నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

‘బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు’
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌ అన్నారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం లక్ష్మీతండాకు చెందిన పలువురు నాయకులు గురువారం హైదరాబాద్‌‌‌‌లో భిక్షమయ్యగౌడ్‌‌‌‌ సమక్షంలో బీజేపీలో చేరగా, వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసిన బీజేపీని అడ్డుకోలేరన్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో రామునాయక్, నామనాయక్, యాదగిరినాయక్, నరేశ్‌‌‌‌నాయక్‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌నాయక్‌‌‌‌ ఉన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌‌‌‌ యూటీఎఫ్‌‌‌‌ సూర్యాపేట జిల్లా కార్యదర్శి దామోదర్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ మండలంలోని వివిధ స్కూళ్లలో గురువారం సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లకు యూనిఫాం, బుక్స్‌‌‌‌ అందజేయాలని, టీచర్ల ట్రాన్స్‌‌‌‌ఫర్లు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఎస్‌‌‌‌యూటీఎఫ్‌‌‌‌ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీరెల్లి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, రాజశేఖర్‌‌‌‌రెడ్డి, చిక్కుళ్ల గోవింద్‌‌‌‌, లక్ష్మీకాంత్, బొల్లం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కేసుల పరిష్కారానికి సహకరించాలి
హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : పెండింగ్‌‌‌‌ కేసులను త్వరగా పరిష్కరించేందుకు అడ్వకేట్లు సహకరించాలని హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ సీనియర్‌‌‌‌ సివిల్‌‌‌‌ జడ్జి జెట్టి శ్యామ్‌‌‌‌కుమార్‌‌‌‌ సూచించారు.  సీనియర్‌‌‌‌ సివిల్‌‌‌‌ జడ్జిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బార్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. 2017కు ముందున్న కేసులను త్వరగా పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. అడ్వకేట్లకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆయనను పలువురు అడ్వకేట్లు సన్మానించారు. కార్యక్రమంలో జక్కుల నాగేశ్వరరావు, నారాపరాజు శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసరావు, రవికుమార్, వీజీకే. మూర్తి, అంబటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, నట్టె సత్యనారాయణ, మీసాల అంజయ్య పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ గెలవడం ఖాయం
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ జెండా ఎగరడం ఖాయమని, అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విజయాన్ని అడ్డుకోలేదని ఆ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేశారు. బీర్ల ఫౌండేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మంచిరోనిమామిండ్లలో ఏర్పాటు చేసిన వాటర్‌‌‌‌ ఫిల్టర్‌‌‌‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌కు పెరుగుతున్న ఆదరణను చూసి టీఆర్ఎస్, బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్‌‌‌‌ నియంత పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ధనావత్‌‌‌‌ శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌, మండల ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు ఉచితపు వెంకటేశ్‌‌‌‌, ఎంపీటీసీ మోహన్‌‌‌‌బాబు, బీసీ సెల్‌‌‌‌ అధ్యక్షుడు రామగోని వెంకటేశ్‌‌‌‌ పాల్గొన్నారు.

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
యాదాద్రి, వెలుగు : పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లా రాయగిరిలో గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి మున్సిపాలిటీ పరిధి రాయగిరికి చెందిన మేకల  కృష్ణ (26) స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కృష్ణ తిరిగి రాలేదు. దీంతో గురువారం ఉదయం సోదరుడు నవీన్‌‌‌‌ తెలిసిన వారిని వాకబు చేశాడు. అయినా కృష్ణ ఆచూకీ తెలియకపోవడంతో చివరకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా అక్కడ చనిపోయి కనిపించాడు. పక్కనే బీర్‌‌‌‌ బాటిల్‌‌‌‌తో పాటు పురుగుల మందు డబ్బా కూడా ఉంది. దీంతో కృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా యువకుడి మృతికి కారణాలు ఇంకా తెలియలేదని, కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్‌‌‌‌ తెలిపారు.

