- పీసీసీ డెలిగేట్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై ఆగ్రహం
- చిన్నారెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారంటూ ఆరోపణ
- జనవరి ఫస్ట్ వీక్‌లో భారీ సభ పెడతామని ప్రకటన
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా కాంగ్రెస్‌లో మాజీమంత్రి చిన్నారెడ్డి, సీనియర్ నాయకుల మధ్య నడుస్తున్న పంచాయతీ రోజురోజుకు ముదురుతోంది. మూడు నెలల కింద జరిగిన ఓ మీటింగ్‌లో తన ఓటమికి సీనియర్లే కారణమని అనడంతో మొదలైన ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల టీపీసీసీ కమిటీల ప్రకటన అనంతరం చిన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మీటింగ్‌ను బహిష్కరించి షాద్‌నగర్‌లో మీటింగ్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ ‘చిన్నారెడ్డి హటావో.. కాంగ్రెస్ బచావో’ అని నినాదాలు చేయడం ఆయనకు కోపం తెప్పించింది. దీంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ హోదాలో పీసీసీ డెలిగేట్, మాజీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్‌కు గురువారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాధానం చెప్పకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై అదేస్థాయిలో స్పందించిన సీనియర్లు శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి చిన్నారెడ్డిని తీరును తప్పు పట్టారు. మీటింగ్‌లో 200 మంది కార్యకర్తలు పాల్గొంటే బీసీ నేతకే షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రకటించారు. జనవరి ఫస్ట్ వీక్‌లో భారీ బహిరంగ పెడతామని ప్రకటించారు.
తన ఓటమికి సీనియర్లే కారణమని..
నియోజకవర్గం నుంచి గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ వస్తున్న చిన్నారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో మంత్రిగానూ అవకాశం దక్కించుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి సీనియర్లే కారణమని భావించిన ఆయన వారిని దూరం పెడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ మీటింగ్‌లో సీనియర్లతో అవసరం లేదని, కొత్త కార్యకర్తలతో పనిచేయించుకుంటానని ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలకు కూడా వారికి సమాచారం ఇవ్వడం లేదు. ఇది నచ్చని సీనియర్లు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు.
కొడుకును తెరపైకి తేవడంతో..
చిన్నారెడ్డి ప్రతక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల తన కొడుకు ఆదిత్య రెడ్డిని ఢిల్లీకి తీసుకువెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పరిచయం చేశారు. దీంతో తన కొడుకును బరిలో దింపేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీన్ని సీనియర్లు జీర్జించుకోలేకపోతున్నారు.ఈ సారి బీసీ క్యాండిడేట్‌కు అవకాశం ఇవ్వాలని, లేదంటే తాము పనిచేయలేమని హైకమాండ్‌ను హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్లుగా పైసా ఆశించకుండా చిన్నారెడ్డి కోసం పనిచేశామని, తమపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటున్నారు.
డబ్బులు ఖర్చు పెట్టరనే..
చిన్నారెడ్డి ముందు నుంచీ ఆచూతూచీ వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా ఖర్చుల విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. కార్యకర్తలు, నాయకులకు ఏది ఇచ్చినా లెక్కపెట్టి ఇవ్వడం అలవాటు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన అప్డేట్ కావడంలేదని సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మీటింగ్‌లు, సభలకు వచ్చే కార్యకర్తలకు పెట్రోల్, భోజనం ఖర్చులు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. బహిరంగ సభలకు జన సమీకరణ విషయంలోనూ తమపైనే భారం వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే జిల్లాలో పార్టీ మనుగడ కష్టమని, అసెంబ్లీతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన ఓటమికి కారణం ఇదేనని అంటున్నారు.
బీసీ నేతపై కక్ష సాధింపు
పీసీసీ డెలిగేట్ శంకర్ ప్రసాద్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వటంపై పార్టీ సీనియర్లు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, రాష్ట్ర నాయకులు తిరుపతమ్మ, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సతీశ్ యాదవ్, నరోత్తమరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ షాద్‌నగర్ మీటింగ్‌లో200 మంది పాల్గొన్నా.. కేవలం బీసీ నేతకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసిన చిన్నారెడ్డిని నాలుగు సార్లు గెలిపించామని గుర్తుచేశారు. ఢిల్లీస్థాయిలో సంబంధాలు ఉన్న చిన్నారెడ్డి జిల్లాలో పార్టీని పట్టించుకోకపోవడంతో చల్లా వెంకట్రామ్ రెడ్డి లాంటి లీడర్లు పార్టీ వీడారని వాపోయారు. సీనియర్లు తనకు పోటీ అవుతారనే పార్టీని గ్రూపులుగా విడదీశారని ఆరోపించారు. చిన్నారెడ్డి, ఆయన కొడుకు ఆదిత్య రెడ్డికి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తామని స్పష్టం చేశారు.