- ఏడేండ్లయినా ఏపీ, తెలంగాణ మధ్య ఇంకా పంచాయితీలే..
- వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు శాంతియుతంగా ఏర్పాటైనయ్
- కాంగ్రెస్ కారణంగానే ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోత, కుల రాజకీయాలు
- ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కిన వారి నుంచి పాఠాలు నేర్చుకోబోమని ఫైర్
- తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు..కానీ విభజించిన తీరే సరిగ్గా లేదు..రాజ్యసభలో మోడీ
న్యూఢిల్లీ, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించడం వల్లే.. ఏడేండ్లయినా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ అధికార గర్వమే ఇందుకు కారణమని విమర్శించారు. ‘‘ఉమ్మడి ఏపీ వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఏపీ విభజన బిల్లు ఆమోదం సందర్భంగా మైక్‌లు కట్ చేశారు. పెప్పర్ స్ప్రే కొట్టారు. ఎలాంటి చర్చా జరపలేదు. ఇదేనా ప్రజాస్వామ్య పద్ధతి?’’ అని నిలదీశారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. పాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాలు అని, దేశమంతా ఒక్కటేనన్న అంబేద్కర్ వ్యాఖ్యలను గుర్తుచేశారు. బీజేపీ ఎప్పుడూ సహకార సమాఖ్య, పోటీతత్వ వ్యవస్థను సృష్టించాలనుకుంటుందని తెలిపారు. సహకార సమాఖ్య వ్యవస్థకు జీఎస్టీ కౌన్సిల్ ఉత్తమ నిదర్శనం అన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం కలిసే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయని వెల్లడించారు.
కాంగ్రెస్ లేకపోయుంటే..
1975లో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కిన వారి నుంచి ప్రజాస్వామ పాఠాలను తాము ఎన్నటికీ నేర్చుకోబోమని ప్రధాని మోడీ అన్నారు. వారసత్వ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీలో ఎప్పుడైతే ఒక కుటుంబం సుప్రీంగా ఉంటుందో.. అప్పుడు ముందుగా నష్టపోయేది ప్రతిభ ఉన్నవాళ్లేనని చెప్పారు. ‘కాంగ్రెస్ లేకపోయినట్లయితే ఏమయ్యేదో తెలుసా?’ అని కొందరు సభ్యులు తనను అడిగారని ప్రధాని చెప్పారు. ‘‘ఒకవేళ కాంగ్రెస్ లేకపోతే.. ఎమర్జెన్సీ ఉండేదే కాదు.. కుల రాజకీయాలు చోటు చేసుకునేవి కావు.. సిక్కుల ఊచకోత ఎన్నటికీ జరిగి ఉండేదే కాదు.. కశ్మీర్‌లో పండిట్ల సమస్యలు తలెత్తేవే కావు’’ అని బదులిచ్చానని తెలిపారు. దేశం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చినప్పుడు, దేశం మరింత బలాన్ని పుంజుకొంటుందన్నారు. రాష్ట్రాలు ముందుకు సాగినప్పుడే.. దేశం ముందడుగు వేస్తుందన్నారు. యావత్ ప్రపంచం ఒక ఆశతో దేశం వైపు చూస్తున్నదని, ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదని ప్రధాని మోడీ అన్నారు.
ఎటు వైపు ఉన్నా.. ప్రజల కోసమే పని చేయాలి
అధికార పక్షంలో ఉన్నామా, లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనే దానితో సంబంధం లేకుండా ప్రజల కోసం కృషి చేయాల్సిందేనని ప్రధాని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నారనే కారణంతో ‘ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయడం మానేయాలి’ అనే మనస్తత్వం మంచికాదన్నారు. దేశంలో చేపట్టిన టీకాల కార్యక్రమం పెద్ద ఘన కార్యమేమీ కాదని కొందరు సభ్యులు చేసిన కామెంట్లపై మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కరోనా మొదలైనప్పటి నుంచి దేశంలో, ప్రపంచంలో అందుబాటులో ఉన్న ప్రతి రీసోర్స్‌ను తాము కూడగట్టే ప్రయత్నం చేశామన్నారు. కరోనా ఉన్నంత కాలం పేద ప్రజలను రక్షిస్తామని సభ ద్వారా హామీ ఇచ్చారు. కరోనాపై పోరాడే విషయంలో ఇప్పటిదాకా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 23 మీటింగ్స్ జరిపినట్లు వెల్లడించారు. కానీ కరోనా అంశంపై జరిగిన అఖిల పక్ష సమావేశాలకు ప్రతిపక్షాలు హాజరు కాలేదని, ఇది ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
ఇదే కీలక సమయం
దేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకల్ని జరుపుకునే నాటికి.. దేశ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఆలోచించడానికి ఇది కీలక సమయమని ప్రధాని అన్నారు. ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు. ప్రపంచ దేశాలు ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. 2021లో దాదాపు కోటీ 20 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో సుమారు 60 లక్షల నుంచి 65 లక్షల మంది 18 నుంచి 25 ఏండ్ల మధ్య వారు ఉన్నారని, వారికి ఇవి ఫస్ట్ జాబ్స్ అని అన్నారు.
కరోనా టైంలోనూ అభివృద్ధి పనులు ఆగలే
దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ వేసుకుంటున్నారని ప్రధాని చెప్పారు. తమను తాము కాపాడుకోవడమే కాదు.. ఇతరులను కూడా కాపాడుతున్నారని అభినందించారు. ‘‘కరోనా టైంలో దేశ అభివృద్ధిపై చాలా మంది ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. మేం దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార పదార్థాలు ఇచ్చాం. రికార్డు స్థాయిలో ఇండ్లను నిర్మించాం. వాటికి సౌలతులన్నీ కల్పించాం. దాదాపు 5 కోట్ల మంది ప్రజలకు ట్యాప్ వాటర్ అందించాం” అని మోడీ వివరించారు. ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేడెట్ ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చెప్పారు. కరోనా టైంలో అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ రంగాలపై శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పారు.
For More News..