పులిచింతలకు పెరిగిన వరద
మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌‌‌‌కు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 76 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తుండడంతో 4 గేట్లను ఎత్తి 63 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 38.7 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆఫీసర్లు తెలిపారు.

పేదల మేలు కోసమే సంక్షేమ పథకాలు
యాదగిరిగుట్ట, వెలుగు : పేదలకు మేలు చేసేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌కే దక్కుతుందని ప్రభుత్వ విప్‌‌‌‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌‌‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలంలో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి గురువారం కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30,150 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు అయ్యాయన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఆసరా పింఛన్‌‌‌‌కు అప్లై చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పైళ్ల ఇందిర, జడ్పీటీసి పల్లా వెంకట్‌‌‌‌రెడ్డి, సర్పంచ్‌‌‌‌ వడ్డెబోయిన శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

గణేశ్‌‌‌‌ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
కోదాడ, వెలుగు : గణేశ్‌‌‌‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌‌‌‌రెడ్డి సూచించారు. కోదాడ పట్టణంలోని పబ్లిక్‌‌‌‌ క్లబ్‌‌‌‌ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన పీస్‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు పర్మిషన్‌‌‌‌ తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీఐ శివ శంకర్, ‌‌‌‌ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కనగాల నారాయణ, గౌరవ అధ్యక్షుడు ముత్తవరపు పాండు రంగారావు, నాయకులు చల్లా విజయ శేఖర్, సులోచన పాల్గొన్నారు.
|
బీజేపీ, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రెండూ ఒక్కటే...

సూర్యాపేట, వెలుగు : కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌‌‌‌ రాజ్యంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌‌‌‌ పద్మావతి ఆరోపించారు. సూర్యాపేటలోని రెడ్‌‌‌‌ హౌజ్‌‌‌‌లో గురువారం నిర్వహించిన డీసీసీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌లో ఆమె మాట్లాడారు. ఈడీ, సీబీఐ పేరుతో బెదిరింపులకు దిగుతున్నారన్నారు. మూడు రోజులుగా హైదరాబాద్‌‌‌‌లో జరుగుతున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయన్నారు. మత ఘర్షణల పేరుతో మహిళపై దాడి చేసిన వారిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. దేశంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ లీడర్లు మతాన్ని వాడుకుంటున్నారన్నారు. పైసలిచ్చి నాయకులను కొనుక్కునే సంస్కృతిని కాంగ్రెస్‌‌‌‌లో లేదన్నారు. బీజేపీ, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రెండూ ఒక్కటేనన్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించన్నున చలో ఢిల్లీకి భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి గుడిపాటి నర్సయ్య,  పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, ఎస్సీ సెల్‌‌‌‌ వైస్‌‌‌‌చైర్మన్‌‌‌‌ చింతమల్ల రమేశ్‌‌‌‌, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్‌‌‌‌రావు పాల్గొన్నారు.

ఆసరా పెన్షన్‌‌‌‌తో పేదలకు మేలు
కోదాడ, వెలుగు : ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్లతో పేదలకు ఎంతో మేలు కలుగుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన పలువురికి మంజూరైన ఆసరా పెన్షన్‌‌‌‌ కార్డులను గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పేదలకు అందిస్తున్న పెన్షన్‌‌‌‌తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఆయా వర్గాల వారికి సామాజిక గౌరవం దక్కుతుందన్నారు. కోదాడ ఆర్డీవో కిశోర్‌‌‌‌కుమార్‌‌‌‌, మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ బుర్ర సుధారాణి, తహసీల్దార్‌‌‌‌ శ్రీనివాసశర్మ, మున్సిపల్ కమిషనర్‌‌‌‌ మహేశ్వర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

