రేగొండ, వెలుగు : ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేగొండలో మంగళవారం కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ సక్సెస్ అయ్యింది. పరకాల భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. జనం కేరింతలు, జై రేవంతన్న నినాదాలతో సభ ప్రాంగణం హోరెత్తింది. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా జిల్లాకు రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. అనుకున్న దానికన్న భారీగా జనాలు తరలివచ్చి జనజాతర సభను సక్సెస్ చేయడంతో కాంగ్రెస్ నాయకులు ఖుషి అవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సభ విజయవంతం కావడానికి కృషి చేశారు.
ఎంపీ ఎన్నికల్లో
భూపాలపల్లి నుంచి 75వేల మెజార్టీ ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డికి హామీ ఇచ్చారు. దీంతో సీఎం తన స్పీచ్‌లో మెజార్టీ మీరివ్వండి అభివృద్ధి బాధ్యత తనదని చెప్పడంతో నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం టూర్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
బీజేపీ హామీలను తుంగలో తొక్కింది : మంత్రి సీతక్క
రాష్ర్ట విభజన సమయంలో ఇచ్చిన హామీలను బీజేపీ తుంగలో తొక్కిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతోందన్నారు.
బీజేపీ దేశాన్ని లూటీ చేసింది : మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ లూటీ చేస్తే దేశాన్ని మోదీ లూటీ చేశారని దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్‌ను ప్రధానిని చేయాలన్నారు.
కాంగ్రెస్‌తోనే దేశానికి రక్ష : మంత్రి శ్రీధర్‌బాబు
దేశానికి కాంగ్రెస్‌తోనే రక్షణ ఉంటదని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ పార్టీలకు ఓటు వేస్తే ప్రజాస్వామ్య మనుగడ కష్టంగా ఉంటుందన్నారు.