టికెట్ ఇస్తా అని..రూ. 10 కోట్లు, 5 ఎకరాలు తీసుకుండు.. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి రూ. 10 కోట్లు, 5 ఎకరాలు తీసుకున్నారని మహేశ్వరం నియోజకవర్గ  కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు.  రేవంత్ రెడ్డిని వెంటనే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని కొత్త మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ టికెట్ కోసం బడంగ్‌పేట మేయర్  చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి నుంచి రూ. 10 కోట్లు, 5 ఎకరాలు రేవంత్ రెడ్డి తీసుకున్నారని కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతి విషయంలో రేవంత్ రెడ్డితో పాటు.. చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. 


ALSO READ: TSPSC: టీఎస్పీఎస్సీ కాకమ్మ కథలు చెబుతోంది: షర్మిల

  తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాకపోతే  రేవంత్ రెడ్డి  భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలని కొత్త మనోహర్ రెడ్డి సవాల్ విసిరారు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తన ఎదుగుదలను చూసి కాంగ్రెస్  నుండి సస్పెండ్ చేశారని చెప్పారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే రేవంత్ పై పోటీ చేసి ఒడిస్తానని ఆయన సవాల్ చేశారు. తన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని మనోహర్ రెడ్డి తెలిపారు.