కోడలి బంధువుల దాడిలో వ్యక్తి మృతి
మిర్యాలగూడ, వెలుగు : కోడలి బంధువులు దాడి చేయడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం బొట్యానాయక్‌‌ తండాలో గురువారం వెలుగుచూసింది. తండాకు చెందిన బాదావత్‌‌ బాలాజీనాయక్‌‌ (50), లక్ష్మీ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు గోపికి అదే తండాకు చెందిన గౌతమితో పెండ్లి జరిగింది. వీరికి తరచుగా తల్లిదండ్రులు తమ్ముడు సైదులుతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 18న కూడా మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో అందరూ కలిసి తమను కొడుతున్నారని గౌతమి ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌‌కు సమాచారం ఇచ్చింది. ఆమె తల్లిదండ్రులు కృష్ణ, సుజాత, సోదరుడు నవీన్‌‌, బాబాయి రాము వచ్చి బాలాజీనాయక్‌‌తో పాటు, అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. బాలాజీనాయక్‌‌ తీవ్రంగా గాయపడడంతో ట్రీట్‌‌మెంట్‌‌ కోసం హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో 24న హైదరాబాద్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. 

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను గద్దె దించడం బీజేపీతోనే సాధ్యం
చౌటుప్పల్‌‌‌‌, వెలుగు : టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీని గద్దె దించడం బీజేపీతోనే సాధ్యమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి చెప్పారు. చౌటుప్పల్‌‌‌‌ జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌‌‌‌రెడ్డి, వైస్‌‌‌‌ ఎంపీపీ ఉప్పు భద్రయ్యతో పాటు పలువురు సర్పంచ్‌‌‌‌, ఉపసర్పంచ్‌‌‌‌, వార్డు సభ్యులు, లీడర్లు గురువారం రాజగోపాల్‌‌‌‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం రాజగోపాల్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ తనను ఎదిరించే శక్తి ఉండొద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని ఆరోపించారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరితే అప్పుడే మంత్రి పదవి ఇస్తామన్నారని, అయినా తాను పట్టించుకోలేదని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసమో, పార్టీ కోసమో జరిగేది కాదని, తెలంగాణ ప్రజల భవిష్యత్‌‌‌‌ నిర్ణయించే ఎన్నిక అని చెప్పారు. రేవంత్‌‌‌‌రెడ్డి మాదిరిగా రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్‌‌‌‌ ఫామ్‌‌‌‌ హౌజ్‌‌‌‌ నుంచి బయటకు వస్తారని, అప్పుడే ఆయనకు నియోజకవర్గ సమస్యలు గుర్తుకొస్తాయన్నారు. తాను అమిత్‌‌‌‌షాను కలిసినప్పటి నుంచి కేసీఆర్‌‌‌‌కు కంటిమీద కునుకు ఉండడం లేదన్నారు. మునుగోడు బహిరంగ సభకు వెయ్యి కార్లు వేసుకొని వచ్చి ఏం మాట్లాడాలో తెలియక మోటార్లు, మీటర్లు అంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌‌‌‌కు ఎన్ని కోట్లు ఇచ్చారు.. మునుగోడుకు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలని సవాల్‌‌‌‌ చేశారు. తమ నియోజకవర్గ సమస్యలపై సీఎం కేసీఆర్‌‌‌‌ను అడిగే ధైర్యం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలకు ఉందా అని ప్రశ్నించారు. మునుగోడులో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు గోడ గడియారాలు కాదు.. కిలో బంగారం పంచినా ప్రజలు కేసీఆర్‌‌‌‌ను నమ్మరన్నారు. కార్యక్రమంలో నాయకులు కండగంచి రమేశ్‌‌‌‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, దోనూరి వీరారెడ్డి, రిక్కల సుధాకర్‌‌‌‌రెడ్డి, దూడల భిక్షం, పబ్బు రాజు గౌడ్, మొగుదాల రమేశ్‌‌‌‌, భిక్షమాచారి, పెద్దటి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.


