
- ఓటమితో కుదేలైన బీఆర్ఎస్
- కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ దూరం
- సంస్థాగత బలోపేతంపై దృష్టిపెట్టని బీజేపీ
- విజయసంకల్పయాత్రకు అంతంతే స్పందన
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ దూకుడు మీద కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటికి ఏడు సెగ్మెంట్లను క్లీన్ స్వీప్ చేసిన ఆ పార్టీ, ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. కాంగ్రెస్ నుంచి యువనేత గడ్డం వంశీ కృష్ణ టికెట్ ఆశిస్తున్నారు. కాకా ఫ్యామిలీకి చెందిన ఆయనకు టికెట్దక్కితే గెలుపు నల్లేరుపై నడకే అనే అభిప్రాయం ఉంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లలో ఆరింటిని గెలుచుకున్న బీఆర్ఎస్ అదే ఊపులో 2019లో పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది.
కానీ , ప్రస్తుతం ఏడు అసెంబ్లీ స్థానాలను కోల్పోయిన గులాబీ పార్టీ పూర్తిగా డీలా పడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్‌లో చేరగా, చివరికి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత సైతం పార్టీ మారడంతో హైకమాండ్ దిక్కుతోచని స్థితిలో పడింది. ఇక బలమైన క్యాడర్ లేకపోవడం బీజేపీకి మైనస్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మంచిర్యాలలో తప్ప ఏ ఒక్కచోటా డిపాజిట్ దక్కించుకోని ఆ పార్టీ కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం కష్టసాధ్యమనే చెప్పవచ్చు.
వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లను గెలుచుకున్న కాంగ్రెస్ 56 శాతం ఓట్లను రాబట్టింది. బీఆర్ఎస్, బీజేపీ సాధించిన ఓట్లు కేవలం 37.5 శాతం కావడం, ఇప్పటికిప్పుడు ఓటర్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం లేకపోవడంతో విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. రాజకీయంగా అనుకూల పరిస్థితులున్నప్పటికీ అభ్యర్థి విషయంలో రాజీపడి, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదన్నది హైకమాండ్ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని దించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీకి కాకా ఫ్యామిలీ నుంచి గడ్డం వంశీకృష్ణ ఆసక్తి చూపుతున్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కాకా వెంకటస్వామి కృషి ఎంతో ఉంది.
ప్రజల్లో, క్యాడర్‌లో ఆ ఫ్యామిలీకి మంచి ఆదరణ ఉంది. వెంకటస్వామి తనయులు వివేక్ వెంకటస్వామి, వినోద్ ఇద్దరూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో వంశీకృష్ణకు టికెట్ ఇస్తే విజయావకాశాలు మెండుగా ఉంటాయని క్యాడర్‌లో చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ..
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి బీఆర్ఎస్ ఇంకా తేరుకోలేదు. ఓటమి తర్వాత క్యాడర్‌కు మనోధైర్యం కల్పించాల్సిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలంతా ముఖం చాటేశారు. సొంత కార్యకలాపాల్లో మునిగి, క్యాడర్‌కు టచ్‌లోకి కూడా రావడం లేదు. ఆ మధ్య పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మీటింగ్‌కు వచ్చిన బాల్క సుమన్ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసి పత్తా లేకుండా పోయారు. ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.
మాజీ ఎమ్మెల్యేల తీరుతో దాదాపు ఏడు నియోజకవర్గాల పరిధిలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో కారు దిగి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది చాలదన్నట్లు సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత సైతం బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో గులాబీ పార్టీ పెద్దపల్లి ఎంపీ స్థానంపై దాదాపుగా ఆశలు వదిలేసుకుంది. పోటీకి నేతలెవరూ ముందుకు రాకపోవడంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలుకావడం ఆయనకు మైనస్‌గా మారింది.
క్యాడర్ లేని బీజేపీ..
పెద్దపల్లి నియోజకవర్గంలో సంస్థాగతంగా బలంగా లేకపోవడం బీజేపీకి ప్రతికూల అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మంచిర్యాలలో తప్ప మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కాషాయ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 6.5 శాతం మాత్రమే. కాకపోతే మోదీ ఇమేజ్, హిందూత్వ, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఇతరత్రా జాతీయ అంశాలు కలిసివస్తాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం ఆ పార్టీ తరుపున పోటీచేసేందుకు బలమైన అభ్యర్థులెవరూ లేరు. గతంలో పోటీచేసిన ఎస్ కుమార్‌తో పాటు బొడిగె శోభ లాంటి నేతలు టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇటీవల ఓ పార్టీలో చేరిన ఓ మహిళా నేత, తనకు టికెట్ ఇస్తే వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయసంకల్ప యాత్రకు పెద్దపల్లి నియోజకవర్గంలో కనీస ఆదరణ రాకపోవడంతో ఈ సీటుపై ఆ పార్టీ హైకమాండ్ దాదాపు ఆశలు వదిలేసుకున్నదనే చెప్పవచ్చు!