశాయి. మరోవైపు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినప్పటికీ అది జరగలేదు.
కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన మనుగడను కొనసాగించింది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఏ రాష్ట్రంలోనైనా ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా బీజేపీ మాత్రమే ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పార్టీని చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మునుపటిలా 450 మంది ఎంపీలను పోటీ చేయడం ద్వారా తమ ఇండియా కూటమిలోని సన్నిహిత పార్టీలను కోల్పోతామని, మిత్రపక్షాలను కాదని భారీ సంఖ్యలో ఎంపీలను గెలవలేమని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కేవలం 300 మంది ఎంపీ నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తోంది.
పరిమిత లక్ష్యాలను నిర్దేశించుకున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ 55 ఎంపీల మార్కును దాటాలని కోరుకుంటుంది. కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం 100 నుంచి 150 మంది పార్టీ ఎంపీలను గెలుచుకోవడం టార్గెట్‌గా కనిపిస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీజేపీని ఆపడానికి శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్‌తోపాటు అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా దీర్ఘకాలిక సంబంధాలు కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ప్రాంతీయ పార్టీలకు ప్రాభవం కోల్పోయినవారు నాయకత్వం వహిస్తున్నారని కాంగ్రెస్‌కు తెలుసు. మాయావతి, శరద్ పవార్, లాలూ ప్రసాద్, మమతా బెనర్జీ తమ గత వైభవాన్ని కోల్పోయారు. ఉద్ధవ్ ఠాక్రే లాంటి నేతల రాజకీయ గ్రాఫ్ పడిపోతున్నది. ఈ శూన్యతను కాంగ్రెస్ భర్తీ చేయాలని భావిస్తోంది. బీజేపీ ఎదుగుదల ప్రజాకర్షక నరేంద్ర మోదీపై ఆధారపడి ఉందని కాంగ్రెస్ గ్రహించింది. అయితే నరేంద్ర మోదీ తర్వాత ఎవరు? అని ప్రశ్నించుకుంటే ఆ స్థాయి జనాకర్షణ ఉన్న నాయకుడు కాషాయ పార్టీలో మరో నేత లేడని, కాబట్టి పునర్వైభవం పొందే అవకాశం ఉందని హస్తం పార్టీ భావిస్తోంది.
లోక్‌సభ బరిలో కాంగ్రెస్ అగ్రనేతలు
కాంగ్రెస్ హైకమాండ్ తమ పార్టీ అగ్రనేతలను పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దింపుతోంది. ఉదాహరణకు కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తుండగా సీనియర్ మోస్ట్ నాయకుడు కేసీ వేణుగోపాల్ కూడా కేరళలోని అలపుజా నుంచి పోటీ చేస్తున్నారు. చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కూడా లోక్‌సభ రేసులో ఉన్నారు. రాజస్థాన్ నుంచి సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రులు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో సీనియర్ నేతలు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
దక్షిణాదిన తెలంగాణ, కర్నాటక, కేరళలే బలం
తెలంగాణ, కర్నాటకలో 2019లో 45 మంది ఎంపీలకుగాను నలుగురు ఎంపీలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల నుంచి కనీసం 20 మంది ఎంపీ స్థానాల్లో గెలుపొందేలా కాంగ్రెస్ అధిష్ఠానం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందుకే కాంగ్రెస్ 450 ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా కేవలం 300 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 150 సీట్లపై దృష్టి సారిస్తోంది. కేజ్రీవాల్ (ఢిల్లీ), శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే (మహారాష్ట్ర), లాలూ ప్రసాద్ యాదవ్ (బిహార్), స్టాలిన్ (తమిళనాడు)లతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంది. ఈ రాష్ట్రాల్లో 135 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. 2019లో 135 మంది ఎంపీలకు గానూ కాంగ్రెస్ 11 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. ఈ సారి కనీసం 30 మంది ఎంపీలకు తమ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ 2014, 2019 నాటి కొన్ని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఆశయాలు, త్యాగాలను పరిమితం చేయడం ఒక పరిష్కారం.
కాంగ్రెస్ కూటమి ఆధిపత్యం
భారతదేశంలోని 5 అతిపెద్ద నగరాలుగా ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రధానంగా ఉన్నాయి. ఈ నగరాలను బిగ్గెస్ట్ క్యాపిటల్స్అని పేర్కొవచ్చు. వీటిలో ప్రస్తుతం బీజేపీ కేవలం మహారాష్ట్ర రాజధాని ముంబైని మాత్రమే తమ ఆధీనంలో ఉంచుకోగలిగింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలను కాంగ్రెస్ పొత్తులు నియంత్రిస్తాయి. పెద్ద నగరాలను తాము నియంత్రించే స్థాయిలో ఉండటం కాంగ్రెస్‌కు ఈసారి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశాలను కల్పిస్తుంది. ఒకరకంగా తమ మనుగడకు సహకరించినందుకు బీజేపీకి కాంగ్రెస్ కృతజ్ఞతలు చెప్పాలి. ప్రాంతీయ పార్టీలపై కేంద్రంలోని అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కూటమిలోకి దూసుకెళ్లాయి. ఐదేండ్లపాటు కేసీఆర్‌పై విరుచుకుపడిన బీజేపీ.. కేసీఆర్ ఓటమిని, కాంగ్రెస్ గెలుపును ఖాయం చేసింది. బీజేపీ అధినాయకత్వం చాలా తెలివిగా ఉండవచ్చు. కానీ, కొన్నిసార్లు ప్రణాళికలు విరుద్ధమైన ఫలితాలను అందిస్తాయి. యుద్ధంలో పైరిక్ విజయం అంటే ఓటమి కంటే విజయం మరింత ఖరీదైనది. అన్ని సూచనల ప్రకారం 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ‘విభజించి జయించండి’ అని చెప్పిన చాణక్యుడు, మాకియవెల్లి, సన్ త్జు విజ్ఞానాన్ని బీజేపీ మరిచిపోయింది. బీజేపీ వైఖరి దాని ప్రత్యర్థి పార్టీలను ఏకం చేసింది.
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్