ఉద్యోగాలు ఇప్పిస్తామనే వారి మాటలు నమ్మొద్దు
సూర్యాపేట, వెలుగు : ఈ నెల 28న నిర్వహించనున్న కానిస్టేబుల్‌‌‌‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌ చెప్పారు. సూర్యాపేటలోని వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో గురువారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్లు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో మొత్తం 23,571 మంది అభ్యర్థులు ఉండగా సూర్యాపేట డివిజన్‌‌‌‌ పరిధిలో 47, కోదాడ డివిజన్‌‌‌‌ పరిధిలో 26 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.  ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకునే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. నోడల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ నాగభూషణం, రీజినల్‌‌‌‌ కో ఆర్డినేటర్‌‌‌‌, ఎస్‌‌‌‌వీ కాలేజీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ రవి పాల్గొన్నారు.

ఫీజు బకాయిలు విడుదల చేయాలి
యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : పెండింగ్‌‌‌‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం యాదాద్రి, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రిలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీ రాందేవ్‌‌‌‌, సూర్యాపేటలో జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య మాట్లాడారు. బీసీలకు బడ్జెట్‌‌‌‌ కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రెండేళ్లు బకాయిలను చెల్లించకపోవడంతో కాలేజీ ఓనర్లు స్టూడెంట్లను ఇబ్బంది పెడుతున్నారని 
ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు సైతం ఇవ్వకపోవడంతో స్టూడెంట్లు ఆందోళనకు గురవుతున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌‌‌‌ ఛార్జీలు, స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌ను పెంచాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అనంతరం ఆఫీసర్లకు వినతిపత్రం అందజేశారు. భువనగిరిలో బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు వెంకట్‌‌‌‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు, చిన్నం రవికుమార్, ఉడుతల రమేశ్‌‌‌‌, బాలాజీనాయక్‌‌‌‌, దత్తనాయక్, సూర్యాపేటలో రాష్ట్ర కార్యదర్శి అనంతుల శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, యువజన సంఘం జిల్లా నాయకుడు పెద్దపోల్‌‌‌‌ వినోద్‌‌‌‌గౌడ్‌‌‌‌, వీరబోయిన మహేశ్‌‌‌‌ యాదవ్, పరాల సాయి పాల్గొన్నారు.


తెలంగాణలోనే ‘ఆసరా’ లబ్ధిదారులు ఎక్కువ
మేళ్లచెరువు, వెలుగు : ఆసరా లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉన్నారని హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, చింతలపాలెం మండాలకు చెందిన పలువురికి గురువారం ఆసరా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితాలపై కేంద్రమంత్రులు విమర్శలు చేసినా సీఎం కేసీఆర్‌‌‌‌ సంక్షేమానికి కట్టుబడి ఉన్నారన్నారు. 

నాగార్జునసాగర్‌‌‌‌ను సందర్శించిన విదేశీయులు
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌ను గురువారం పలువురు విదేశీయులు సందర్శించారు. అంతర్జాతీయ శిక్షణలో భాగంగా 26 దేశాలకు చెందిన ప్రతినిధులు సాగర్‌‌‌‌కు వచ్చారు. ముందుగా విజయవిహార్‌‌‌‌ గెస్ట్‌‌‌‌ హౌజ్‌‌‌‌కు చేరుకున్న వీరికి డ్యాం డీఈ పరమేశ్‌‌‌‌, ఎస్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఐ భాస్కర్‌‌‌‌, ఎస్సై రాంబాబు స్వాగతం పలికారు. తర్వాత వారు డ్యాం వద్ద గ్యాలరీ, క్రస్ట్‌‌‌‌ గేట్లు, నీటి విడుదల తీరు, ప్రధాన జల విద్యుత్‌‌‌‌ కేంద్రాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుద్ధవనంలో మహాస్థూపం, బుద్ధ చరిత వనం, అవకాన బుద్ధ మహాస్థూపాన్ని చూశారు. 

స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌లో యాదాద్రి ప్లేయర్ల ప్రతిభ
యాదాద్రి, వెలుగు : స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌లో యాదాద్రి జిల్లా ప్లేయర్లు ప్రతిభ చూపారు. ఈ నెల 24, 25 తేదీల్లో మెదక్‌‌‌‌ జిల్లాలో జరిగిన పోటీల్లో 4 బంగారు, 5 వెండి, 2 కాంస్య పథకాలు సాధించారు. రన్నింగ్‌‌‌‌ అండర్ 18 బాలికల విభాగంలో  ఎం.మల్లిక. నిఖిత, అక్షయ, కావేరి, అండర్ 18 బాయ్స్‌‌‌‌ విభాగంలో చంద్రశేఖర్‌‌‌‌, హిమ సింధు పతకాలు సాధించారు. అలాగే షాట్‌‌‌‌పుట్‌‌‌‌, డిస్కస్‌‌‌‌ త్రో అండర్ 16 బాలుర విభాగంలో నీలవేణి నవీన్, ప్రకాశ్‌‌‌‌, సాయి కుమార్, నవదీప్ ప్రతిభ చూపారు. పతకాలు సాధించిన ప్లేయర్లను జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు, అథ్లెటిక్స్ అసోసియేషన్‌‌‌‌ జిల్లా ​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోనేటి గోపాల్‌‌‌‌ అభినందించారు.ల్ అభినందించారు.

కంపెనీల ఏర్పాటుకు కృషి చేయాలి
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేయాలని కలెక్టర్‌‌‌‌ పాటిల్‌‌‌‌ హేమంత్‌‌‌‌ కేశవ్‌‌‌‌ సూచించారు. డీఐపీసీ, టీఎస్‌‌‌‌ఐపాస్‌‌‌‌పై గురువారం కలెక్టరేట్‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 23 మందికి టీపీ రైడ్‌‌‌‌ స్కీం కింద ప్రభుత్వ సబ్సిడీ రూ.64.84 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. టీఎస్‌‌‌‌ ఐపాస్‌‌‌‌ కింద కంపెనీలకు కావాల్సిన పర్మిషన్లను త్వరగా ఇవ్వాలని చెప్పారు. టీపీ రైడ్‌‌‌‌ కింద ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 శాతం, పురుషులకు 35 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల శాఖ జీఎం తిరుపతయ్య, శిరీష, శంకర్, అనసూర్య పాల్గొన్నారు.

స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌లో యాదాద్రి ప్లేయర్ల ప్రతిభ
యాదాద్రి, వెలుగు : స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌లో యాదాద్రి జిల్లా ప్లేయర్లు ప్రతిభ చూపారు. ఈ నెల 24, 25 తేదీల్లో మెదక్‌‌‌‌ జిల్లాలో జరిగిన పోటీల్లో 4 బంగారు, 5 వెండి, 2 కాంస్య పథకాలు సాధించారు. రన్నింగ్‌‌‌‌ అండర్ 18 బాలికల విభాగంలో  ఎం.మల్లిక. నిఖిత, అక్షయ, కావేరి, అండర్ 18 బాయ్స్‌‌‌‌ విభాగంలో చంద్రశేఖర్‌‌‌‌, హిమ సింధు పతకాలు సాధించారు. అలాగే షాట్‌‌‌‌పుట్‌‌‌‌, డిస్కస్‌‌‌‌ త్రో అండర్ 16 బాలుర విభాగంలో నీలవేణి నవీన్, ప్రకాశ్‌‌‌‌, సాయి కుమార్, నవదీప్ ప్రతిభ చూపారు. పతకాలు సాధించిన ప్లేయర్లను జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు, అథ్లెటిక్స్ అసోసియేషన్‌‌‌‌ జిల్లా ​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోనేటి గోపాల్‌‌‌‌ అభినందించారు.ల్ అభినందించారు.